లేవీయకాండము 26:14-21 - Compare All Versions

లేవీయకాండము 26:14-21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ ‘కానీ మీరు నా మాట వినకపోతే, ఈ ఆజ్ఞలన్నిటిని పాటించకపోతే, మీరు నా శాసనాలను తిరస్కరించి, నా చట్టాలను అసహ్యించుకుని నా ఆజ్ఞలన్నిటిని పాటించడంలో విఫలమై, నా నిబంధనను ఉల్లంఘిస్తే, అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు. నేను మీకు విరోధంగా నా ముఖం పెడతాను, తద్వార మీ శత్రువులతో ఓడిపోతారు; మిమ్మల్ని ద్వేషించేవారే మిమ్మల్ని పరిపాలిస్తారు, ఎవరూ తరమకుండానే మీరు పారిపోతారు. “ ‘ఇదంతటి తర్వాత మీరు నా మాట వినకపోతే, నేను మీ పాపాల కోసం మిమ్మల్ని ఏడు రెట్లు ఎక్కువగా శిక్షిస్తాను. నేను మీ మొండి అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి, మీ పైన ఉన్న ఆకాశాన్ని ఇనుములా, మీ క్రింద ఉన్న భూమిని ఇత్తడిలా చేస్తాను. మీ బలము వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీ నేల తన పంటలను ఇవ్వదు, పండదు. మీ భూమిలో ఉన్న చెట్లు ఫలం ఇవ్వవు. “ ‘మీరు నా పట్ల శత్రుత్వం కలిగి ఉంటే, నా మాట వినడానికి నిరాకరిస్తే, మీ పాపాలకు తగినంతగా నేను మీ బాధలను ఏడు రెట్లు పెంచుతాను.

లేవీయకాండము 26:14-21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఒకవేళ మీరు నా మాట వినకుండా నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా నా శాసనాలను నిరాకరిస్తూ, నా ఆజ్ఞలన్నిటినీ నిరాకరిస్తూ నా నిబంధనను ఉల్లంఘిస్తూ నా తీర్పులను త్రోసిపుచ్చుతూ ఉంటారేమో. అలాగైతే నేను మీకు చేసేది ఇదే. మీమీదికి భయం రప్పిస్తాను. మీకు జ్వరం కలిగించి మీ కళ్ళు దెబ్బ తిని ప్రాణాలు నీరసించి పోయేలా చేస్తాను. మీరు చల్లిన విత్తనాలు వ్యర్థమైపోతాయి. మీ శత్రువులు వాటి పంటను తింటారు. మీ నుండి ముఖం తిప్పేసుకుంటాను. మీ శత్రువులు మిమ్మల్ని లోబరచుకుంటారు. మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని పరిపాలిస్తారు. ఎవరూ తరమకపోయినా మీరు పారిపోతారు. నా ఆజ్ఞలు పాటించకపోతే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను. మీ బల గర్వాన్ని భంగపరచి, ఆకాశాన్ని ఇనుములాగా భూమిని ఇత్తడిలాగా చేస్తాను. మీ భూమి ఫలించదు. మీ దేశంలోని చెట్లు ఫలించవు. మీ బలం వృథాగా ఇంకి పోతుంది. మీరు నా మాట వినకుండా నాకు విరోధంగా నడిస్తే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధిస్తాను.

లేవీయకాండము 26:14-21 TERV (పవిత్ర బైబిల్)

“అయితే మీరు నాకు విధేయులు కాకుండా, నా ఆజ్ఞలన్నింటినీ పాటించకుండా ఉంటే, అప్పుడు మీకు ఈ కీడులన్నీ జరుగుతాయి. నా ఆజ్ఞలు, నియమాలు పాటించడానికి మీరు నిరాకరిస్తే, మీరు నా ఒడంబడికను ఉల్లంఘించినట్టే. మీరు గనుక అలా చేస్తే అప్పుడు భయంకరమైన సంగతుల్ని మీకు సంభవింపజేస్తాను. నేను మీకు రోగం, జ్వరం వచ్చేటట్టు చేస్తాను. అవి మీ కళ్లను పాడుచేసి, మీ ప్రాణాల్ని తీస్తాయి. మీరు విత్తనాలు జల్లినప్పుడు ఫలితం ఉండదు. మీ శత్రువులు మీ పంటను తినివేస్తారు. నేను మీకు విరోధంగా ఉంటాను గనుక మీ శత్రువులు మిమ్మల్ని ఓడిస్తారు. ఆ శత్రువులు మిమ్మల్ని ద్వేషించి, మీ మీద అధికారం చేస్తారు. ఎవరూ మిమ్మల్ని తరమకుండానే మీరు పారిపోతారు. “ఇవన్నీ జరిగినా మీరు నాకు విధేయులు కాకపోతే, మీ పాపాలకోసం నేను మిమ్మల్ని ఏడంతలుగా శిక్షిస్తాను. మీకు అతిశయ కారణమైన మీ గొప్ప పట్టణాలను నేను కూలగొట్టేస్తాను. ఆకాశం వర్షాన్ని ఇవ్వదు, భూమి పంటనివ్వదు. మీరు కష్టపడి పనిచేస్తారు, కాని దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ భూమి పంటలేమీ ఇవ్వదు, మీ చెట్లు వాటి ఫలాలను ఇవ్వవు. “మీరు ఇంకా నాకు వ్యతిరేకంగా తిరిగి, నాకు విధేయులయ్యేందుకు తిరస్కరిస్తే, అప్పుడు ఇంకా ఏడు రెట్లు కఠినంగా నేను మిమ్మల్ని కొడతాను. మీరు ఎక్కువ పాపం చేసినకొద్దీ, మరింత ఎక్కువగా శిక్షించబడతారు.

లేవీయకాండము 26:14-21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను, నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు; నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు. ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను. మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినయెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.