లూకా 15:25-32

లూకా 15:25-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“ఆ సమయంలో, పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వస్తున్నాడు. అతడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, సంగీత నాట్యాల ధ్వని వినిపించింది. అప్పుడు అతడు తన పనివారిలో ఒకన్ని పిలిచి, ‘ఇంట్లో ఏం జరుగుతోంది?’ అని అడిగాడు. అందుకు ఆ పనివాడు, ‘నీ తమ్ముడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడని నీ తండ్రి సంతోషంతో విందు చేయడానికి క్రొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు. “దానితో పెద్ద కుమారుడు కోప్పడి ఇంట్లోకి వెళ్లడానికి ఇష్టపడలేదు. కాబట్టి అతని తండ్రి బయటకు వచ్చి అతన్ని ఇంట్లోకి రమ్మని బ్రతిమాలాడు. కాని అతడు తన తండ్రితో, ‘చూడు, ఇన్ని సంవత్సరాల నుండి నీకు దాస్యం చేస్తూ వచ్చాను, నీ మాటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అయినా నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి ఒక చిన్న మేకపిల్లను కూడా నీవు ఎప్పుడు నాకు ఇవ్వలేదు. కానీ నీ చిన్నకుమారుడు నీ ఆస్తినంతా వేశ్యలతో తిరిగి పాడుచేసి, ఇంటికి తిరిగి వస్తే వీని కోసం క్రొవ్విన దూడను వధించి విందు చేస్తున్నావా?’ అని అన్నాడు. “అందుకు అతని తండ్రి, ‘నా కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాకున్నదంతా నీదే. కాని ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, అతడు తప్పిపోయి దొరికాడు కాబట్టి మనం సంతోషించి ఆనందించాలి’ అని చెప్పాడు.”

షేర్ చేయి
చదువండి లూకా 15

లూకా 15:25-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటిని సమీపిస్తుండగా సంగీతం, నాట్యధ్వని అతనికి వినిపించాయి. ఒక సేవకుణ్ణి పిలిచి, ‘ఏం జరుగుతోంది?’ అని అడిగాడు. ఆ పనివాడు అతనితో, ‘నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు. దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు. అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు. కాని అతడు, ‘ఇదిగో విను, ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు. కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు’ అంటూ నిష్టూరంగా మాట్లాడాడు. అందుకతని తండ్రి, ‘నాయనా, నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే. మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు.”

షేర్ చేయి
చదువండి లూకా 15

లూకా 15:25-32 పవిత్ర బైబిల్ (TERV)

“ఇంతలో పెద్దవాడు పొలంనుండి ఇంటికి వస్తూవున్నాడు. ఆతనికి ఇంటినుండి సంగీతము, నాట్యము జరుగుతున్న ధ్వనులు వినిపించాయి. అతడు పని వాళ్ళలో ఒకణ్ణి పిలిచి, ‘ఏమి జరుగుతోంది?’ అని అడిగాడు. ఆ పనివాడు ‘మీ తమ్ముడు వచ్చాడు. మీ నాన్న అతడు క్షేమంగా తిరిగి వచ్చాడని బాగా బలిసిన దూడను కోసి విందు చేస్తున్నాడు’ అని చెప్పాడు. “ఇది విని అతనికి కోపం వచ్చింది. కనుక ఇంట్లొకి అడుగు పెట్టనని అన్నాడు. అందువల్ల అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమిలాడాడు. అతడు తండ్రితో, ‘యిదిగో నాన్నా! ఎన్నో ఏండ్లనుండి నేను బానిసలాగా పనిచేసాను. నీ ఆజ్ఞ జవదాట లేదు. ఆయినా నేను నా స్నేహితులతో విందు చేసుకోవటానికి నీవు ఒక్క చిన్న గొఱ్ఱెను కూడా ఇవ్వలేదు. కాని, నీ ఈ కుమారుడు ఆస్థినంతా వేశ్యలకు తగలెట్టి ఇల్లు చేరుకొంటే వానికోసం బలిసిన దూడను కోస్తున్నావు!’ అని అన్నాడు. “కాని తండ్రి అతనితో, ‘నా బాబూ! నీవెప్పుడూ నా దగ్గరే ఉంటున్నావు. కనుక నా దగ్గర ఉన్నవన్నీ నీవి. కాని నీ ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. తప్పిపోయిన వాడు దొరికాడు. కనుక మనం ఆనందంగా పండుగ చేసుకోవాలి’ అని అన్నాడు.”

షేర్ చేయి
చదువండి లూకా 15

లూకా 15:25-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు అతని పెద్దకుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి–ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో–నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో–ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు–కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.

షేర్ చేయి
చదువండి లూకా 15