లూకా 2:17-20
లూకా 2:17-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు ఆ శిశువును చూసి, ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన సంగతులను వారు ఇతరులకు చెప్పారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలను విన్నవారందరు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అయితే మరియ ఆ మాటలన్నింటిని తన హృదయంలో భద్రం చేసుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఉండింది. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా, తాము విని చూసిన వాటన్నిటిని గురించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్లారు.
లూకా 2:17-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ పసికందును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు.
లూకా 2:17-20 పవిత్ర బైబిల్ (TERV)
ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు. వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది. గొఱ్ఱెల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపొయ్యారు.
లూకా 2:17-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను. అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.