యెహోషువ 5:13-15
యెహోషువ 5:13-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోషువ యెరికోకు సమీపంలో ఉన్నప్పుడు, అతడు పైకి చూసినప్పుడు ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని తన ముందు నిలబడి కనిపించాడు. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా పక్షమా లేదా మా శత్రువుల పక్షమా?” అని అడిగాడు. “ఎవరి పక్షం కాను, అయితే నేనిప్పుడు యెహోవా సేనాధిపతిగా వచ్చాను” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ భక్తితో నేలమీద బోర్లపడి, “నా ప్రభువు తన సేవకునికి ఏమి సందేశం ఇస్తారు?” అని అడిగాడు. అందుకు యెహోవా సేనాధిపతి యెహోషువతో, “నీవు నిలబడిన స్ధలం పవిత్రమైనది, కాబట్టి నీ చెప్పులు తీసివేయి” అని చెప్పగానే యెహోషువ అలాగే చేశాడు.
యెహోషువ 5:13-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి “నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా” అని అడిగాడు. అతడు “కాదు, యెహోవా సైన్యానికి సేనాధిపతిగా నేను వచ్చాను” అన్నాడు. యెహోషువ నేలకు సాగిలపడి నమస్కారం చేసి “నా యేలినవాడు తన దాసునికి ఏమి సెలవిస్తాడు” అని అడిగాడు. అందుకు యెహోవా సేనాధిపతి “నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి” అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు.
యెహోషువ 5:13-15 పవిత్ర బైబిల్ (TERV)
యెహోషువ యెరికోకు సమీపంగా ఉన్నప్పుడు అతడు పైకి చూడగా అతని యెదుట ఒక మనిషినిలిచి ఉండటం కనబడింది. ఆ మనిషి చేతిలో ఒక ఖడ్గం ఉంది. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు. ఆ మనిషి, “నేను శత్రువును కాను. నేను యెహోవా సైన్యములకు సేనాధిపతిని. ఇప్పుడే నేను మీ దగ్గరకు వచ్చాను” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ, ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి, “నా యజమానీ, తన సేవకుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగాడు. అందుకు యెహోవా సైన్యాధిపతి, “నీ చెప్పులు తీసివేయి. ఇప్పుడు నీవు నిలిచిన స్థలం పవిత్ర స్థలము” అని చెప్పాడు. కనుక యెహోషువ ఆయనకు విధేయుడయ్యాడు.
యెహోషువ 5:13-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేతపట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లి–నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా అతడు–కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసి–నా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి –నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ ఆలాగు చేసెను.