లూకా 24:1-53

లూకా 24:1-53 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

వారం మొదటి రోజున తెల్లవారేటప్పుడు స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు. వారు సమాధి రాయి దొర్లించబడి ఉండడం చూశారు, కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. వారు ఈ విషయాన్ని గురించి కలవరపడుతూ ఉండగా, మిలమిల మెరుస్తున్న వస్త్రాలను ధరించిన ఇద్దరు మనుష్యులు వారి ప్రక్కన నిలబడి ఉండడం చూశారు స్త్రీలు భయంతో తమ ముఖాలను నేలకు వంచుకొన్నారు కానీ ఆ పురుషులు వారితో, “మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదకుతున్నారు? ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచారు! ఆయన మీతో గలిలయలో ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి, ‘మనుష్యకుమారుడిని పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను సిలువ వేసి చంపుతారు, ఆయన మూడవ రోజున సజీవంగా లేస్తాడని’ చెప్పాడు కదా!” అని అన్నారు. అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. వారు సమాధి నుండి తిరిగివెళ్లి, ఈ సంగతులను పదకొండు మంది శిష్యులకు మిగిలిన వారందరికి చెప్పారు. శిష్యులకు అపొస్తలులకు ఈ విషయాన్ని చెప్పింది వీరే: మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లియైన మరియ ఇంకా వారితో ఉన్న ఇతర స్త్రీలు. ఈ స్త్రీలు చెప్పిన మాటలు వారికి వెర్రి మాటలుగా అనిపించాయి, కాబట్టి వారు నమ్మలేదు. అయితే పేతురు లేచి, సమాధి దగ్గరకు పరుగెత్తికొని పోయి, వంగి, నారబట్టలు మాత్రమే పడి ఉండడం చూసి, సమాధిలో ఏమి జరిగిందో అని ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్లిపోయాడు. అదే రోజున ఇద్దరు శిష్యులు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. వారు జరిగిన ఈ విషయాలన్నిటిని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వారు అలా మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నప్పుడు, యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడ నడిచారు; కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్లు మూయబడ్డాయి. ఆయన వారిని, “మీరు నడుస్తూ మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటి?” అని అడిగారు. అందుకు వారు దిగులు ముఖాలతో నిలబడిపోయారు. వారిలో క్లెయొపా అనేవాడు, “గత కొద్ది దినాల్లో యెరూషలేములో జరిగిన సంగతుల గురించి తెలియని వ్యక్తివి నీ ఒక్కడివేనా?” అని అడిగాడు. “ఏ విషయాలు?” అని ఆయన అడిగారు. అందుకు వారు, “నజరేయుడైన యేసును గురించి, ఆయన దేవుని ముందు ప్రజలందరి ముందు, మాటలోను కార్యాలలోను శక్తిగల ప్రవక్త. మన ముఖ్య యాజకులు అధికారులు ఆయనను మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించారు; కాని ఇశ్రాయేలు ప్రజలను విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షణ కలిగి ఉన్నాము. ఇంతకన్నా ఏముంది, ఇదంతా జరిగి నేటికీ మూడవ రోజు అవుతుంది. దానికి తోడు, మాలో కొందరు స్త్రీలు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఈ రోజు తెల్లవారగానే వారు సమాధి దగ్గరకు వెళ్లారు, ఆయన దేహం అక్కడ కనబడలేదు. వారు తిరిగివచ్చి, దేవదూతలు తమకు కనబడి ‘ఆయన బ్రతికే ఉన్నాడు’ అని చెప్పినట్లు మాకు చెప్పారు. మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధి దగ్గరకు వెళ్లి, ఆ స్త్రీలు చెప్పినట్లే చూశారు, కానీ వారు యేసును చూడలేదు” అని ఆయనకు చెప్పారు. అందుకాయన, “మీరు ఎంత అవివేకులు, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మలేని మందమతులుగా ఉన్నారు. క్రీస్తు ఈ శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించకూడదా?” అని వారితో అన్నారు. ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరు లేఖనాల్లో తనను గురించి వ్రాసిన విషయాలను వారికి వివరించారు. ఇంతలో వారు వెళ్లవలసిన గ్రామం సమీపించారు, అయితే యేసు ఇంకా ముందుకు వెళ్తున్నట్లు వారికి అనిపించింది. అందుకని వారు, “ప్రొద్దు గ్రుంకి, సాయంకాలం కావచ్చింది, కాబట్టి మాతో కూడ ఉండండి” అని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడ ఇంట్లోకి వెళ్లారు. యేసు వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఆయన ఒక రొట్టెను తీసుకుని, కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు వారి కళ్లు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు, అయితే ఆయన వారికి కనబడకుండా పోయారు. అప్పుడు వారు ఒకనితో ఒకడు, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనాలు వివరిస్తూ ఉంటే మన అంతరంగంలో మన హృదయాలు మండుతున్నట్లు అనిపించలేదా?” అని చెప్పుకొన్నారు. వారు వెంటనే లేచి యెరూషలేముకు తిరిగి వెళ్లారు. అక్కడ పదకొండు మంది శిష్యులు వారితో ఉన్నవారందరు సమకూడి, వారు, “అది నిజమే! ప్రభువు నిజంగానే లేచి సీమోనుకు కనిపించారు” అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ ఇద్దరు దారిలో జరిగిన సంగతులను, యేసు రొట్టె విరిచేటప్పుడు ఆయనను ఎలా గుర్తించారో అని వారికి చెప్పారు. వారు దాని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగా, యేసు తానే వారి మధ్య నిలబడి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో అన్నారు. తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. ఆయన వారితో, “మీరెందుకు కలవరపడుతున్నారు, మీ మనస్సుల్లో ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి? నా చేతులను నా పాదాలను చూడండి, ‘ఇది నేనే!’ నన్ను ముట్టుకొని చూడండి; నాకు ఉన్నట్లు, ఒక భూతానికి ఎముకలు మాంసం ఉండవు” అని చెప్పారు. ఆయన ఇలా చెప్పి, తన చేతులను, తన పాదాలను వారికి చూపించారు. అయితే వారు సంతోషాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి ఇంకా నమ్మలేకుండా ఉన్నప్పుడు, ఆయన వారిని, “ఇక్కడ మీ దగ్గర ఏమైన తినడానికి ఉందా?” అని అడిగారు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. ఆయన దానిని తీసుకుని వారి ముందే తిన్నారు. తర్వాత ఆయన వారితో, “మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల పుస్తకంలోను నన్ను గురించి వ్రాయబడినవి అన్ని నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను కదా!” అని అన్నారు. అప్పుడు వారు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచారు. ఆయన వారితో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు హింసించబడి మూడవ రోజున మరణం నుండి లేస్తారని, యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసు పేరట పశ్చాత్తాపం పాపక్షమాపణ ప్రకటించబడుతుంది. ఈ సంగతులన్నిటికి మీరే సాక్షులు. నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ దగ్గరకు పంపిస్తున్నాను కాబట్టి పైనుండి శక్తి మిమ్మల్ని కమ్ముకునే వరకు మీరు పట్టణంలోనే ఉండండి” అని వారితో చెప్పారు. ఆయన బేతనియా ప్రాంతం వరకు వారిని తీసుకుని వెళ్లి, చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణమయ్యారు. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు. వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు.

