లేవీయకాండము 16:15-34

లేవీయకాండము 16:15-34 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“తర్వాత అతడు ప్రజల పాపపరిహారబలి కోసం మేకపోతును వధించాలి, దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తెచ్చి కోడె రక్తాన్ని చేసినట్టు ప్రాయశ్చిత్త మూత మీద, దాని ముందు చిలకరించాలి. ఇశ్రాయేలీయుల అపవిత్రత కోసం, తిరుగుబాటు కోసం, వారి పాపాలన్నిటి కోసం అతడు అతి పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఇశ్రాయేలీయుల అపవిత్రత మధ్య వారి మధ్యలో ఉన్న సమావేశ గుడారం కోసం కూడా ఇదే రీతిలో ప్రాయశ్చిత్తం చేయాలి. అతి పరిశుద్ధస్థలంలో ప్రాయశ్చిత్తం చేయడానికి అహరోను లోపలికి వెళ్లినప్పుడు, తన కోసం తన ఇంటివారి కోసం ఇశ్రాయేలు సమాజమంతటి కోసం ప్రాయశ్చిత్తం జరిగించి బయటకు వచ్చేవరకు ఏ మనుష్యుడు సమావేశ గుడారంలో ఉండకూడదు. “తర్వాత అతడు యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వచ్చి దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అతడు కోడె రక్తం కొంచెం, మేకపోతు రక్తం కొంచెం తీసుకుని బలిపీఠం కొమ్ములన్నిటికి పూయాలి. దానిని శుద్ధీకరించడానికి అతడు తన వ్రేలితో ఆ రక్తాన్ని దానిపై ఏడుసార్లు చల్లి ఇశ్రాయేలీయుల అపవిత్రత నుండి దానిని పవిత్రపరచాలి. “అహరోను అతి పరిశుద్ధ స్థలానికి సమావేశ గుడారానికి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత, అతడు సజీవ మేకపోతును తీసుకురావాలి. ఆ మేకపోతు తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల దుష్టత్వమంతటిని, తిరుగుబాటును, పాపాలన్నిటిని దానిపై ఒప్పుకుని వాటిని మేకపోతు తలపై మోపాలి. ఈ పనికి నియమించబడిన వ్యక్తి ఆ మేకపోతును తీసుకెళ్లి అరణ్యంలో వదిలిపెట్టాలి. ఆ మేకపోతు ఈ విధంగా వారి పాపాలన్నిటిని భరిస్తూ నిర్జన ప్రదేశాలకు వెళ్తుంది; ఆ వ్యక్తి దానిని అరణ్యంలో వదిలేస్తాడు. “అప్పుడు అహరోను సమావేశ గుడారంలోకి వెళ్లి అతి పరిశుద్ధస్థలంలోకి వెళ్లేముందు తాను వేసుకున్న సన్నని నార వస్త్రాలను విప్పివేయాలి. అతడు పరిశుద్ధాలయ ప్రాంగణంలో నీటితో స్నానం చేసి తన సాధారణ బట్టలు వేసుకోవాలి. బయటకు వచ్చి తన కోసం దహనబలిని, ప్రజల పక్షాన మరో దహనబలిని అర్పించి తన కోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. అతడు పాపపరిహారబలి యొక్క క్రొవ్వును బలిపీఠం మీద కాల్చాలి. “బలిపశువైన మేకను విడిచిపెట్టి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసిన తర్వాత అతడు శిబిరంలోకి రావచ్చు. ప్రాయశ్చిత్తం కోసం అతి పరిశుద్ధస్థలంలోకి వేటి రక్తాన్నైతే తీసుకువచ్చారో ఆ పాపపరిహార బలులైన కోడెదూడను, మేకపోతును శిబిరం బయటకు తీసుకెళ్ళాలి; వాటి చర్మాలను, మాంసాన్ని, పేడను కాల్చివేయాలి. వాటిని కాల్చే వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి ఆ తర్వాత శిబిరంలోకి రావచ్చు. “నెల పదవ రోజున మీరంతా ఉపవాసముండాలి. స్వదేశీయులు గాని, మీ ఇంట్లో ఉన్నా విదేశీయులు గాని ఎవరైనా సరే ఈ నియమం అందరికి వర్తిస్తుంది. ఆ రోజున ఎవరూ ఏ పని చేయకూడదు. ఎందుకంటే ఆ రోజున మిమ్మల్ని పవిత్రపరచడానికి ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. అప్పుడు యెహోవా ఎదుట, మీ పాపాలన్నిటి నుండి మీరు శుద్ధి చేయబడతారు. ఆ రోజు మీకు సబ్బాతు విశ్రాంతి దినము. అప్పుడు మీరు ఉపవాసముండాలి; ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది. ఎవరైతే తన తండ్రి స్థానంలో అభిషేకం పొంది ప్రధాన యాజకుడుగా ప్రతిష్ఠించబడతారో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం జరిగించాలి. అతడు పవిత్రమైన నార వస్త్రాలు ధరించి, అతి పరిశుద్ధ స్థలానికి, సమావేశ గుడారానికి బలిపీఠానికి, యాజకులకు, సమాజంలోని సభ్యులందరికి ప్రాయశ్చిత్తం చేయాలి. “ఇది మీ కోసం నిత్య కట్టుబాటుగా ఉంటుంది: ఇశ్రాయేలీయుల పాపాలన్నిటికీ సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చేయాలి.” యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే, అంతా జరిగింది.

