మత్తయి 10:26-31
మత్తయి 10:26-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“కాబట్టి వారికి భయపడకండి, ఎందుకంటే దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. నేను మీతో చీకట్లో చెప్పేదానిని మీరు పగటి వెలుగులో చెప్పండి; మీ చెవిలో చెప్పబడినదానిని పైకప్పుల నుండి ప్రకటించండి. శరీరాన్ని చంపి ఆత్మను చంపలేనివారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి. రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. కాబట్టి భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.
మత్తయి 10:26-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు. మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి. “ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి. రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.
మత్తయి 10:26-31 పవిత్ర బైబిల్ (TERV)
“అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి. నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి. “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి. ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు. మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు.
మత్తయి 10:26-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.