లూకా 14:26-33

లూకా 14:26-33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“ఎవరైనా, నా శిష్యునిగా ఉండాలనుకుంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, సహోదర సహోదరీలను, చివరికి తన ప్రాణాన్ని సైతం, వదులుకోడానికి సిద్ధంగా లేకపోతే, నా శిష్యులు కాలేరు. తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు శిష్యులు కాలేరు. “ఉదాహరణకు మీలో ఎవరైనా ఒక గోపురం కట్టించాలని అనుకుంటే దాన్ని పూర్తి చేయడానికి సరిపడే డబ్బు మీ దగ్గర ఉందా లేదా అని ముందుగా చూసుకోరా? ఎందుకంటే ఒకవేళ మీరు పునాది వేసి, దాన్ని పూర్తి చేయలేకపోతే, చూసే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని, ‘వీడు కట్టడం మొదలుపెట్టాడు కాని ముగించలేకపోయాడు’ అంటూ ఎగతాళి చేస్తారు. “ఒక రాజు మరొక రాజుపై యుద్ధం చేయబోయేటప్పుడు, ఇరవై వేలమంది సైన్యంతో తన మీదికి వస్తున్న వాన్ని పదివేలమంది సైన్యంతో ఎదిరించగలనా అని అతడు ముందుగానే కూర్చుని ఆలోచించడా? ఒకవేళ అతనికి అది అసాధ్యం అనిపిస్తే, శత్రువు ఇంకా దూరంలో ఉండగానే శాంతి నిబంధనలను చర్చించడానికి అతడు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతాడు. అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు.

షేర్ చేయి
చదువండి లూకా 14

లూకా 14:26-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు. అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు. “మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దాన్ని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా? అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే, చూస్తున్న వారంతా ‘ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు’ అంటూ వేళాకోళం చేస్తారు. “అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా? తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా! అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు.

షేర్ చేయి
చదువండి లూకా 14

లూకా 14:26-33 పవిత్ర బైబిల్ (TERV)

“నాతో వచ్చి, తన తల్లి తండ్రులకన్నా, తన భార్యకన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టువులకన్నా, చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు. అంతేకాక తన సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు. “గోపురం కట్టాలనుకొన్నవాడు కూర్చొని దానికి ఎంత వ్యయమౌతుందో అంచనా వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో లేదో చూసుకోడా? పునాదులు వేసాక దాన్ని పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా ‘ఇతడు కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక పోయాడు’ అని అతణ్ణి హేళన చేస్తారు. “అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చెయ్యటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా కూర్చొని తన పదివేల సైన్యంతో యుద్దం చేయబోతున్న ఇరవై వేల సైన్యాన్ని ఎదిరించగలనా లేదా అని ఆలోచించడా? యుద్ధం చేయలేనని అనుకుంటే సైన్యాలు దూరంగా ఉన్నప్పుడే తన రాయబారుల్ని పంపి సంధి చేసుకొంటాడు. “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు.

షేర్ చేయి
చదువండి లూకా 14

లూకా 14:25-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బహుజనసమూహములు ఆయనతోకూడ వెళ్లు చున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి–ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురముకట్టింపగోరినయెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున చూచువారందరు–ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేలమందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా. ఆప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.

షేర్ చేయి
చదువండి లూకా 14