లేవీయకాండము 9:1-7

లేవీయకాండము 9:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఎనిమిదవ రోజు మోషే అహరోనును అతని కుమారులను, ఇశ్రాయేలు గోత్ర పెద్దలను పిలిపించాడు. అతడు అహరోనుతో ఇలా అన్నాడు, “మీ పాపపరిహారబలి కోసం ఏ లోపం లేని ఒక మగ దూడను, మీ దహనబలికి ఒక లోపం లేని పొట్టేలును తీసుకువచ్చి వాటిని యెహోవా ఎదుట సమర్పించాలి. అప్పుడు నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘పాపపరిహారబలి కోసం లోపం లేని ఒక మేకపోతును దహనబలి కోసం లోపం లేని ఒక దూడను, ఒక గొర్రెపిల్లను తీసుకురావాలి. యెహోవా ఎదుట బలి అర్పించడానికి సమాధానబలికి ఎద్దును, పొట్టేలును, ఒలీవనూనె కలిపిన భోజనార్పణతో పాటు తీసుకురండి. ఎందుకంటే యెహోవా ఈ రోజు మీకు ప్రత్యక్షమవుతారు.’ ” వారు మోషే ఆజ్ఞాపించినట్లుగా సమావేశ గుడారం ఎదుటికి వాటన్నిటిని తీసుకువచ్చారు, అప్పుడు సమాజమంతా దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడ్డారు. అప్పుడు మోషే ఇలా అన్నాడు, “మీరు ఇలా చేయాలని యెహోవా ఆజ్ఞాపించారు, తద్వార యెహోవా మహిమ మీకు ప్రత్యక్షం అవుతుంది.” మోషే అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఆజ్ఞాపించినట్లు బలిపీఠం దగ్గరకు వచ్చి, నీ పాపపరిహారబలిని, దహనబలిని అర్పించి, నీకోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి; ప్రజల కోసం అర్పణను అర్పించి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”

లేవీయకాండము 9:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎనిమిదో రోజు మోషే అహరోనునూ, అతని కొడుకులనూ, ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలనూ పిలిచాడు. అహరోనుతో ఇలా అన్నాడు. “పాపం కోసం బలి అర్పణగా మందలో నుండి లోపం లేని ఒక దూడనీ, దహనబలి కోసం లోపం లేని ఒక పొట్టేలునూ యెహోవా సమక్షంలోకి తీసుకు రా. నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పాలి. యెహోవాకి అర్పించడానికి పాపం కోసం బలిగా లోపం లేని మేకపోతునూ, దహనబలి కోసం ఒక్క సంవత్సరం వయసున్న లోపం లేని ఒక దూడనూ, ఒక గొర్రెపిల్లనూ, తీసుకు రండి. అలాగే యెహోవాకి శాంతిబలి అర్పించడానికి ఒక ఎద్దునూ, ఒక పొట్టేలునూ, నూనె కలిపిన నైవేద్యాన్నీ తీసుకు రండి. ఎందుకంటే ఈ రోజు మీకు యెహోవా దర్శనమిస్తాడు” కాబట్టి వాళ్ళు మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకు వచ్చారు. ఇశ్రాయేలు సమాజమంతా వచ్చి యెహోవా సమక్షంలో నిల్చున్నారు. అప్పుడు మోషే ఇలా అన్నాడు. “యెహోవా మీకు ఆజ్ఞాపించింది ఇదే. మీరిది చేస్తే ఆయన తేజస్సు మీకు కనిపిస్తుంది.” తరువాత మోషే అహరోనుకి ఇలా చెప్పాడు. “బలిపీఠం దగ్గరికి రా, యెహోవా ఆజ్ఞాపించినట్టు నీ పాపం కోసం అర్పించాల్సిన బలినీ, నీ కోసం దహనబలినీ అర్పించి నీ కోసం, ప్రజల కోసం పరిహారం చెయ్యి. ప్రజల కోసం బలి అర్పించి వాళ్ళ కోసం పరిహారం చెయ్యి.”

లేవీయకాండము 9:1-7 పవిత్ర బైబిల్ (TERV)

ఎనిమిదో రోజున అహరోనును, అతని కుమారులను మోషే పిలిచాడు. ఇశ్రాయేలు పెద్దలను కూడా అతడు పిలిచాడు. అహరోనుతో మోషే ఇలా చెప్పాడు, “ఒక కోడెదూడను, పొట్టేలును తీసుకొని రండి. వాటిలో ఏ దోషం ఉండకూడదు. కోడెదూడను పాపపరిహారార్థబలిగాను, పొట్టేలును దహనబలిగాను యెహోవాకు అర్పించండి. ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి, ‘పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను తీసుకోండి. దహన బలికోసం ఒక కోడెదూడను, ఒక గొర్రెపిల్లను తీసుకోండి. కోడెదూడ, గొర్రెపిల్ల ఒక్క సంవత్సరం వయస్సుగలవి కావాలి. ఆ జంతువుల్లో ఏ దోషమూ ఉండకూడదు. సమాధాన బలుల కోసం ఒక కోడెదూడను, ఒక పొట్టేలును తీసుకోండి. ఆ జంతువులను, నూనెతో కలుపబడ్డ నైవేద్యాన్ని తీసుకొని, వాటిని యెహోవాకు అర్పించండి. ఎందుకంటే ఈవేళ యెహోవా మీకు ప్రత్యక్ష మవుతాడు.’” కనుక ప్రజలంతా సన్నిధి గుడారం దగ్గరకు వచ్చారు. మోషే ఆజ్ఞాపించిన వాటన్నింటినీ వారంతా తీసుకొచ్చారు. ప్రజలంతా యెహోవా ఎదుట నిలబడ్డారు. “యెహోవా ఆజ్ఞప్రకారం మీరు చేసారు కనుక యెహోవా మహిమను మీరు చూస్తారు” అన్నాడు మోషే. అప్పుడు అహరోనుతో మోషే ఈ సంగతులు చెప్పాడు: “వెళ్లి, యెహోవా ఆజ్ఞాపించిన వాటిని జరిగించు. బలిపీఠం దగ్గరకు వెళ్లి, పాపపరిహారార్థ బలులు, దహనబలి అర్పణలు అర్పించు. మీ పాపాలు, ప్రజల పాపాలు తుడిచివేయబడేందుకు వాటిని జరిగించు. ప్రజల బలులను నీవు తీసుకొని, వారి పాపాలను పరిహరించే వాటిని జరిగించు.”

లేవీయకాండము 9:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఎనిమిదవదినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను–నీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసికొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీయులతో–మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱెపిల్లను సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసికొని రండి; నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించినవాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసికొనివచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా మోషే–మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను–నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము.