లేవీయకాండము 6:1-30
లేవీయకాండము 6:1-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా మోషేతో ఇలా అన్నారు: “ఒకవేళ మనుష్యులెవరైనా తన పొరుగువాడు తనకు అప్పగించిన దాని విషయంలో ఆ వ్యక్తిని మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక ఒత్తిడిచేసినా, లేక పొరుగువాడు పోగొట్టుకున్న వస్తువు దొరికినా సరే దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి వాటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకు వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపమే అవుతుంది. వారు వీటిలోని దేని విషయంలోనైనా పాపం చేసి తమ అపరాధాన్ని గ్రహిస్తే, వారు దొంగిలించిన లేదా దోపిడి ద్వారా తీసుకున్నా, లేదా వారికి అప్పగించబడినదైనా, లేదా పోయిన ఆస్తి తిరిగి దొరికినదైనా, లేదా వారు అబద్ధ ప్రమాణం చేసినదైనా, వారు తప్పక పూర్తి నష్టపరిహారం చెల్లించాలి, దానికి దాని వెలలో అయిదవ వంతు కలిపి వారు తమ అపరాధపరిహారబలి సమర్పించే రోజున దానినంతటిని యజమానికి ఇవ్వాలి. నిర్ణయించిన విలువ ప్రకారం వారు మందలో నుండి యెహోవాకు అపరాధపరిహారబలిగా ఒక లోపం లేని పొట్టేలును జరిమానాగా యాజకుని దగ్గరకు తీసుకురావాలి. ఈ విధంగా యాజకుడు యెహోవా ఎదుట వారి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు అపరాధులవడానికి కారణమైన కృత్యాల నుండి వారు క్షమించబడతారు.” యెహోవా మోషేతో ఇలా అన్నారు: “అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు: ‘ఇది దహనబలికి సంబంధించిన నియమం: దహనబలి రాత్రి నుండి ఉదయం వరకు బలిపీఠం పొయ్యిపై ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. యాజకుడు తన నారబట్టలు నారలోదుస్తులు వేసుకుని, బలిపీఠం మీద అగ్నికి కాలిపోయిన దహనబలి అర్పణ బూడిదను తీసి బలిపీఠం ప్రక్కన ఉంచాలి. తర్వాత అతడు ఈ బట్టలు విడిచి వేరే దుస్తులు ధరించి శిబిరం బయట ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న స్థలానికి ఆ బూడిద తీసుకెళ్లాలి. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు పేర్చి, మంట మీద దహనబలి ఉంచి సమాధానబలుల క్రొవ్వును దహించాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు. “ ‘ఇవి భోజనార్పణకు సంబంధించిన నియమాలు: అహరోను కుమారులు యెహోవా ఎదుట బలిపీఠం ఎదురుగా దానిని అర్పించాలి. యాజకుడు భోజనార్పణలో నుండి పిడికెడు నాణ్యమైన పిండిని కొంచెం ఒలీవ నూనెను సాంబ్రాణి మొత్తాన్ని తీసుకుని వాటిని జ్ఞాపక భాగంగా బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి. అందులో మిగిలింది అహరోను అతని కుమారులు తినాలి, అయితే పరిశుద్ధాలయ ప్రాంతంలో పులియకుండా దానిని తినాలి; సమావేశ గుడారం యొక్క ఆవరణంలో వారు దానిని తినాలి. దానిని పులిసిన దానితో కలిపి కాల్చకూడదు; నాకు సమర్పించిన హోమబలులలో నేను దానిని వారి వాటాగా ఇచ్చాను. పాపపరిహారబలిలా అపరాధపరిహారబలిలా, ఇది అతిపరిశుద్ధము. అహరోను వంశస్థుడు ఎవరైనా దానిని తినవచ్చు. అన్ని తరాలకు ఇది యెహోవాకు సమర్పించబడే హోమబలులలో అతని శాశ్వత వాటా. వాటిని ఏది తాకినా అది పవిత్రమవుతుంది.’ ” యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు, “అహరోను అభిషేకించబడిన రోజున అతడు, అతని కుమారులు యెహోవా దగ్గరకు తీసుకురావలసిన అర్పణ ఇది: భోజనార్పణగా ఒక ఓమెరు నాణ్యమైన పిండి ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి. దానిని పెనం మీద నూనెతో కాల్చాలి; బాగా కాల్చి ముక్కలుగా చేసిన భోజనార్పణను యెహోవాకు ఇష్టమైన సువాసనగా సమర్పించాలి. ప్రధాన యాజకునిగా అతని తర్వాత వచ్చే కుమారుడు దానిని సిద్ధం చేయాలి. ఇది యెహోవాకు శాశ్వత వాటా, ఇది పూర్తిగా దహించబడాలి. యాజకుడు అర్పించే ప్రతి భోజనార్పణను పూర్తిగా దహించబడాలి; దానిని తినకూడదు.” యెహోవా మోషేతో ఇలా అన్నారు, “అహరోను, అతని కుమారులకు ఇలా చెప్పు: ‘పాపపరిహారబలికి సంబంధించిన నియమాలు ఇవే: దహనబలిని వధించే స్థలంలోనే పాపపరిహారబలి పశువులను కూడా యెహోవా ఎదుట వధించాలి. అది అతిపరిశుద్ధము. పాపపరిహారం కోసం దానిని అర్పించే యాజకుడు దానిని తినాలి; పరిశుద్ధాలయ ప్రాంతంలో, సమావేశ గుడారం యొక్క ఆవరణంలో దానిని తినాలి. బలి మాంసానికి తగిలే ప్రతిదీ పవిత్రమవుతుంది, దాని రక్తంలో కొంచెమైనా సరే వస్త్రం మీద పడితే ఆ వస్త్రాన్ని మీరు పరిశుద్ధాలయ ప్రాంతంలో ఉతకాలి. ఆ మాంసం వండిన మట్టికుండను పగులగొట్టాలి. ఒకవేళ ఇత్తడి పాత్రలో వండితే, దానిని తోమి నీళ్లతో కడగాలి. యాజకుడి కుటుంబంలో ప్రతి పురుషుడు దానిని తినాలి. అది అతిపరిశుద్ధము. కాని పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయటానికి సమావేశ గుడారంలోకి తేబడిన రక్తం ఏ పాపపరిహారబలిదైనాసరే తినకూడదు; దానిని కాల్చివేయాలి.
లేవీయకాండము 6:1-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. “ఒక వ్యక్తి తన పొరుగున ఉన్నవాడు తనకు అప్పగించిన దాని విషయంలో అతణ్ణి మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక తన పొరుగున ఉన్నవాణ్ణి పీడించినా అతడు పోగొట్టుకున్న వస్తువు తనకు దొరికినా దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపం అవుతుంది. ఇలా పాపం చేసినవాడు అపరాధి. కాబట్టి అలాంటివాడు తను ఇతరుల దగ్గర దోచుకున్నదీ, పీడించి సంపాదించిందీ, లేక తనకు అప్పగించినదీ, తనకు దొరికినదీ తిరిగి ఇచ్చివేయాలి. తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి. తరువాత అతడు తన అపరాధబలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకుని రావాలి. అపరాధబలిగా మందలోని లోపం లేని పోట్టేలును యాజకుడి దగ్గరికి తీసుకుని రావాలి. దాని విలువను ప్రస్తుత వెల ప్రకారం నిర్థారించాలి. యాజకుడు యెహోవా సమక్షంలో అతని పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతడు ఏ ఏ విషయాల్లో అపరాధి అయ్యాడో ఆ విషయాల్లో క్షమాపణ పొందుతాడు.” ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుకీ, అతని కొడుకులకీ ఇలా ఆదేశించు, ఇది దహనబలికి సంబంధించిన చట్టం. దహనబలి అర్పణ బలిపీఠం పైన నిప్పులపై రాత్రంతా, తెల్లవారే వరకూ ఉండాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. యాజకుడు నారతో చేసిన బట్టలు వేసుకోవాలి. అతని లోదుస్తులు కూడా నారతో చేసినవే అయి ఉండాలి. అతడు దహనబలి అర్పణ పూర్తిగా కాలిపోయిన తరువాత బూడిద తీసి బలిపీఠం పక్కనే ఉంచాలి. తరువాత అతడు తన బట్టలు మార్చుకుని శిబిరం బయట ఉన్న పవిత్ర స్థలానికి ఆ బూడిద తీసుకు వెళ్ళాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని పైన కట్టెలు వేస్తూ ఉండాలి. దాని పైన దహనబలి అర్పణని ఉంచాలి. శాంతిబలి పశువు కొవ్వును దాని పైన దహించాలి. బలిపీఠం పైన అగ్ని ఎప్పటికీ మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. ఇక నైవేద్య అర్పణ గూర్చిన చట్టం ఇది. దీన్ని అహరోను కొడుకులు యెహోవా సమక్షంలో బలిపీఠం ఎదుట అర్పించాలి. యాజకుడు నైవేద్య అర్పణ నుండి గుప్పెడు పిండినీ, కొంత నూనెనూ, దాని పైనున్న సాంబ్రాణినూ తీసి వాటిని యెహోవా మంచితనాన్ని స్మరించుకోడానికి బలిపీఠం పైన దహించాలి. అది ఆయనకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అర్పించగా మిగిలిన దాన్ని అహరోనూ, అతని కుమారులూ భుజించాలి. పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి. పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినాలి. ప్రత్యక్ష గుడారం ఆవరణలో దాన్ని తినాలి. దాని తయారీలో పొంగజేసే పదార్ధం కలపకూడదు. నాకు అర్పించే దహనబలుల్లో వాళ్ళ భాగంగా దాన్ని నేను ఇచ్చాను. పాపం కోసం చేసే బలి అర్పణగానూ, అపరాధం కోసం చేసే బలి అర్పణ గానూ ఇచ్చాను. అది అతి పరిశుద్ధం. మీ రాబోయే అన్ని తరాల్లోనూ అహరోను వారసుడైన ప్రతివాడూ యెహోవాకు దహనబలిగా అర్పించిన దానిలోనుండి దాన్ని తన భాగంగా భావించి తిన వచ్చు. వాటికి తగిలిన ప్రతిదీ పవిత్రం అవుతుంది.” ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. “అహరోనుకూ, అతని కొడుకులకూ ఒక్కొక్కరికీ అభిషేకం జరిగిన రోజున వాళ్ళు చెల్లించాల్సిన అర్పణ ఇది. మామూలు నైవేద్య అర్పణలాగే వాళ్ళు సుమారు ఒక కిలో సన్నని గోదుమ పిండిని ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి. దాన్ని నూనెతో పెనం పైన కాల్చాలి. అది చక్కగా కాలిన తరువాత తీసుకురావాలి. దాన్ని ముక్కలు చేసి యెహోవాకు కమ్మని సువాసనగా నైవేద్య అర్పణ చేయాలి. యాజకుని కొడుకుల్లో, అభిషేకం పొంది అతడి స్థానంలో కొత్తగా యాజకుడైన వ్యక్తి అలాగే అర్పించాలి. ఆజ్ఞ ప్రకారం దాన్ని యెహోవా కోసం పూర్తిగా దహించాలి. యాజకుడు అర్పించే ప్రతి నైవేద్యాన్నూ పూర్తిగా దహించాలి. దాన్ని తినకూడదు.” ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ మాట్లాడి ఇలా చెప్పు, పాపం కోసం చేసే అర్పణ చట్టం ఇది. దహనబలి అర్పణ పశువుని వధించిన చోటే పాపం కోసం చేసే బలి అర్పణ పశువునూ యెహోవా సమక్షంలో వధించాలి. అది అతి పరిశుద్ధం. ప్రత్యక్ష గుడారం ఆవరణలోని పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి. దాని మాంసానికి తగిలిన ప్రతిదీ పరిశుద్ధం అవుతుంది. దాని రక్తం బట్టల పైన చిందితే రక్తం చిమ్మిన ప్రాంతాన్ని పరిశుద్ధ స్థలం లో శుభ్రం చేయాలి. దాన్ని మట్టి కుండలో ఉడకబెడితే, ఆ కుండని పగలగొట్టాలి. ఒకవేళ ఇత్తడి పాత్రలో ఉడకబెడితే దాన్ని తోమి నీళ్ళతో శుభ్రం చేయాలి. అది అతి పరిశుద్ధమైనది కాబట్టి యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దాన్ని కొంచెం తినవచ్చు. కానీ పాపం కోసమైన బలి అర్పణ చేసిన పశువు రక్తం పరిహారం కోసం ప్రత్యక్ష గుడారం లోకి తీసుకు రావడం జరిగితే, ఆ పశువు మాంసం తినకూడదు. దాన్ని పూర్తిగా కాల్చి వేయాలి.”
లేవీయకాండము 6:1-30 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ఒకడు యిలాంటి పాపాలు చేసి, యెహోవాకు విరోధంగా అపరాధం చేయవచ్చు, ఒక వ్యక్తి మరొకరి పక్షంగా దేనికైనా కాపలా కాస్తూండగా దానికి జరిగిన దాన్ని గూర్చి అతడు అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు తాను చేసిన ప్రమాణం విషయంలో అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు దేనినైనా దొంగిలించవచ్చు, లేక ఎవర్నయినా మోసం చేయవచ్చు, లేక ఒకడు పోయింది దొరికినప్పుడు దాన్ని గూర్చి అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు ఏదో చేస్తానని వాగ్దానం చేసి తర్వాత అతడు వాగ్దాన ప్రకారం చేయకపోవచ్చు, లేక ఒకడు ఇంకేదైనా చెడుకార్యం చేయవచ్చు. ఒక వ్యక్తి వీటిలో ఏదైనా చేస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. అతడు దొంగతనంగా తీసుకొన్నదిగాని, మోసంచేసి తీసుకొన్నదిగాని, మరోవ్యక్తి భద్రంగా ఉంచమని ఇవ్వగా అతడు తీసుకొన్నదిగాని, దొరికినా అబద్ధం చెప్పినదాన్ని, లేక దేన్ని గూర్చి అతడు అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని అతడు తిరిగి ఇచ్చివేయాలి. దాని పూర్తివిలువను అతడు చెల్లించాలి. తర్వాత దాని విలువలో అయిదోవంతు అదనంగా అతడు చెల్లించాలి. దాని అసలైన సొంతదారునికి అతడు ఆ మొత్తాన్ని ఇవ్వాలి. అతడు తన అపరాధ పరిహారార్థ బలి తెచ్చిననాడే దీన్ని చెల్లించాలి. ఆ వ్యక్తి అపరాధ పరిహారార్థ బలిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. అది మందలోనుంచి తెచ్చిన పొట్టేలు. ఆ పొట్టేలుకు ఏదోషమూ ఉండకూడదు. అది యాజకుడు నిర్ణయించిన ధరకు తగినదిగా ఉండాలి. అది యెహోవాకు అపరాధ పరిహారార్థ బలి. అప్పుడు యాజకుడు యెహోవా దగ్గరకు వెళ్లి, ఆ వ్యక్తి చేసిన పాపాన్ని నిర్మూలిస్తాడు. అప్పుడు అతణ్ణి దేవుడు క్షమిస్తాడు.” యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు. ఇది దహనబలి అర్పణ నియమము. రాత్రి అంతా, తెల్ల వారేవరకు దహనబలి అర్పణ బలిపీఠం మీద దహనం అవుతూనే ఉండాలి. బలిపీఠం మీద బలిపీఠపు అగ్ని మండుతూనే ఉండాలి. యాజకుడు తన నారబట్ట అంగీని ధరించాలి. అతడు తన నార చెడ్డీని వేసుకోవాలి. తర్వాత బలిపీఠం మీద దహనబలిని అగ్ని దహించగా మిగిలిన బూడిదను అతడు తీసుకోవాలి. ఈ బూడిదను యాజకుడు బలిపీఠం పక్కగా పోయాలి. అప్పుడు యాజకుడు తన బట్టలు తీసి వేసి వేరే బట్టలు ధరించాలి. తర్వాత అతడు ఆ బూడిదను బస వెలుపల ఒక ప్రత్యేక స్థలానికి తీసుకొని వెళ్లాలి. అయితే బలిపీఠపు అగ్నిని మాత్రం బలిపీఠం మీద మండుతూ ఉండనివ్వాలి. దానిని ఆరిపోనివ్వ కూడదు. ప్రతి ఉదయం బలిపీఠం మీద యాజకుడు కట్టెలను కాల్చుతూఉండాలి. బలిపీఠం మీద అతడు కట్టెలు పేర్చాలి. సమాధాన బలుల కొవ్వును అతడు దహించాలి. ఎల్లప్పుడూ ఆగకుండా బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. “ధాన్యార్పణలకు