షేర్ చేయి
చదువండి లూకా 24

లూకా 24:1-53 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు. సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం చూసి లోపలికి వెళ్ళారు. కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు. అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు. వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు, “సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి” అన్నారు. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు. ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో ఉన్న యితర స్త్రీలూ. అయితే విన్నవారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజే ఇద్దరు శిష్యులు యెరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయిస్ గ్రామానికి వెళ్తున్నారు. జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. అలా వారు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కళ్ళు మూతలు పడ్డట్టు అయింది. ఆయన, “మీరు నడుస్తూ పరస్పరం చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?” అని వారిని అడిగాడు. దాంతో వారు దుఃఖంతో నిండిపోయి నిలబడిపోయారు. వారిలో క్లెయొపా అనేవాడు, “యెరూషలేములో కాపురముంటూ ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా” అన్నాడు. ఆయన, “ఏ విషయాలు?” అని అడిగాడు. అప్పుడు వారు, “నజరేతు వాడైన యేసును గురించిన విషయాలే. ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు. మన ముఖ్య యాజకులూ అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి, ఎలా సిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. ఈ విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దేహం కనిపించక తిరిగి వచ్చారు. కొందరు దేవదూతలు తమకు కనబడి, ‘ఆయన బతికే ఉన్నాడు’ అని చెప్పారు అని మాకు తెలిపినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు. అందుకాయన, “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని వారితో అన్నాడు. ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వారికి తెలియజేశాడు. ఇంతలో వారి గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది. దాంతో వారు, “పొద్దు వాలుతున్నది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు” అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు. అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు ఆయనను గుర్తు పట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు. అప్పుడు వారు, “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్టు అనిపించ లేదూ” అని చెప్పుకున్నారు. అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని “ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు” అని చెప్పుకుంటున్నారు. వారది విని దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశారు. వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు. అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు. తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు. “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు. “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు. ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.