లేవీయకాండము 16:15-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు ప్రజలర్పించే పాపం కోసం బలిగా మేకని వధించాలి. దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకు రావాలి. కోడె దూడ రక్తంతో చేసినట్టే మేక రక్తంతోనూ చేయాలి. దాని రక్తాన్ని మందసం మూత ఎదుటా దాని పైనా చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరి అశుద్ధమైన పనులను బట్టీ, వారి తిరుగుబాటును బట్టీ, వారందరి పాపాలన్నిటిని బట్టీ పరిశుద్ధ స్థలానికి పరిహారం చేయాలి. వారి అశుద్ధమైన పనుల మధ్యలో ప్రత్యక్ష గుడారంలో యెహోవా వారి మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్ష గుడారం కోసం కూడా పరిహారం చేయాలి. అతి పవిత్ర స్థలం లో పరిహారం చేయడానికి అహరోను ప్రవేశించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు. అతడు తన కోసం, తన కుటుంబం కోసం, ఇంకా ప్రజలందరి కోసం పరిహారం చేయడం ముగించి బయటకి వచ్చేంత వరకూ ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు. తరువాత అతడు బయట యెహోవా సమక్షంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి దానికోసం పరిహారం చేయాలి. అతడు ఆ కోడె దూడ రక్తంలో కొంత, మేక రక్తంలో కొంత తీసుకుని బలిపీఠం కొమ్ములకు పూయాలి. ఆ రక్తాన్ని ఏడు సార్లు తన వేలితో బలిపీఠంపై చిలకరించాలి. అలా దాన్ని పవిత్ర పరచి ఇశ్రాయేలు ప్రజలు చేసే అశుద్ధ పనుల నుండి దాన్ని శుద్ధీకరించాలి. అతడు అతి పవిత్ర స్థలానికీ, ప్రత్యక్ష గుడారానికీ, బలిపీఠంకీ పరిహారం చేసి ముగించిన తరువాత బతికి ఉన్న మేకని తీసుకు రావాలి. అప్పుడు అహరోను బతికి ఉన్న ఆ మేక తలపైన తన రెండు చేతులూ ఉంచి ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గాలన్నటినీ, వారి తిరుగుబాటు అంతటినీ, వారి పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. ఆ విధంగా ఆ పాపాన్నంతా ఆ మేక పైన మోపి దాన్ని అడవిలోకి తోలుకుని వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తితో పంపించి వేయాలి. ఆ మేక ప్రజల దుర్మార్గాలన్నిటినీ తన పై వేసుకుని ఎవరూ లేని ప్రాంతానికి వెళ్ళాలి. ఆ వ్యక్తి దాన్ని అడవిలోకి తీసుకు వెళ్ళి అక్కడ దాన్ని విడిచిపెట్టాలి. తరువాత అహరోను ప్రత్యక్ష గుడారంలోకి తిరిగి వచ్చి అతి పవిత్ర స్థలం లోకి వెళ్లే ముందు తాను ధరించిన నార వస్త్రాలను తీసి వాటిని అక్కడే ఉంచాలి. అతడు పవిత్ర స్థలం లో స్నానం చేసి తిరిగి తన సాధారణ బట్టలు వేసుకుని బయటకు రావాలి. అప్పుడు తన కొరకూ, ప్రజల కొరకూ దహనబలులు అర్పించి తన కోసం, ప్రజల కోసం పరిహారం చేయాలి. పాపం కోసం చేసే బలి పశువు కొవ్వుని బలిపీఠం పైన దహించాలి. విడిచిపెట్టే మేకని వదిలి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. ఆ తరువాత అతడు శిబిరంలోకి రావచ్చు. పవిత్ర స్థలం లో పాపాల కోసం బలి చేసిన ఏ కోడె దూడ రక్తం, ఏ మేక రక్తం అతి పవిత్ర స్థలం లోకి తెచ్చారో ఆ కోడె దూడ, మేకల కళేబరాలను ఒకవ్యక్తి శిబిరం బయటకు తీసుకువెళ్ళాలి. అక్కడ వాటి చర్మాలనూ, మాంసాన్నీ, పేడనూ మంట పెట్టి కాల్చి వేయాలి. వాటిని కాల్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి తిరిగి శిబిరంలోకి రావచ్చు. మీరు ఏడో నెల పదో రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు ఎలాంటి పనీ చేయకూడదు. స్థానిక ప్రజలకీ, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకీ ఇది వర్తిస్తుంది. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం. ఎందుకంటే ఆ రోజు యెహోవా సమక్షంలో మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికై మీ పాపాలకు శుద్ధీకరణ చేసేందుకు మీ కోసం పరిహారం జరిగింది. అది మీకు మహా విశ్రాంతి దినం. ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి. ఎలాంటి పనీ చేయకూడదు. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం. తన తండ్రి స్థానంలో ప్రతిష్ఠి జరిగి యాజకుడిగా అభిషేకం పొందిన వ్యక్తి పరిహారం చేసుకుని ప్రతిష్ఠి చేసిన నార బట్టలు వేసుకోవాలి. అతడు అతి పవిత్ర స్థలానికి పరిహారం చేయాలి. ప్రత్యక్ష గుడారానికీ, బలిపీఠంకీ పరిహారం చేయాలి. యాజకుల కొరకూ, సమాజంలోని ప్రజలందరి కొరకూ పరిహారం చేయాలి. ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నిటి కోసం సంవత్సరానికి ఒకసారి పరిహారం చేయాలి. ఇది మీకు శాశ్వతమైన శాసనం.” యెహోవా ఆదేశించిన ప్రకారం మోషే చేసాడు.

లేవీయకాండము 16:15-34 పవిత్ర బైబిల్ (TERV)

“తర్వాత అహరోను ప్రజలకోసం పాప పరిహారార్థ బలి మేకను వధించాలి. తెరవెనుక ఉన్న గదిలోనికి ఈ మేక రక్తాన్ని అహరోను తీసుకొని రావాలి. కోడెదూడ రక్తంతో ఏమైతేచేసాడో అలాగే మేక రక్తంతోకూడ అహరోను చేయాలి. కరుణాపీఠం మీద, కరుణాపీఠం ఎదుట ఆ మేక రక్తాన్ని అహరోను చిలకరించాలి. ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమయిన సందర్భాలెన్నో ఉన్నాయి కనుక ఇశ్రాయేలు ప్రజల పాపాలు, నేరాలనుండి ఆ అతిపరిశుద్ధ స్థలాన్ని పవిత్రం చేసేందుకు జరగాల్సిన ప్రాయశ్చిత్తాన్ని అహరోను చేయాలి. అహరోను ఎందుకు ఇవన్నీ చేయాలి? సన్నిధిగుడారం అపవిత్ర ప్రజల మధ్య ఉంటుందిగనుక. “అతి పరిశుద్ధ స్థలాన్ని అహరోను పవిత్రం చేసే సమయంలో సన్నిధిగుడారంలో ఎవ్వరూ ఉండకూడదు. అహరోను బయటకు వచ్చేంతవరకు ఏ వ్యక్తీ లోకిని వెళ్లకూడదు. కనుక అహరోను తనను, తన కుటుంబాన్ని పవిత్రం చేసుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. తర్వాత యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం దగ్గరకు అహరోను వెళ్లాలి. అహరోను బలిపీఠాన్ని పవిత్రం చేస్తాడు. కోడెదూడ రక్తంలో కొంచెం, మేక రక్తంలో కొంచెం తీసుకొని బలిపీఠం అన్ని వైపులా ఉన్న దాని కొమ్ములకు అహరోను పూయాలి. తర్వాత అహరోను తన వేలితో కొంత రక్తాన్ని బలి పీఠం మీద ఏడుసార్లు చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నింటి నుండి బలిపీఠాన్ని అహరోను పరిశుద్ధంగా, పవిత్రంగా చేయాలి. “అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని, అహరోను పవిత్రం చేస్తాడు. అలా జరిగిన తర్వాత ఆ మేకను ప్రాణంతోనే యెహోవా సన్నిధికి అహరోను తీసుకొని వస్తాడు. బతికే ఉన్న ఆ మేక తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచుతాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పాపాలను, నేరాలను ఆ మేకమీద అహరోను ఒప్పుకొంటాడు. ఈ విధంగా అహరోను ప్రజల పాపాలను మేక నెత్తిమీద మోపుతాడు. అప్పుడు ఆ మేకను అరణ్యంలోకి వదిలి పెట్టేస్తాడు. ఈ మేకను అతను తోలివేయటానికి పక్కనే ఒక మనిషి సిద్ధంగా నిలబడి ఉంటాడు. కనుక ప్రజలందరి పాపాలను ఆ మేక తనమీద మోసుకొని ఖాళీ అరణ్యంలోనికి తీసుకొనిపోతుంది. ఆ మేకను తోలు కొనిపోయిన వాడు అరణ్యంలో దానిని విడిచి పెట్టివేయాలి. “అప్పుడు