లూకా 2:36-40
లూకా 2:36-40 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అలాగే ఆషేరు గోత్రానికి చెందిన, పనూయేలు కుమార్తెయైన, అన్న, అనే ఒక ప్రవక్తి కూడా అక్కడ ఉండింది. ఆమె చాలా వృద్ధురాలు; ఆమె పెళ్ళి చేసుకుని ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి, తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు నిండేవరకు విధవరాలుగా ఉండింది. ఆమె ఎప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఆరాధిస్తున్నది. ఆమె కూడ ఆ సమయంలోనే దేవాలయ ఆవరణంలో వారి దగ్గరకు వచ్చి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న వారందరితో శిశువు గురించి చెప్పింది. యోసేపు మరియలు ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారం అన్ని జరిగించిన తర్వాత, గలిలయలోని నజరేతు అనే తమ పట్టణానికి వెళ్లారు. బాలుడు ఎదిగి బలం పొందుకొన్నాడు; ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు, దేవుని దయ ఆయన మీద ఉండింది.
లూకా 2:36-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది. ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది. ఆ విధంగా యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున ఆచారాలన్నీ పూర్తి చేసుకుని గలిలయలోని తమ స్వగ్రామం నజరేతుకు వెళ్ళిపోయారు. పసివాడు ఎదుగుతూ, బలపడుతూ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.
లూకా 2:36-40 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది. మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది. ప్రభువు ధర్మశాస్త్రానుసారం చేయవలసినవన్నీ చేశాక మరియ, యోసేపులు తమ స్వగ్రామమైన గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు. యేసు పెరిగి పెద్ద వాడయ్యాడు. బలంతోపాటు తెలివి కూడా ఆయనలో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది.
లూకా 2:36-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవస్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెని మిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై, యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఆమె కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయననుగూర్చి మాటలాడుచుండెను. అంతట వారు ప్రభువు ధర్మశాస్ర్తము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.