లూకా 5:5-16

లూకా 5:5-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అందుకు సీమోను, “బోధకుడా, రాత్రంతా కష్టపడినా మేము ఏమి దొరకలేదు. అయినా నీవు చెప్పావు కాబట్టి నేను వలలను వేస్తాను” అని ఆయనతో అన్నాడు. వారు అలా చేసినప్పుడు, విస్తారమైన చేపలు వలల్లో పడి ఆ వలలు పిగిలిపోసాగాయి. అందుకు వారు వేరే పడవల్లోని తమ జతపనివారిని పిలిచి వచ్చి సహాయం చేయమని సైగలు చేశారు, కాబట్టి వారు వచ్చి ఆ రెండు పడవలను నింపగా ఆ బరువుకు ఆ పడవలు మునిగిపోసాగాయి. సీమోను పేతురు జరిగింది చూసి, యేసు మోకాళ్లమీద పడి, “ప్రభువా, నా దగ్గర నుండి వెళ్లిపో; నేను పాపిష్ఠి వాడను!” అన్నాడు. అతడు అతనితో ఉన్నవారందరు విస్తారంగా పట్టిన చేపలను చూసి ఆశ్చర్యపడ్డారు. సీమోను జతపనివారైన జెబెదయి కుమారులైన, యాకోబు యోహానులు కూడా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసు సీమోనుతో, “భయపడకు; ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టే జాలరివి” అన్నారు. వారు తమ పడవలను ఒడ్డుకు చేర్చి, అన్నిటిని విడిచి ఆయనను వెంబడించారు. యేసు ఒక పట్టణంలో ఉన్నప్పుడు, కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు యేసును చూసి, నేల మీద సాగిలపడి, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అని ఆయనను బ్రతిమాలాడు. యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, బాగవు” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది. అప్పుడు యేసు, “నీవు ఎవరికి చెప్పకు, కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని వారికి సాక్ష్యంగా ఉండేలా, నీ శుద్ధీకరణ కోసం మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని వానిని ఆదేశించారు. అయినాసరే ఆయనను గురించిన వార్త మరి ఎక్కువగా వ్యాపించి, ఆయన చెప్పే మాటలను వినడానికి వారి వ్యాధుల నుండి స్వస్థపడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. అయితే యేసు తరచుగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లి ప్రార్థించారు.

షేర్ చేయి
చదువండి లూకా 5

లూకా 5:5-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు. వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి. వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి. సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు. ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు. వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో, “భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు. వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు. యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, “నాకిష్టమే. బాగు పడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది. “ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు” అని యేసు అతన్ని ఆదేశించాడు. అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాలను బాగుచేసుకోడానికీ వచ్చారు. అయితే ఆయన తరచుగా జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు.

షేర్ చేయి
చదువండి లూకా 5

లూకా 5:5-16 పవిత్ర బైబిల్ (TERV)

సీమోను, “అయ్యా! మేము రాత్రంతా చాలా కష్టపడి పనిచేసినా చేపలు పట్టలేక పోయాము. అయినా మీరు చెబుతున్నారు కాబట్టి మేము వేస్తాము” అని అన్నాడు. వాళ్ళు, ఆయన చెప్పినట్లు చేసి ఎన్నో చేపలు పట్టారు. ఆ బరువుకు వలలు చినగటం మొదలు పెట్టాయి. కాబట్టి ప్రక్క పడవలో ఉన్న తమతోటి పని వాళ్ళను వచ్చి తమకు సహాయం చెయ్యమని అడిగారు. వాళ్ళు వచ్చి ఆ రెండు పడవల్ని పూర్తిగా చేపల్తో నింపారు. ఆ బరువుకు వాళ్ళ పడవలు మునగసాగాయి. సీమోను పేతురు యిది చూసి యేసు కాళ్ళపైపడి, “నేనొక పాపిని. వెళ్ళిపొండి ప్రభూ!” అని అన్నాడు. అతడు, అతనితో ఉన్న వాళ్ళు తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళే కాక జెబెదయ కుమారులు యాకోబు, యోహానులు కూడా ఆశ్చర్యపోయారు. వీళ్లు సీమోను భాగస్థులు. యేసు సీమోనుతో, “చింతించకు. ఇప్పటి నుండి నువ్వు మనుష్యుల్ని పడ్తావు!” అని అన్నాడు. వాళ్ళు పడవలు ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయన్ని అనుసరించారు. యేసు ఒక గ్రామంలో ఉండగా ఒళ్ళంతా కుష్టురోగం ఉన్న వాడు ఆయన్ని చూడాలని వచ్చాడు. యేసును చూడగానే ఆయన కాళ్ల ముందు సాష్టాంగ పడి, “ప్రభూ! మీరు దయ తలిస్తే నాకు నయం చెయ్యగలరు!” అని వేడుకొన్నాడు. యేసు, “నీకు నయం చేస్తాను!” అని అంటూ తన చేయి జాపి అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతణ్ణి వదిలి పోయింది. ఆ తర్వాత యేసు, “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. కాని వెళ్ళి యాజకునికి చూపు! మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. నీకు నయమైపోయిందని నిరూపించుకో!” అని ఆజ్ఞాపించాడు. కాని యేసును గురించి యింకా చాలా మందికి తెలిసిపోయింది. ఆయన బోధనలు వినటానికి, తమరోగాలు నయం చేసుకోవటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. కాని యేసు ప్రార్థించటానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు.

షేర్ చేయి
చదువండి లూకా 5

లూకా 5:5-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలుమునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితోకూడనున్నవారందరును విస్మయమొందిరి. ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు–భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన యొక పట్టణములోనున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి–ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టి–నాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడాయన–నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. అయితే ఆయననుగూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్లుచుండెను.

షేర్ చేయి
చదువండి లూకా 5