లూకా 11:37-54
లూకా 11:37-54 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు మాట్లాడడం చాలించిన తర్వాత, ఒక పరిసయ్యుడు తనతో కలిసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు; కాబట్టి ఆయన వెళ్లి భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. అయితే యేసు యూదుల ఆచార ప్రకారం భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు. అందుకు ప్రభువు అతనితో, “పరిసయ్యులైన మీరు పాత్రను, గిన్నెను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, దుష్టత్వంతో నిండి ఉన్నారు. అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? కాబట్టి పేదలకు బహుమతులు ఇవ్వండి అప్పుడు మీకు అంతా శుద్ధిగానే ఉంటుంది. “పరిసయ్యులారా, మీకు శ్రమ. ఎందుకంటే, మీరు పుదీనా, మెంతులు ఇంకా అన్ని రకాల ఆకుకూరల్లో దేవునికి పదవ భాగం ఇస్తున్నారు, కాని న్యాయాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు మొదటివాటిని విడిచిపెట్టకుండా వెనుకటివాటిని పాటించాల్సింది. “పరిసయ్యులారా మీకు శ్రమ, ఎందుకంటే సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉండడానికి, సంత వీధుల్లో గౌరవం అందుకోవడానికి ఇష్టపడుతున్నారు. “మీకు శ్రమ! మీరు సరిగా గుర్తుపట్టలేని సమాధుల్లా ఉన్నారు, తెలియక ప్రజలు వాటి మీద నడుస్తారు.” ధర్మశాస్త్ర నిపుణులలో ఒకడు, “బోధకుడా, నీవిలా చెప్పి, మమ్మల్ని అవమానపరుస్తున్నావు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, మీరు మోయలేని బరువులను ప్రజలతో మోయిస్తూ, కనీసం ఒక వ్రేలి మోతనైనా మోసి వారికి సహాయపడరు. “మీకు శ్రమ, ఎందుకంటే మీరు ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు, కాని వారిని చంపింది మీ పితరులే. దీనిని బట్టి మీ పితరులు చేసిన వాటిని మీరు సమ్మతిస్తున్నట్లు సాక్ష్యమిస్తున్నారు; వారు ప్రవక్తలను చంపారు, మీరు వారికి సమాధులను కడుతున్నారు. ఇందుకే, దేవుడు మీ గురించి తన జ్ఞానంలో, ‘నేను వారికి ప్రవక్తలను, అపొస్తలులను పంపుతాను, వారిలో కొందరిని వారు చంపుతారు, మరికొందరిని హింసిస్తారు.’ కాబట్టి లోక ఆరంభం నుండి చిందించబడిన ప్రవక్తలందరి రక్తానికి ఈ తరం బాధ్యత వహిస్తుంది, అనగా, హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య చంపబడిన జెకర్యా రక్తం వరకు. అవును, నేను చెప్పేది నిజం, ఈ తరం వారే దానంతటికి బాధ్యులుగా ఎంచబడతారు. “ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, ఎందుకంటే మీరు జ్ఞానానికి చెందిన తాళపు చెవిని తీసివేసుకున్నారు. మీరే దానిలో ప్రవేశించలేదు, పైగా ప్రవేశిస్తున్న వారిని ఆటంకపరిచారు.” అక్కడినుండి యేసు బయటకు వెళ్లినప్పుడు, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించి తమ ప్రశ్నలతో ఆయనను చిక్కులు పెట్టాలని, ఆయన చెప్పే మాటల్లో తప్పు పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు.
లూకా 11:37-54 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని ఆయనను ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు. ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. అది చూసి ప్రభువిలా అన్నాడు, “పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది. అవివేకులారా, బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా! మీకు ఉన్నవాటిని పేదలకు ధర్మం చేయండి. అప్పుడు మీకు అన్నీ శుభ్రంగా ఉంటాయి. అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన. మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ వదిలేస్తున్నారు. మిగిలిన వాటిని చేస్తూనే న్యాయంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన, మీరు సమాజ మందిరాల్లో అగ్ర స్థానాలూ, వ్యాపార వీధుల్లో ప్రజల నుండి వందనాలూ కోరుకుంటారు. అయ్యో, మీరు కనిపించని సమాధుల్లా ఉన్నారు. అవి సమాధులని తెలియని మనుషులు వాటి మీదే నడుస్తారు.” అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, “బోధకుడా. ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “అయ్యో, ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీకు యాతన. మీరు మనుషులపై మోయలేని బరువులు మోపుతారు. మీరు మాత్రం ఒక వేలితో కూడా ఆ బరువులను తాకరు. అయ్యో, మీకు యాతన, మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు. మీరు చనిపోయిన ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు. దీన్నిబట్టి మీరు సాక్షులై మీ పూర్వీకులు చేసిన పనులకు సమ్మతి తెలుపుతున్నారు. వారు ప్రవక్తలను చంపారు. మీరు సమాధులు కడుతున్నారు. ఈ కారణం చేత దేవుని జ్ఞానం చెప్పేదేమిటంటే, ‘నేను వారి దగ్గరికి ప్రవక్తలనూ, అపొస్తలులనూ పంపుతాను. వారు కొంత మందిని చంపుతారు. కొంతమందిని హింసిస్తారు.’ కాబట్టి లోకారంభం నుండీ అంటే హేబెలు రక్తం నుండి బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైన జెకర్యా రక్తం వరకూ చిందిన ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారిపై విచారణ జరుగుతుందని మీకు కచ్చితంగా చెబుతున్నాను. అయ్యో, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే మీరు జ్ఞానం తాళం చెవిని తీసుకు పోయారు. మీరు లోపల ప్రవేశించరు. ప్రవేశించే వారిని అడ్డుకుంటారు” అని చెప్పాడు. ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయిన తరువాత ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయన మీద పగ పట్టి ఆయన మీద నేరం మోపడానికై ఆయన మాటల్లో తప్పు పట్టుకోడానికి చూస్తూ ఆయనతో వాదిస్తూ వచ్చారు.
