లూకా 8:4-15
లూకా 8:4-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒక రోజు ప్రతి పట్టణం నుండి గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వస్తుండగా, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. అతడు విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి; అవి కాళ్లతో త్రొక్కబడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కాబట్టి మొక్కలు ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి, వాటితో ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, విత్తబడినవాటి కన్న వందరెట్లు అధికంగా పంటనిచ్చాయి.” ఆయన ఇది చెప్పిన తర్వాత, “వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని బిగ్గరగా అన్నారు. శిష్యులు, ఈ ఉపమాన భావం ఏమిటి? అని ఆయనను అడిగారు. ఆయన, “దేవుని రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది, కాని ఇతరులతో ఉపమానరీతిలోనే మాట్లాడతాను, ఎందుకంటే, “ ‘చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు.’ “ఇది ఈ ఉపమాన భావం: విత్తనం దేవుని వాక్యము. దారి ప్రక్కన పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని వింటారు, కానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వారు వాక్యాన్ని విన్నప్పుడు దానిని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు ఉండదు. వారు కొంతకాలమే నమ్ముతారు, శోధన సమయంలో త్వరగా పడిపోతారు. ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు అంటే, వారు వాక్యాన్ని వింటారు, కాని కాలం గడిచేకొలది తమ జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ఐశ్వర్యాలు ఆనందాలతో అణచివేయబడడంవల్ల, వాక్యంలో ఎదగరు. అయితే మంచి నేలలో పడిన విత్తనాలు యోగ్యులై మంచి హృదయం కలిగినవారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని పాటిస్తారు, పట్టుదలతో ఫలిస్తారు.
లూకా 8:4-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒకసారి ప్రతి పట్టణం నుండీ ప్రజలు పెద్ద గుంపులుగా యేసు దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడి మనుషుల కాళ్ళ కింద నలిగిపోయాయి. కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగివేశాయి. మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి. మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి. మరి కొన్ని మంచి నేలపై పడ్డాయి. అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి.” ఆయన ఇలా చెప్పి, “వినడానికి చెవులున్నవాడు విను గాక” అని బిగ్గరగా అన్నాడు. ఆయన శిష్యులు, “ఈ ఉపమానం అర్థం ఏమిటి?” అని అడిగారు ఆయన, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను. ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం. దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు. రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు. మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.
లూకా 8:4-15 పవిత్ర బైబిల్ (TERV)
అనేక గ్రామాల నుండి ప్రజలు యేసు దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద గుంపు సమావేశమైంది. యేసు వాళ్ళకీ ఉపమానం చెప్పడం మొదలు పెట్టాడు: “ఒక రైతు విత్తనాలు చల్లడానికి పొలానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారిపై పడ్డాయి. వాటిని ప్రజలు త్రొక్కి వేసారు. పక్షులు వచ్చి వాటిని తిని వేసాయి. మరికొన్ని విత్తనాలు మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి మొలకెత్తాయి, కాని వాటికి తేమ దొరకనందువలన అవి వాడిపొయ్యాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల స్థలంలో పడ్డాయి. ఈ విత్తనాలతో పాటు ముళ్ళ మొక్కలు కూడా పెరిగి వాటిని పెరగనివ్వలేదు. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి పెద్దవై నూరు రెట్లు ఫలాన్నిచ్చాయి.” ఈ విధంగా చెప్పి, “వినే వాళ్ళు జాగ్రత్తగా వినాలి” అని బిగ్గరగా అన్నాడు. శిష్యులు, “ఈ ఉపమానానికి అర్థమేమిటని” ఆయన్ని అడిగారు. యేసు, “దేవుని రాజ్యం యొక్క రహస్య జ్ఞానం తెలుసుకొనే అవకాశం మీకివ్వబడింది. కాని యితర్లకు, ఆ రహస్యం ఉపమానాలు ఉపయోగించి చెబుతాను. ఎందుకంటే, ‘వాళ్ళు చూస్తున్నట్లే వుండి చూడలేరు, వాళ్ళు వింటున్నదానిని అర్థం చేసుకోలేరు.’ “ఇందులోని అర్థం యిది: విత్తనం దైవ సందేశం. దారిపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు ప్రజలు వింటారు. కాని సైతాను వచ్చి వాళ్ళ హృదయాల్లో ఉన్న దైవ సందేశాన్ని తీసుకువెళ్తాడు. వీళ్ళు విశ్వసించరాదని, రక్షింపబడరాదని వాని ఉద్దేశ్యం. రాతి నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది; కొందరు దైవ సందేశం విని దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. కాని వీళ్ళ విశ్వాసానికి వేర్లు ఉండవు. కనుక వాళ్ళు కొద్ది కాలం మాత్రమే విశ్వసిస్తారు. పరీక్షా సమయం రాగానే వెనుకంజ వేస్తారు. “ముళ్ళు పెరిగే నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు వింటారు కాని సుఖదుఃఖాలు, ధనము వాళ్ళను అణచి వేయటం వల్ల వాళ్ళు సంపూర్ణంగా ఫలించరు. సారవంతమైన నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు ఉత్తమమైన మంచి మనస్సుతో విని, విన్న వాటిని హృదయాల్లో దాచుకొని పట్టుదలతో మంచి ఫలాన్నిస్తారు.
లూకా 8:4-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బహుజనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను –విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను. మరి కొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను. మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు–వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు–ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా ఆయన–దేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడుచున్నవి.) ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తికొని పోవును. రాతినేలనుండు వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.