గల విధి ఇది. అహరోను కుమారులు యెహోవాకు బలిపీఠం ఎదుట దీనిని తీసుకొని రావాలి. ధాన్యార్పణలోనుంచి పిడికెడు మంచి పిండిని యాజకుడు తీసుకోవాలి. ధాన్యార్పణ మీద నూనె, సాంబ్రాణి ఉండాలి. ధాన్యార్పణాన్ని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది ఇష్టమైన సువాసనగాను, యెహోవాకు జ్ఞాపకార్థ అర్పణగాను ఉంటుంది. “మిగిలిపోయిన ధాన్యార్పణాన్ని అహరోను, అతని కుమారులు తినాలి. ధాన్యార్పణ పొంగని రొట్టెలా ఉంటుంది. యాజకులు ఈ రొట్టెను పవిత్ర స్థలంలో తినాలి. సన్నిధి గుడారపు ఆవరణలో వారు ఈ ధాన్యార్పణను తినాలి. ధాన్యార్పణను పులిసిన పదార్థం లేకుండా చేయాలి. అగ్నిద్వారా నాకు అర్పించబడిన అర్పణల్లో అది వారి భాగంగా నేను దానిని ఇచ్చాను. పాపపరిహారార్థ బలిలా, అపరాధ పరిహారార్థ బలి అర్పణలా అది కూడ అతి పవిత్రం. యెహోవాకు అగ్నిద్వారా అర్పించబడిన అర్పణల్లోనుంచి అహరోను మగ సంతానం అందరూ తినవచ్చును. మీ తరాలన్నింటికీ ఇది శాశ్వత నియమము. ఈ అర్పణల స్పర్శ వారిని పవిత్రులను చేస్తుంది.” యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “అహరోను, అతని కుమారులు యెహోవాకు తీసుకొని రావాల్సిన అర్పణలు ఇవి. అహరోను అభిషేకించబడిన రోజున వారు ఇలా చేయాలి. తూమెడు మంచి పిండిలో పదోవంతు వారు ఎల్లప్పుడూ ధాన్యార్పణగా తీసుకొనిరావాలి. అందులోనుంచి సగం ఉదయం, సగం సాయంత్రం వారు తీసుకొని రావాలి. మంచి పిండిని నూనెతో కలిపి, పెనం మీద దాన్ని చేయాలి. అది ఉడికిన తర్వాత దానిని మీరు లోనికి తీసుకొని రావాలి. ధాన్యార్పణాన్ని మీరు భాగాలుగా చేయాలి. దానిని మీరు యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి. “అహరోను, తర్వాత అతని సంతానంవారు ఎవరైతే అహరోను స్థానంలో అభిషేకించబడతారో వారు ఈ ధాన్యార్పణాన్ని యెహోవాకు పెట్టాలి. ఇది శాశ్వత నియమము, ధాన్యార్పణాన్ని యెహోవాకు పూర్తిగా దహించాలి. యాజకుల ప్రతీ ధాన్యార్పణను పూర్తిగాకాల్చాలి. దానిని తినకూడదు.” యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు: పాప పరిహారార్థ అర్పణ విధి ఇది. యెహోవా ఎదుట దహనబలి పశువు వధించబడే చోటనే పాపపరిహారార్థ బలి పశువుకూడ అర్పించ బడాలి. అది అతి పరిశుద్ధం. పాపపరిహారార్థబలిని అర్పించే యాజకుడే దానిని తినాలి. సన్నిధి గుడారం యొక్క ఆవరణలో ఒక పరిశుద్ధ స్థలంలో అతడు దానిని తినాలి. పాపపరిహారార్థబలి మాంసాన్ని తాకిన ప్రతి ఒక్కడూ పరిశుద్ధుడవుతాడు. మరియు తాకిన ప్రతి వస్తువూ పరిశుద్ధం అవుతుంది. “చిలకరించబడిన రక్తం ఏ బట్టలమీద పడినా, మీరు ఆ బట్టలను ఉతకాలి. పరిశుద్ధ స్థలంలో మీరు ఆ బట్టలను ఉతకాలి. పాపపరిహారార్థ బలి గనుక మట్టి పాత్రలో ఉడకబెడితే ఆ పాత్రను పగుల గొట్టివేయాలి. పాపపరిహారార్థ బలిని ఇత్తడి పాత్రలో ఉడకబెడితే ఆ పాత్రను తోమి, నీళ్లతో కడగాలి. “యాజకులలో ప్రతి ఒక్కడూ పాపపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం. కానీ పాపపరిహారార్థ బలి రక్తాన్ని గనుక పరిశుద్ధస్థలాన్ని శుద్ధి చేసేందుకని సన్నిధి గుడారంలోనికి తీసుకొని వెళ్తే, అప్పుడు ఆ పాపపరిహారార్థ బలిని అగ్నిలో కాల్చి వేయాలి. ఆ పాపపరిహారార్థ బలిని యాజకులు తినకూడదు.
లేవీయకాండము 6:1-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహముచేసి పాపియైనయెడల, అనగా తనకు అప్పగింపబడినదాని గూర్చియేగాని తాకట్టు ఉంచినదాని గూర్చియేగాని, దోచుకొనినదాని గూర్చియేగాని, తన పొరుగువానితో బొంకినయెడలనేమి, తన పొరుగువాని బలాత్కరించినయెడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దానిగూర్చి బొంకినయెడల నేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగు దురో వాటన్నిటిలో దేనివిషయమైనను అబద్ధప్రమాణము చేసినయెడల నేమి, అతడు పాపముచేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మునుగూర్చిగాని బలాత్కారముచేతను అపహరించినదానిగూర్చిగాని తనకు అప్పగింపబడినదానిగూర్చిగాని, పోయి తనకు దొరి కినదానిగూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధప్రమాణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను. ఆ మూలధనము నిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలోనుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను. ఆయాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము –ఇది దహనబలినిగూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉదయమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించుచుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగు కొని బలిపీఠముమీద అగ్ని దహించు దహనబలిద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొని పోవలెను. బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలువేసి, దానిమీద దహనబలిద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమునుగూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని అర్పించవలెను. అతడు నైవేద్యతైలమునుండియు దాని గోధుమపిండినుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలోనుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను; దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –అహరోనుకు అభిషేకముచేసిన దినమున, అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమపిండిలో పదియవవంతు. పెనముమీద నూనెతో దానిని కాల్చవలెను; దానిని కాల్చినతరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్యభాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతివారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను. యాజకుడుచేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా కాల్చబడవలెను; దాని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుము–పాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలిరూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతి పరిశుద్ధము. పాపపరిహారార్థబలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను. దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను; దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము. మరియు పాప పరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.