లూకా 18:2-8
లూకా 18:2-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుని భయం లేదు, మనుష్యులను లెక్క చేసేవాడు కాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది. “అతడు కొంతకాలం వరకు ఆమె మాటలను తిరస్కరించాడు కానీ, అతడు తనలో తాను, ‘నేను దేవునికి భయపడకపోయినా లేదా మనుష్యులను లక్ష్యపెట్టక పోయినా, ఈ విధవరాలు, “నాకు న్యాయం చేయండి” అని నన్ను తరచుగా తొందర పెడుతుంది, కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండా, నేను ఆమెకు న్యాయం చేస్తాను’ అని అనుకున్నాడు.” కాబట్టి ప్రభువు దాని గురించి, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దివారాత్రులు తనకు మొరపెడుతున్న వారికి న్యాయం చేయరా? వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తారా? నేను చెప్పేది ఏంటంటే, ఆయన వారికి న్యాయం జరిగేలా చేస్తారు, అది కూడా అతిత్వరలో చేస్తారు. అయినా మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమి మీద వారిలో విశ్వాసం కనిపిస్తుందా?” అని అడిగారు.
లూకా 18:2-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి ‘నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి’ అని అడుగుతూ ఉండేది. అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు. కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు, ‘నేను దేవుడికి భయపడను, మనుషులనూ లెక్కచెయ్యను. కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను’ అనుకున్నాడు.” ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా! తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా? ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?”
లూకా 18:2-8 పవిత్ర బైబిల్ (TERV)
“ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను. అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది. చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు. కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.” ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా! ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.
లూకా 18:2-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి–నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు–నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. మరియు ప్రభువిట్లనెను–అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారివిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?