లూకా 11:14-23

లూకా 11:14-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఒక రోజు యేసు మూగ దయ్యాన్ని వెళ్లగొడుతున్నారు. దయ్యం వెళ్లిపోగానే, ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడ్డారు. అయితే వారిలో కొందరు, “ఇతడు బయెల్జెబూలు, అనే దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు. మరికొందరు పరలోకం నుండి ఒక సూచన కావాలని అడుగుతూ ఆయనను పరీక్షించారు. యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు: “ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది, ఒక కుటుంబం దానికదే వ్యతిరేకించి చీలిపోతే అది కూలిపోతుంది. ఒకవేళ సాతాను కూడా తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? నేనిలా చెప్తున్న ఎందుకంటే నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నానని మీరు అంటున్నారు కాబట్టి. ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ అనుచరులు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు, వారే మీకు తీర్పుతీర్చుతారు. కానీ ఒకవేళ నేను దేవుని అధికారంతో దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థము. “బలవంతుడైనవాడు ఆయుధాలను ధరించుకొని, తన ఇంటిని కాపల కాస్తున్నప్పుడు, అతని ఆస్తి భద్రంగా ఉంటుంది. అయితే అతనికంటే బలవంతుడు వానిని ఓడించినప్పుడు, వాడు నమ్మకముంచిన ఆ ఆయుధాలను తీసుకున్న తర్వాతే అతని ఆస్తినంతటిని దోచుకొంటాడు. “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు.

షేర్ చేయి
చదువండి లూకా 11

లూకా 11:14-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అయితే వారిలో కొందరు, “వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అని చెప్పుకున్నారు. మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు. ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది. సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే, మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు? దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు. అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే. బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది. అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు. నా వైపు ఉండని వాడు నాకు విరోధి. నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే.

షేర్ చేయి
చదువండి లూకా 11

లూకా 11:14-23 పవిత్ర బైబిల్ (TERV)

ఒక రోజు యేసు ఒక మూగ దయ్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోగానే అది పట్టిన మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడు. అది చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. కొందరు, “బయెల్జెబూలు అనే దయ్యాలరాజు ద్వారా అతడు దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు. మరి కొందరు యేసును పరీక్షించుచూ ఒక అద్భుతం పరలోకం నుండి చూపుమని అడిగారు. యేసుకు వాళ్ళ అభిప్రాయం తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “చీలికలు కలిగిన యిల్లు పడిపోతుంది. సైతానురాజ్యంలో చీలికలు కలిగితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఇలా ఎందుకు అంటున్నానంటే బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాల్ని వదిలిస్తున్నానని మీరు అంటున్నారు. నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాల్ని వదిలిస్తున్నట్లైతే, మీ వాళ్ళు దేని సహయంతో దయ్యాల్ని వదిలిస్తున్నారు? అందువల్ల మీ వాదన తప్పని మీ వాళ్ళే రుజువు చేస్తున్నారు. కాని నేను దైవశక్తితో దయ్యాల్ని వదిలిస్తున్నాను కనుక, దేవుని రాజ్యం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది. “ఒక బలవంతుడు ఆయుధాల్ని ధరించి తన యింటిని కాపలా కాస్తే అతని యింట్లోని వస్తువులు భధ్రంగా ఉంటాయి. కాని అతని కన్నా బలవంతుడు వచ్చి మీదపడి అతన్ని ఓడిస్తే అతడిన్నాళ్ళు నమ్ముకున్న ఆయుధాలన్నీ ఇంటివానియొద్ద నుండి తీసుకొని, ఆదోచుకొన్న వస్తువుల్ని అందరికి పంచి పెడ్తాడు. “నాతో ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్న వానితో సమానము. నాతో కలిసి గొఱ్ఱెల్ని ప్రోగుచేయటానికి సహాయం చెయ్యనివాడు వాటిని చెదరగొట్టిన వానితో సమానము.

షేర్ చేయి
చదువండి లూకా 11

లూకా 11:14-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు–వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు–పరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి. ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను–తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులైయుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యము లను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.

షేర్ చేయి
చదువండి లూకా 11