విలాపవాక్యములు 3:19-23 - Compare All Versions
విలాపవాక్యములు 3:19-23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి, నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి. నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది. అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను, కాబట్టి నాకు నిరీక్షణ ఉంది: యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు. ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది.
విలాపవాక్యములు 3:19-23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను. కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను. కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది. యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు. ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!
విలాపవాక్యములు 3:19-23 TERV (పవిత్ర బైబిల్)
ఓ యెహోవా, నా దుఃఖాన్ని, నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము. నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము. నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను మిక్కిలి విచారిస్తున్నాను. కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది. నేను ఇలా అనుకున్నాను. యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి. అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
విలాపవాక్యములు 3:19-23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.