యెహోషువ 7:1-13

యెహోషువ 7:1-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

శపించబడిన వాటి విషయంలో ఇశ్రాయేలీయులు నమ్మకద్రోహులుగా ఉన్నారు. యూదా గోత్రపు వాడైన జెరహు కుమారుడు జబ్ది, జబ్ది కుమారుడు కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను వాటిలో కొన్నిటిని తీసుకున్నాడు. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలీయులపై రగులుకుంది. తర్వాత యెహోషువ యెరికో నుండి బేతేలుకు తూర్పున బేత్-ఆవెను సమీపంలో ఉన్న హాయికి మనుష్యులను పంపుతూ, “మీరు వెళ్లి ఆ ప్రదేశాన్ని వేగుచూసి రండి” అని చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి హాయిని వేగు చూశారు. వారు యెహోషువ దగ్గరకు తిరిగివచ్చి, “హాయి మీదికి సైన్యమంతా వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనపరచుకోడానికి రెండు లేదా మూడువేలమందిని పంపండి చాలు, సైన్యమంతా అలసిపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడ కొంతమంది మాత్రమే నివసిస్తున్నారు.” కాబట్టి ప్రజల్లో సుమారు మూడువేలమంది యోధులు వెళ్లారు; కానీ వారు హాయి ప్రజల ఎదుట నిలబడలేక పారిపోయారు, హాయి ప్రజలు వారిలో ముప్పై ఆరుగురిని చంపారు. వారు ఇశ్రాయేలీయులను పట్టణ ద్వారం నుండి రాతి గనుల వరకు కొండ దిగువన వారిని చంపారు. దీంతో ప్రజల గుండెలు భయంతో నీరుగారిపోయాయి. అప్పుడు యెహోషువ, తన బట్టలు చింపుకొని యెహోవా మందసం ముందు నేలమీద పడి, సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలు పెద్దలు కూడా అలాగే చేసి తమ తలలపై దుమ్ము చల్లుకున్నారు. యెహోషువ, “అయ్యో! ప్రభువైన యెహోవా! ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మమ్మల్ని నాశనం చేయమని అమోరీయుల చేతికి అప్పగించడానికా? మేము యొర్దాను అవతలి ఒడ్డున ఆగిపోవడానికి నిర్ణయించుకొని ఉంటే ఎంత బాగుండేది! ప్రభువా, మీ సేవకుని క్షమించు. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువును ఎదుర్కోలేక పారిపోయారు, నేను ఏమి చెప్పగలను? కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు. అయితే యెహోవా యెహోషువతో ఇలా అన్నారు, “నీవు లే! నీ ముఖం నేలకేసి నీవేమి చేస్తున్నావు? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు; నేను వారికి ఆజ్ఞాపించిన నా ఒడంబడికను వారు ఉల్లంఘించారు. శపించబడిన వాటిలో కొన్నిటిని తీసి దొంగిలించి అబద్ధమాడారు, వారు వాటిని తమ సొంత ఆస్తులతో పాటు పెట్టుకున్నారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల ఎదుట నిలువలేక పోతున్నారు; వారు శాపానికి గురికావడం వల్లనే శత్రువులకు వెన్ను చూపి పారిపోయారు. మీ మధ్య వేరుగా ఉంచబడిన వాటన్నిటిని మీరు నాశనం చేస్తేనే తప్ప నేను ఇప్పటినుండి మీతో ఉండను. “నీవు వెళ్లి, ప్రజలను పవిత్రపరచు. వారితో ఇలా చెప్పు, ‘రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి; ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలూ, మీ మధ్య శాపగ్రస్తమైనవి ఉన్నాయి. వాటిని తీసివేసే వరకు మీరు మీ శత్రువుల ఎదుట నిలబడలేరు.

యెహోషువ 7:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

శాపానికి గురైన దాన్ని నాశనం చేసే విషయంలో ఇశ్రాయేలీయులు అపనమ్మకంగా ప్రవర్తించారు. యూదాగోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మీ కుమారుడు, ఆకాను నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నిటిని సొంతానికి తీసుకున్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు. యెహోషువ “మీరు వెళ్లి దేశాన్ని వేగు చూడండి” అని చెప్పి బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉన్న హాయి అనే పట్టణానికి యెరికో నుండి గూఢచారులను పంపాడు. వారు వెళ్లి, హాయి పట్టణాన్ని వేగు చూసి యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చి “ప్రజలందరినీ పంపించకు, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకోవచ్చు, అందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్లనక్కరలేదు, హాయి ప్రజలు కొద్దిమందే ఉన్నారు” అన్నారు. కాబట్టి సుమారు మూడు వేలమంది సైనికులు అక్కడికి వెళ్ళారు గాని వారు హాయి ప్రజల ముందు నిలవలేక పారిపోయారు. హాయి ప్రజలు వారిలో ముప్ఫై ఆరుగురిని చంపేశారు. అదీ కాకుండా వారి పట్టణ ద్వారం దగ్గర నుండి షేబారీము వరకూ తరిమి మోరాదులో వారిని చంపేశారు. కాబట్టి ఇశ్రాయేలీయుల గుండెలు కరిగి నీరైపోయాయి. యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. అతడూ ఇశ్రాయేలీయుల పెద్దలూ సాయంకాలం వరకూ యెహోవా మందసం ముందు నేలమీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకొంటూ “అయ్యో, ప్రభూ, యెహోవా, మమ్మల్ని నాశనం చేయడానికీ అమోరీయుల చేతికి అప్పగించడానికీ ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మేము యొర్దాను అవతల నివసించడమే మేలు కదా. ప్రభూ, కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఎదుర్కోలేక వెన్ను చూపినందుకు నేనేమి చెప్పాలి? కనానీయులు, ఈ దేశ ప్రజలంతా ఇది విని, మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద ఉండకుండాా తుడిచి పెట్టేస్తారు. అప్పుడు ఘనమైన నీ నామం కోసం నువ్వు ఏం చేస్తావు” అని ప్రార్థించారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు “లే, ఎందుకు ఇక్కడ నేల మీద ముఖం మోపుకున్నావు? ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధనను ఉల్లంఘించారు. శపితమైన దాన్ని కొంత దొంగిలించి, తమ సామానులో దాన్ని పెట్టుకున్నారు. ఆ పాపాన్ని కప్పిపుచ్చారు. కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు. వారు తమకు తామే నాశనానికి గురయ్యారు కాబట్టి తమ శత్రువులకు వెన్నుచూపించారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య ఉండకుండాా నిర్మూలం చేస్తే తప్ప నేను మీతో ఉండను. నీవు వెళ్లి వారితో ఇలా చెప్పు, ‘రేపు ఉదయం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి ఉంది, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేసేవరకూ మీ శత్రువుల ముందు మీరు నిలబడలేరు.’

