మత్తయి 1:1-22
మత్తయి 1:1-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు యేసు వంశావళి: అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు యూదా అతని సహోదరులు. యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము. అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను, నయస్సోను కుమారుడు శల్మాను. శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెష్షయి. రాజైన దావీదు యెష్షయి కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య. సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబీయా, అబీయా కుమారుడు ఆసా. ఆసా కుమారుడు యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు, ఆహాజు కుమారుడు హిజ్కియా. హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషీయా. యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు. బబులోనుకు కొనిపోబడిన తర్వాత పుట్టినవారు వీరే: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు, అబీహూదు కుమారుడు ఎల్యాకీము, ఎల్యాకీము కుమారుడు అజోరు. అజోరు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు ఆకీము, ఆకీము కుమారుడు ఎలీహూదు. ఎలీహూదు కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు మత్తాను, మత్తాను కుమారుడు యాకోబు. యాకోబు కుమారుడైన యోసేపు మరియకు భర్త. ఆమె యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి. ఈ విధంగా అబ్రాహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు, దావీదు నుండి బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరాలు, చెరకు కొనిపోబడినప్పటి నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు. యేసు క్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానం చేయబడింది. కానీ వారిద్దరు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. అయితే ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఇలా ఆలోచిస్తూ ఉండగా, కలలో ప్రభువు దూత అతనికి కనపడి, “దావీదు కుమారుడవైన యోసేపూ, మరియను నీ భార్యగా ఇంటికి తీసుకెళ్లడానికి భయపడకు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ మూలంగా గర్భం ధరించింది. ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తారు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టాలి” అని చెప్పాడు. ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది.
మత్తయి 1:1-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబ్రాహాము వంశం వాడైన దావీదు వంశం వాడు యేసు క్రీస్తు వంశావళి. అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు. యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము. ఆరాము కొడుకు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. నయస్సోను కొడుకు శల్మాను. శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి. యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను. సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు ఉజ్జీయా. ఉజ్జీయా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా. యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు. బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి. యెకొన్యా కొడుకు షయల్తీయేలు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు. అబీహూదు కొడుకు ఎల్యాకీము. ఎల్యాకీము కొడుకు అజోరు. అజోరు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు ఆకీము. ఆకీము కొడుకు ఎలీహూదు. ఎలీహూదు కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు మత్తాను. మత్తాను కొడుకు యాకోబు. యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె ద్వారా క్రీస్తు అనే పేరు గల యేసు పుట్టాడు. ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పద్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకూ పద్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకూ పద్నాలుగు తరాలు. యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు. అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు. “‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది.
మత్తయి 1:1-23 పవిత్ర బైబిల్ (TERV)
యేసు క్రీస్తు వంశక్రమము: ఈయన దావీదు మరియు అబ్రాహాము వంశానికి చెందినవాడు. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు. యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.) పెరెసు కుమారుడు ఎస్రోము. ఎస్రోము కుమారుడు అరాము. అరాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మా. శల్మా కుమారుడు బోయజు. (బోయజు తల్లి రాహాబు.) బోయజు కుమారుడు ఓబేదు. (ఓబేదు తల్లి రూతు.) ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు రాజు దావీదు. దావీదు కుమారుడు సొలొమోను. (సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.) సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా. ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు యోతాము. యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా. హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోసు. ఆమోసు కుమారుడు యోషీయా. యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు. బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు. షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు. అబీహూదు కుమారుడు ఎల్యాకీము. ఎల్యాకీము కుమారుడు అజోరు. అజోరు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు ఆకీము. ఆకీము కుమారుడు ఎలీహూదు. ఎలీహూదు కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు మత్తాను. మత్తాను కుమారుడు యాకోబు. యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు భార్య మరియ. మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు. అంటే అబ్రాహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పదునాలుగు తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరాలు. అలా కొనిపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు పదునాలుగు తరాలు. యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు. అతడీవిధంగా అనుకొన్న తర్వాత, దేవదూత అతనికి కలలో కనిపించి, “యోసేపూ, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు. ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు” అని అన్నాడు. ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు” ఇది నిజం కావటానికే ఇలా జరిగింది.
మత్తయి 1:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను; యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీ నాదాబు నయస్సోనును కనెను; నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్ష యిని కనెను; యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను; ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను; ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను; హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను; యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను; జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను; యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదువరకు తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తువరకు పదునాలుగు తరములు. యేసు క్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులనుగూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై –దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు