లూకా 20:20-26

లూకా 20:20-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆయనపై నిఘా వేసి ఉంచడానికి, వారు యథార్థంగా ఉన్నట్లు నటించగల వేగులవారిని పంపారు. యేసు మాట్లాడే దాంట్లో ఏదో తప్పు పట్టి ఆయనను పట్టుకుని, ఆయనను అధిపతి యొక్క అధికారానికి, ప్రభావానికి అప్పగించవచ్చని వారు ఆశించారు. అయితే ఆ వేగులవారు వచ్చి, “బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుతూ బోధిస్తావని మాకు తెలుసు. నీవు ఏ పక్షపాతం చూపకుండ, దేవుని మార్గాన్ని సత్యం ఆధారంగా బోధిస్తావు. అయితే మనం కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?” అని యేసును అడిగారు. ఆయన వారి కుయుక్తిని ఎరిగి, వారితో, “నాకు ఒక దేనారాన్ని చూపించండి, దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. అందుకు వారు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు. మాటల్లో చిక్కులు పెట్టాలని చూసినవారు ప్రజల ముందు ఆయన మాటలను తప్పు పట్టలేక ఆయన జవాబుకు ఆశ్చర్యపడి నిశ్శబ్దమై పోయారు.

షేర్ చేయి
చదువండి లూకా 20

లూకా 20:20-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారాయన్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు. ఆయనను గవర్నర్ వశం చేసి అతని అధికారానికి అప్పగించడం కోసం ఆయనను మాటల్లో తప్పు పట్టుకోవాలని, నీతిపరులుగా నటించే వేగుల వారిని ఆయన దగ్గరికి పంపారు. వారు వచ్చి బోధకా, “నీవు న్యాయంగా మాటలాడుతూ ఉపదేశిస్తూ ఉన్నావు. మొహమాటం లేకుండా యథార్థంగా దేవుని మార్గం బోధిస్తున్నావని మాకు తెలుసు. మనం సీజరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా?” అని ఆయనను అడిగారు. ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి, “ఒక నాణెం చూపించండి. దీని మీది బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని అడిగాడు. వారు, “సీజరువి” అన్నారు. అందుకాయన, “ఆలాగైతే సీజరువి సీజరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అన్నాడు. వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పు పట్టడం చేతగాక ఆయన ఇచ్చిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు.

షేర్ చేయి
చదువండి లూకా 20

లూకా 20:20-26 పవిత్ర బైబిల్ (TERV)

వాళ్ళు సరియైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. కనుక వాళ్ళు తమ వాళ్ళను కొందర్ని రహస్యంగా ఆయన దగ్గరకు పంపారు. వాళ్ళు మంచి వాళ్ళుగా నటిస్తూ యేసు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు పట్టి ఆయన్ని ఆ ప్రాంతం యొక్క రాజ్యాధికారికి అప్పగించటానికి ప్రయత్నించసాగారు. ఆ రాజ్యాధికారికి శిక్షించటానికి అధికారం ఉంది. ఒక రోజు వాళ్ళు యేసుతో, “బోధకుడా! మీరు సత్యం మాట్లాడుతారు. సత్యం బోధిస్తారు. పక్షపాతం చూపరు. దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిస్తారని మాకు తెలుసు. మరి మేము చక్రవర్తికి పన్నులు కట్టాలా వద్దా?” అని అడిగారు. వాళ్ళ పన్నాగం గమనించి యేసు, “ఒక దేనారా చూపండి. దాని మీద ఎవరి బొమ్మవుంది? ఎవరి పేరు ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చేప్పారు. ఆయన, “అలాగైతే చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి. దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఆయన అక్కడ ప్రజల సమక్షంలో చెప్పిన ఈ సమాధానంలో వాళ్ళు ఏ తప్పూ పట్టలేక పోయారు. పైగా వాళ్ళాయన సమాధానానికి ఆశ్చర్యపడి మౌనం వహించారు.

షేర్ చేయి
చదువండి లూకా 20

లూకా 20:20-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి. వారు వచ్చి–బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు; నీ వెవనియందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి–ఒక దేనారము నాకు చూపుడి. దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు– కైసరు వనిరి. అందుకాయన–ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.

షేర్ చేయి
చదువండి లూకా 20