యెహోషువ 7:1-13 పవిత్ర బైబిల్ (TERV)

అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. యూదా వంశానికి చెందిన జబ్ది మనుమడు, కర్మి కుమారుడు ఆకాను అనే పేరుగలవాడు ఒకడు ఉన్నాడు. నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నింటిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది. వారు యెరికోను ఓడించిన తర్వాత యెహోషువ హాయి పట్టణానికి కొందరు మనుష్యుల్ని పంపించాడు. బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉంది హాయి. “హాయికి వెళ్లి, ఆ ప్రాంతంలో బలహీనతలు ఏమిటో చూడండి” అని యెహోషువ వారితో చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగు చూడటానికి ఆ మనుష్యులు వెళ్లారు. తర్వాత ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. “హాయి బలహీన ప్రాంతం. ఆ దేశాన్ని జయించేందుకు మనకు మన మనుష్యులంతా అవసరం లేదు. అక్కడ యుద్ధానికి రెండువేల మంది లేక మూడు వేల మందిని పంపించు. మన ప్రజలందర్నీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనమీద పోరాడేందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉన్నారు” అన్నారు వారు. కనుక సమారు మూడువేల మంది మనుష్యులు హాయికి వెళ్లారు. కాని హాయివారు ఇశ్రాయేలు మనుష్యులను 36 మందిని చంపివేసారు. పైగా ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారు. హాయివాళ్లు తమ పట్టణ ద్వారాల దగ్గరనుండి షేబారీమువరకు వాళ్లను తరిమివేసారు. హాయివాళ్లు వారిని బాగా కొట్టివేసారు. ఇశ్రాయేలు ప్రజలు అది చూసి, చాలా భయపడిపోయారు, ధైర్యం కోల్పోయారు. యెహోషువ ఇది విని, తన బట్టలు చింపుకొని, పవిత్ర పెట్టె ముందర నేలమీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకులంతా అలానే చేసారు. వారు వారి తలలమీద ధూళి పోసుకొన్నారు. అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యొర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని నాశనం చేయునట్లు చేశావు. యొర్దాను నది ఆవల మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది. నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు శత్రువులకు లోబడిపోయారు. కనానీ ప్రజలు, ఈ దేశంలోని ప్రజలందరూ జరిగిన దానిగూర్చి వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?” యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: “లేచి నిలబడు! ఎందుకు నీవు సాష్టాంగ పడతావు? ఇశ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా పాపం చేసారు. వాళ్లు విధేయులు కావాలని నేను చేసిన ఒడంబడికను వారు ఉల్లంఘించారు. నాశనం చేయాలని నేను ఆజ్ఞాపించిన వాటిలో వారు కొన్ని తీసుకొన్నారు. వారు నా దగ్గర దొంగతనం చేసారు. వాళ్లు అబద్ధం చెప్పారు. ఆ వస్తువుల్ని వాళ్లు వారికోసం దాచుకొన్నారు. అందుచేతనే ఇశ్రాయేలు సైన్యం యుద్ధంలో ఓడిపోయి పారిపోయింది. వారు తప్పు చేసినందువల్లనే ఇలా జరిగింది. వాళ్లు నాశనం కావాలి. నేను ఇంక మీకు సహాయం చేయను. మీరు నాశనం చేయాలని నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేస్తేనే తప్ప నేను ఇక మీదట మీకు తోడుగా ఉండును. “ఇప్పుడు వెళ్లి, ప్రజలను పవిత్రం చేసి, ప్రజలతో ఇలా చెప్పు, ‘మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపటికోసం సిద్ధపడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడు నాశనం చేయుమని ఆజ్ఞాపించిన వాటిని కొంత మంది దాచిపెట్టుకొన్నారని ఆయన చెబుతున్నాడు. వాటిని మీరు పారవేసేటంతవరకు మీరెన్నటికీ మీ శత్రువుల్ని ఓడించలేరు.

యెహోషువ 7:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేసిరి. ఎట్లనగా యూదాగోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడినదానిలో కొంత తీసికొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయులమీద కోపించెను. యెహోషువ–మీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి–జనులందరిని వెళ్లనీయకుము, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకొన వచ్చును, జనులందరు ప్రయాసపడి అక్కడికి వెళ్లనేల? హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేలమంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు –అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీయులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసినయెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను–లెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు? ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొనియున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను. నీవు లేచి జనులను పరిశుద్ధపఱచి వారితో ఈలాగు చెప్పుము–రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొకటికలదు; మీరు దానిని మీ మధ్యనుండకుండ నిర్మూలము చేయువరకు మీ శత్రువుల యెదుట మీరు నిలువలేరు.