షేర్ చేయి
చదువండి లూకా 24

లూకా 24:1-53 పవిత్ర బైబిల్ (TERV)

ఆదివారం తెల్లవారుఝామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు. సమాధికి ఉన్న రాయి త్రోసి వేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్ళి చూసారు. అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు. దీన్ని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపువలె మెరుస్తూ ఉన్నాయి. భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకొన్నారు. ఆ దేవదూతలు, “మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య ఎందుకు వెతుకుతున్నారు? ఆయన బ్రతికి, యిక్కడినుండి వెళ్లిపోయాడు. ఆయన మీతో కలిసి గలిలయలో ఉన్నప్పుడు, ‘మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడాలి; సిలువ మీద చంపబడాలి. మూడవ రోజు బ్రతికి రావాలి!’ అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా!” అని అన్నారు. అప్పుడు వాళ్ళకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి. మగ్దలేనే మరియ, యోహాన్న, యాకోబుల తల్లి మరియ, మరియు మిగతా స్త్రీలు సమాధినుండి వెళ్ళి ఈ విషయాలు ఆ పదకొండుగురికి, మిగతా వాళ్ళకు చెప్పారు. ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని శిష్యులు వాళ్ళ మాటలు నమ్మలేదు. అయినా పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరుగెత్తాడు. లోనికి తొంగి చూసి, కట్టబడిన వస్త్రాలు అక్కడ పడివుండటం గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా? అని ఆశ్చర్యపడ్తూ వెళ్ళిపోయాడు. అదే రోజు వాళ్ళలో ఇద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తూవున్నారు. అది యెరూషలేముకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది. వాళ్ళు జరిగిన సంఘటనలను గురించి మాట్లాడుకొంటున్నారు. వాళ్ళు ఈ విషయాన్ని గురించి చర్చిస్తూండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో కలిసి నడవటం మొదలు పెట్టాడు. కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వలేదు. యేసు వాళ్ళతో, “మీరు ఏం మాట్లాడుకొంటున్నారు?” అని అడిగాడు. వాళ్ళు ఆగిపొయ్యారు. వాళ్ళ ముఖంల్లో దుఃఖం ఉంది. వాళ్ళలో క్లెయొపా అనేవాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మధ్య జరిగిన సంఘటనలు తెలుసుకోకుండా యెరూషలేములో నివసిస్తూన్న వాడివి నీవొక్కడివేనా!” “ఏ సంఘటనలు?” అని యేసు అడిగాడు. వాళ్ళు, “నజరేతు నివాసియైన యేసును గురించి. ఆయన ఒక ప్రవక్త. గొప్ప విషయాలు చెప్పాడు. గొప్ప పనులు చేశాడు. ప్రజల మెప్పు, దేవుని మెప్పు పొందాడు. మా ప్రధాన యాజకులు, పాలకులు, మరణ దండన విధించుమని ఆయన్ని అధికారులకు అప్పగించారు. వాళ్ళు ఆయన్ని సిలువకు వేసారు. ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆశించాము. “పైగా యివన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి. అంతేకాక మాతో ఉన్న కొందరు స్త్రీలు ఆశ్చర్యం కలిగించే విషయం మాకు చెప్పారు. వాళ్ళు ఈ రోజు తెల్లవారు ఝామున సమాధిదగ్గరకు వెళ్ళారు. కాని, అక్కడ వాళ్ళకు యేసు దేహం కనిపించలేదు. తాము దేవ దూతల్ని చూసినట్లు, ఆ దేవదూతలు యేసు బ్రతికి వచ్చాడని చెప్పినట్లు మాకు చెప్పారు. మాతో ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరకు వెళ్ళి అది ఆ స్త్రీలు వర్ణించిన విధంగా ఉండటం గమనించారు. కాని అక్కడ యేసు కనిపించలేదు” అని అన్నారు. యేసు వాళ్ళతో, “అజ్ఞానులారా! ప్రవక్తలు చెప్పిన విషయాలు నమ్మటానికి యింత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? క్రీస్తు చనిపోయి తర్వాత కదా తేజస్సు పొందాలి!” అని అన్నాడు. ఆ తదుపరి మోషే గ్రంథాలతో, ప్రవక్తల వ్రాతలతో మొదలు పెట్టి తనను గురించి లేఖనాల్లో వ్రాసినవన్నీ వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. వాళ్ళు వెళ్ళనున్న గ్రామం దగ్గరకు వచ్చింది. యేసు తాను యింకా ముందుకు వెళ్ళనున్న వానిలా కనిపించాడు. కాని వాళ్ళు, “సాయంకాలమైంది. చీకటి కాబోతోంది. మాతో ఉండిపొండి!” అని అన్నారు. యేసు సరేనని వాళ్ళతో వాళ్ళ యింటికి వెళ్ళాడు. వాళ్ళతో భోజనానికి కూర్చున్నాక ఆయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచి వాళ్ళకిచ్చాడు. అప్పుడు వాళ్ళ కండ్లు తెరిపించాడు. వెంటనే వాళ్ళు ఆయన్ని గుర్తించారు. కాని ఆయన అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఆ యిద్దరూ, “దారిపై నడుస్తుండగా ఆయన మాట్లాడి, లేఖనాల్లో నిజమైన అర్థాన్ని మనకు చెప్పినప్పుడు గుండెల్లో మండుతున్నట్లు అనిపించలేదా?” అని మాట్లాడుకున్నారు. వాళ్ళు లేచి వెంటనే యెరూషలేము వెళ్ళారు. అక్కడ ఆ పదకొండుగురు శిష్యులు, మిగతా వాళ్ళు సమావేశమై ఉన్నారు. వాళ్ళలో ఒకడు, “ఔను! ఇది నిజం. ప్రభువు బ్రతికి వచ్చి సీమోనుకు కనిపించాడు” అని అన్నాడు. ఆ తదుపరి ఆ వచ్చిన వాళ్ళు దారిపై జరిగిన సంఘటనను, యేసు రొట్టెను విరిచినప్పుడు తాము ఆయన్ని గుర్తించిన విషయము చెప్పారు. వాళ్ళు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగుగాక” అని అన్నాడు. వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు. యేసు వాళ్ళతో, “మీరెందుకు భయపడ్తున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి? నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎముకలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు. ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు. వాళ్ళకు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వాళ్ళు నమ్మలేకపొయ్యారు. అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు. వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి యిచ్చారు. ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో తిన్నాడు. ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు. అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు. ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు! పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేములో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది. మీరు వీటికి సాక్షులు. నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించే దాకా ఈ పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదించాడు. వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.

షేర్ చేయి
చదువండి లూకా 24

లూకా 24:1-53 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్ర్తీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు–సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు –మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి. ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా–మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితోకూడ ఉన్న యితర స్ర్తీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి, సమాధి యొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు జరిగిన ఈ సంగతులన్నిటినిగూర్చి యొక రితో నొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను. ఆయన– మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయొపా అనువాడు–యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను. ఆయన –అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు–నజరేయుడైన యేసునుగూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయైయుండెను. మన ప్రధానయాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడుదినములాయెను. అయితే మాలో కొందరు స్ర్తీలు తెల్ల వారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి –కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతోకూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్ర్తీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన–అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా వారు–సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను. ఆయన వారితోకూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు–ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదునొకొండుగురు శిష్యులును వారితోకూడ ఉన్నవారును కూడివచ్చి –ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి. వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారిమధ్యను నిలిచి–మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన–మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పెట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదము లను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన–ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి –క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.

షేర్ చేయి
చదువండి లూకా 24