లూకా 11:37-54 పవిత్ర బైబిల్ (TERV)
యేసు మాట్లాడటం ముగించాడు. ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి ఆహ్వానించాడు. యేసు అతని యింటికి వెళ్ళి భోజనానికి కూర్చుని ఉన్నాడు. యేసు భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవటం గమనించి పరిసయ్యునికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు ప్రభువు అతనితో, “మీ పరిసయ్యులు గిన్నెల్ని, పళ్ళేల్ని వెలుపలి భాగం శుభ్రం చేస్తారు. కాని లోపల దురాశ, దుష్టత్వము నిండివుంటాయి. మూర్ఖులారా! వెలుపలి భాగం సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా? మీరు దాచుకున్న వాటిని పేదవాళ్ళకు దానం చెయ్యండి. అప్పుడు మీరు పూర్తిగా శుభ్రమౌతారు. “మీరు మీ తోటలో పండిన పుదీనా, సదాప మొదలగు కూరగాయల యొక్క పదవవంతు దేవునికి యిస్తారు. కాని న్యాయాన్ని, దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక మీకు శ్రమ. పదవవంతు ఇవ్వటం మానుకోకుండా న్యాయాన్ని, దేవుని ప్రేమను కూడా అలవరచుకోవలసింది. “మీరు సమాజ మందిరాల్లో ఉన్నత స్థలాల్లో కూర్చోవటానికోసం ప్రాకులాడుతారు. దారి మీద వెళ్తూవుంటే ప్రజలు గౌరవమివ్వాలని ఆశిస్తారు. కనుక మీకు శ్రమ తప్పదు. ప్రజలు తమకు తెలియకుండా త్రొక్కుతూ నడిచే సమాధుల్లాంటి వాళ్ళు మీరు. మీకు శ్రమ తప్పదు” అని అన్నాడు. ధర్మశాస్త్రంలో పాండిత్యం ఉన్న ఒకడు లేచి, “బోధకుడా! మీరీ విధంగా మాట్లాడి మమ్మల్ని కూడా అవమానిస్తున్నారు” అని అన్నాడు. యేసు, “ధర్మశాస్త్ర పండితులారా! మీరు ప్రజలపై వాళ్ళు మోయలేని భారం వేస్తున్నారు. కాని వాటిని లేపటానికి మీరు ఒక్క వ్రేలు కూడా కదల్చరు. కనుక మీకు శ్రమ తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధులు కట్టిస్తారు. కాని మీ పూర్వికులు వాళ్ళను చంపారు. కనుక మీకు శిక్ష తప్పదు. అంటే పూర్వికులు చేసిన దాన్ని అంగీకరిస్తున్నట్లు నిరూపించుకొంటున్నారన్న మాట. వాళ్ళు ప్రవక్తల్ని చంపారు. మీరు సమాధులు కట్టించారు. అందువల్లే దేవుడు దివ్యజ్ఞానంతో ఈ విధంగా చెప్పాడు: ‘నేను వాళ్ళకోసం ప్రవక్తల్ని, అపొస్తలులను పంపుతాను. కొందర్ని వాళ్ళు చంపుతారు. మిగతా వాళ్ళను హింసిస్తారు.’ “అందువలన ప్రపంచం పుట్టిన నాటినుండి ప్రవక్తలు కార్చిన రక్తానికి ఈ తరం వాళ్ళు బాధ్యులు. హేబెలు హత్య మొదలుకొని ధూప వేదికకు, మందిరానికి మధ్య చంపబడిన జెకర్యా హత్యదాకా వీళ్ళు బాధ్యులు. ఔను. ఈ కాలం వాళ్ళు వీటికి బాధ్యులని నేను చెబుతున్నాను. “ధర్మశాస్త్ర పండితులారా! జ్ఞానం యొక్క తాళం చెవి మీరు తీసుకున్నారు. దాని తలుపులు తెరిచి మీరు లోనికి వెళ్ళలేరు. పైగా వెళ్తున్న వాళ్ళను అడ్డగిస్తారు. మీకు శిక్ష తప్పదు” అని చెప్పాడు. యేసు అక్కడినుండి వెళ్ళిన తర్వాత పరిసయ్యులును, శాస్త్రులును ఆయనను ఇంకా ఎక్కువగా వ్యతిరేకించారు. ప్రశ్నలతో ఆయన్ని వేధించారు. ఆయనను మాటలలో చిక్కించాలని ప్రయత్నించారు.
లూకా 11:37-54 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతోకూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువిట్లనెను–పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడు తనముతోను నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజమందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమా ధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు – బోధకుడా, యీలాగు చెప్పి మమ్మును కూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన–అయ్యో, ధర్మశాస్ర్తప్రదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీపితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీపితరుల కార్యములకు సమ్మతించుచున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా–నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకునుమధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పు చున్నాను. అయ్యో, ధర్మశాస్ర్తప్రదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను. ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.