లేవీయకాండము 10:1-3
లేవీయకాండము 10:1-3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అహరోను కుమారులు నాదాబు, అబీహు తమ ధూపార్తులను తీసుకుని, వాటిలో నిప్పు ఉంచి దానిపై ధూపం వేశారు; వారు యెహోవా ఎదుట ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా అనధికార అగ్నిని సమర్పించారు. కాబట్టి యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని దహించివేయగా, వారు యెహోవా ఎదుట చనిపోయారు. అప్పుడు మోషే అప్పుడు అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఇలా చెప్పారు: “ ‘నన్ను సమీపించేవారి ద్వారా నేను నా పరిశుద్ధతను కనుపరచుకుంటాను; ప్రజలందరి దృష్టిలో నేను ఘనపరచబడతాను.’ ” అహరోను మౌనంగా ఉండిపోయాడు.
లేవీయకాండము 10:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాదాబు అబీహులు అహరోను కొడుకులు. వీళ్ళు తమ ధూపం వేసే పాత్రల్లో నిప్పులు ఉంచి వాటిపై ధూప ద్రవ్యాన్ని వేశారు. యెహోవా ఆదేశించని వేరే అగ్నిని ఆయన సమక్షంలోకి తీసుకు వచ్చారు. దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్ళని కాల్చి వేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్ళు చనిపోయారు. అప్పుడు మోషే అహరోనుతో “నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే” అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.
లేవీయకాండము 10:1-3 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు అహరోను కుమారులైన నాదాబు, అబీహులు పాపం చేసారు. ధూపం వేసేందుకు ఒక్కో కుమారుడు ఒక్కో ధూపార్తిని తీసుకొన్నాడు. వారు వేరే నిప్పు తీసుకొని ధూపం అంటించారు. వారు ఉపయోగించాలని దేవుడు ఆజ్ఞాపించిన నిప్పును వారు ఉపయోగించలేదు. కనుక యెహోవా నుండి అగ్ని వచ్చి నాదాబు, అబీహులను నాశనం చేసింది. యెహోవా ఎదుట వారు మరణించారు. అప్పుడు అహరోనుతో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ‘నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి.’” కనుక అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు.
లేవీయకాండము 10:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమతమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను–ఇది యెహోవా చెప్పిన మాట–నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును