యెహోషువ 6:4-7
యెహోషువ 6:4-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మందసం ముందు ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి. ఏడవ రోజున యాజకులు బూరలు ఊదుతూ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరగాలి. వారు మానకుండా చేస్తున్న బూరధ్వని మీరు విన్నప్పుడు, సైన్యమంతా పెద్దగా కేకలు వేయాలి; అప్పుడు ఆ పట్టణపు గోడ కూలిపోతుంది, సైన్యంలో ప్రతి ఒక్కరు పైకి ఎక్కి నేరుగా లోపలికి వెళ్తారు.” కాబట్టి నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి వారితో, “మీరు యెహోవా నిబంధన మందసాన్ని ఎత్తుకుని దాని ముందు ఏడుగురు యాజకులు బూరలు పట్టుకుని నడవాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత అతడు, “పదండి ముందుకు! యెహోవా మందసం ముందు ఆయుధాలు ధరించిన వీరులు నడుస్తుండగా పట్టణం చుట్టూ తిరగాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
యెహోషువ 6:4-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలా ఆరు రోజులు చేయాలి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. ఏడవ రోజున మీరు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి” అన్నాడు. నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా ఏడు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి” అని వారితో చెప్పాడు. తరువాత అతడు “మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి, యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి” అని ప్రజలతో చెప్పాడు.
యెహోషువ 6:4-7 పవిత్ర బైబిల్ (TERV)
పొట్టేలు కొమ్ములతో చేసిన బూరలు ఊదేందుకు ఏడుగురు యాజకులను నియమించుము. పవిత్ర పెట్టెకు ముందుగా నడువుమని యాజకులతో చెప్పు. ఏడో రోజున ఏడుసార్లు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఏడోరోజున వారు ముందడుగు వేయగానే బూరలు ఊదాలని యాజకులతో చెప్పు. యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం లోనికి వెళ్లిపోవాలి.” కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు. “ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు.
యెహోషువ 6:4-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవదినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆయాజకులు బూరల నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి–మీరు నిబంధనమందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను. మరియు అతడు–మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.