లూకా 2:33-38
లూకా 2:33-38 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆయన గురించి చెప్పిన మాటలను విన్న ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. సుమెయోను వారిని దీవించి ఆయన తల్లియైన మరియతో: “ఇశ్రాయేలీయులలో అనేకమంది పడిపోవడానికి లేవడానికి కారణంగాను, వ్యతిరేకంగా చెప్పుకోడానికి గుర్తుగాను ఉండడానికి ఈ శిశువు నియమించబడ్డాడు, తద్వారా అనేకమంది హృదయాలోచనలు బయలుపరచబడతాయి, నీ హృదయంలోకి కూడా ఒక ఖడ్గం దూసికొనిపోతుంది.” అలాగే ఆషేరు గోత్రానికి చెందిన, పనూయేలు కుమార్తెయైన, అన్న, అనే ఒక ప్రవక్తి కూడా అక్కడ ఉండింది. ఆమె చాలా వృద్ధురాలు; ఆమె పెళ్ళి చేసుకుని ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి, తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు నిండేవరకు విధవరాలుగా ఉండింది. ఆమె ఎప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఆరాధిస్తున్నది. ఆమె కూడ ఆ సమయంలోనే దేవాలయ ఆవరణంలో వారి దగ్గరకు వచ్చి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న వారందరితో శిశువు గురించి చెప్పింది.
లూకా 2:33-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. అతడు వారిని దీవించి, మరియతో ఇలా అన్నాడు, “అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో చాలా మంది పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు. అంతేగాక నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకు పోతుంది.” దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది. ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.
లూకా 2:33-38 పవిత్ర బైబిల్ (TERV)
యేసు తల్లితండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత సుమెయోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరియతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు. తద్వారా మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట పడ్తాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.” ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది. మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది.
లూకా 2:33-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమెయోను వారిని దీవించి–ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు; మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవస్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెని మిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై, యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఆమె కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయననుగూర్చి మాటలాడుచుండెను.