అహరోను సన్నిధి గుడారంలో ప్రవేశించాలి. పవిత్రస్థలంలోనికి వెళ్లినప్పుడు తాను ధరించిన వస్త్రాలను అతడు తీసివేయాలి. వాటిని అక్కడే వదిలివేయాలి. పవిత్ర స్థలంలో అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు తన ఇతర ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. అతడు బయటకు వచ్చి తనకోసం దహన బలిని, ప్రజలకోసం దహనబలిని అర్పించాలి. అతని కోసం, ప్రజలకోసం అతడు తనను పవిత్రంచేసుకోవాలి. అప్పుడు పాపపరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును అతడు బలిపీఠం మీద దహించాలి. “విడిచిపెట్టే మేకను అరణ్యంలో విడిచి పెట్టిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును. “పాపపరిహారార్థ బలిపశువులైన కోడెదూడను, మేకలను బస వెలుపలికి తీసుకొనిపోవాలి. ఈ జంతువుల రక్తం పవిత్ర వస్తువులను పవిత్రం చేసేందుకు పవిత్ర స్థలానికి తీసుకొని రాబడింది. ఆ జంతువుల చర్మాలను శవాలను, వాటి మలమును యాజకులు అగ్నితో కాల్చివేయాలి. తర్వాత వాటిని కాల్చిన వ్యక్తి తన వస్త్రాలను ఉతుక్కొని, నీళ్లలో స్నానంచేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును. “ఆ ఆజ్ఞ మీకు శాశ్వతంగా ఉంటుంది. ఏడవ నెల పదో రోజున మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరేమీపని చేయకూడదు. మీ మధ్య నివసిస్తున్న విదేశీ యాత్రికులు ఎవరూ పని చేయకూడదు. ఎందుచేతనంటే ఆ రోజు యాజకుడు మిమ్మల్ని పవిత్రంచేసి, మీ పాపాలను కడిగివేస్తాడు. అప్పుడు మీరు యెహోవాకు పవిత్రం చేయబడిన వారవుతారు. ఇది మీకు చాల ముఖ్యమైన విశ్రాంతి రోజు. మీరు భోజనం చేయకూడదు. ఈ ఆజ్ఞ ఎప్పటికీ కొన సాగుతుంది. “కనుక నియమించబడిన ప్రధాన యాజకుడు, అంటే యాజకత్వం చేసేందుకు నియమించబడ్డ మనిషి. అతడు అన్నింటినీ పవిత్రం చేసే కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఆ యాజకుడు పవిత్ర నార వస్త్రాలు ధరించాలి. అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని అతడు పవిత్రం చేయాలి. యాజకులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. ఇశ్రాయేలు ప్రజలను పవిత్రం చేసేందుకు ఇవ్వబడ్డ ఆ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరంలో ఒక సారి మీరు వాటిని జరిగించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పాపాల మూలంగా వీటిని చేయవలెను.” కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ వారు జరిగించారు.

లేవీయకాండము 16:15-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్థబలియగు మేకను వధించి అడ్డతెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టియు, అనగా వారి అపవిత్రతనుబట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుటవలన వారి అపవిత్రతనుబట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడెరక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి, తాను పరిశుద్ధస్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తనకొరకు దహన బలిని ప్రజలకొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను పాప పరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థబలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతిదినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆయాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.