లేవీయకాండము 6:8-13
లేవీయకాండము 6:8-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా మోషేతో ఇలా అన్నారు: “అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు: ‘ఇది దహనబలికి సంబంధించిన నియమం: దహనబలి రాత్రి నుండి ఉదయం వరకు బలిపీఠం పొయ్యిపై ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. యాజకుడు తన నారబట్టలు నారలోదుస్తులు వేసుకుని, బలిపీఠం మీద అగ్నికి కాలిపోయిన దహనబలి అర్పణ బూడిదను తీసి బలిపీఠం ప్రక్కన ఉంచాలి. తర్వాత అతడు ఈ బట్టలు విడిచి వేరే దుస్తులు ధరించి శిబిరం బయట ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న స్థలానికి ఆ బూడిద తీసుకెళ్లాలి. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు పేర్చి, మంట మీద దహనబలి ఉంచి సమాధానబలుల క్రొవ్వును దహించాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు.
లేవీయకాండము 6:8-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుకీ, అతని కొడుకులకీ ఇలా ఆదేశించు, ఇది దహనబలికి సంబంధించిన చట్టం. దహనబలి అర్పణ బలిపీఠం పైన నిప్పులపై రాత్రంతా, తెల్లవారే వరకూ ఉండాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. యాజకుడు నారతో చేసిన బట్టలు వేసుకోవాలి. అతని లోదుస్తులు కూడా నారతో చేసినవే అయి ఉండాలి. అతడు దహనబలి అర్పణ పూర్తిగా కాలిపోయిన తరువాత బూడిద తీసి బలిపీఠం పక్కనే ఉంచాలి. తరువాత అతడు తన బట్టలు మార్చుకుని శిబిరం బయట ఉన్న పవిత్ర స్థలానికి ఆ బూడిద తీసుకు వెళ్ళాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని పైన కట్టెలు వేస్తూ ఉండాలి. దాని పైన దహనబలి అర్పణని ఉంచాలి. శాంతిబలి పశువు కొవ్వును దాని పైన దహించాలి. బలిపీఠం పైన అగ్ని ఎప్పటికీ మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు.
లేవీయకాండము 6:8-13 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు. ఇది దహనబలి అర్పణ నియమము. రాత్రి అంతా, తెల్ల వారేవరకు దహనబలి అర్పణ బలిపీఠం మీద దహనం అవుతూనే ఉండాలి. బలిపీఠం మీద బలిపీఠపు అగ్ని మండుతూనే ఉండాలి. యాజకుడు తన నారబట్ట అంగీని ధరించాలి. అతడు తన నార చెడ్డీని వేసుకోవాలి. తర్వాత బలిపీఠం మీద దహనబలిని అగ్ని దహించగా మిగిలిన బూడిదను అతడు తీసుకోవాలి. ఈ బూడిదను యాజకుడు బలిపీఠం పక్కగా పోయాలి. అప్పుడు యాజకుడు తన బట్టలు తీసి వేసి వేరే బట్టలు ధరించాలి. తర్వాత అతడు ఆ బూడిదను బస వెలుపల ఒక ప్రత్యేక స్థలానికి తీసుకొని వెళ్లాలి. అయితే బలిపీఠపు అగ్నిని మాత్రం బలిపీఠం మీద మండుతూ ఉండనివ్వాలి. దానిని ఆరిపోనివ్వ కూడదు. ప్రతి ఉదయం బలిపీఠం మీద యాజకుడు కట్టెలను కాల్చుతూఉండాలి. బలిపీఠం మీద అతడు కట్టెలు పేర్చాలి. సమాధాన బలుల కొవ్వును అతడు దహించాలి. ఎల్లప్పుడూ ఆగకుండా బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు.
లేవీయకాండము 6:8-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము –ఇది దహనబలినిగూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉదయమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించుచుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగు కొని బలిపీఠముమీద అగ్ని దహించు దహనబలిద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొని పోవలెను. బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలువేసి, దానిమీద దహనబలిద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.