యెహోషువ 4:1-7

యెహోషువ 4:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు, “ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున ప్రజల్లో నుండి పన్నెండుమందిని ఎన్నుకుని, యొర్దాను మధ్య నుండి, అంటే యాజకులు నిలబడి ఉన్న చోటుకు కుడివైపు నుండి పన్నెండు రాళ్లను తీసుకుని, వాటిని మీతో పాటు మోసుకువెళ్లి, ఈ రాత్రి మీరు బసచేసే స్థలంలో వాటిని ఉంచమని వారికి చెప్పు” అని ఆజ్ఞాపించారు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల నుండి తాను నియమించిన పన్నెండుమందిని ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున పిలిచి, వారితో, “మీ దేవుడైన యెహోవా మందసానికి ముందుగా యొర్దాను మధ్యలోనికి వెళ్లండి. ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున మీలో ప్రతి ఒక్కరూ తన భుజంపై ఒక రాయిని మోయాలి, అది మీ మధ్య ఒక సూచనగా ఉంటుంది. భవిష్యత్తులో, ‘ఈ రాళ్లకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, యెహోవా నిబంధన మందసం యొర్దాను దాటుతున్నప్పుడు యొర్దాను నీళ్లు ఆగిపోయాయి. కాబట్టి ఈ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు నిత్యం జ్ఞాపకార్థంగా ఉంటాయి అని వారికి చెప్పండి.”

యెహోషువ 4:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ప్రజలందరూ యొర్దానును నది దాటిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. “ప్రతి గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు మందిని ఏర్పరచి యాజకుల కాళ్లు నిలిచిన స్థలం లో యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని బయటికి తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేసే చోట వాటిని నిలబెట్టమని వారి కాజ్ఞాపించు.” కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల్లో సిద్ధపరచిన పన్నెండు మందిని, అంటే ప్రతి గోత్రానికి ఒక్కొక్కరిని పిలిపించి, వారితో ఇలా అన్నాడు. “యొర్దాను మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట నుండి, ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున ప్రతివాడూ ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవాలి. ఇక మీదట మీ సంతానం ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు, ‘యెహోవా మందసం ముందు యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆగిపోయాయి. యొర్దానును దాటుతుండగా యొర్దాను నీళ్లు ఆగిపోయాయి కాబట్టి ఈ రాళ్లు చిరకాలం ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్ధంగా ఉంటాయి’ అని వారితో చెప్పాలి.”

యెహోషువ 4:1-7 పవిత్ర బైబిల్ (TERV)

ప్రజలంతా యొర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు: “ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటుచేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి. నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెళ్లాలి. ఈ రాత్రి మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను ఉంచండి.” కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు. యెహోషువ వాళ్లతో ఇలా చెప్పాడు: “మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్కరాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద మోయండి. ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తులో మీ పిల్లలు ‘ఈ రాళ్ల భావం ఏమిటి?’ అని మిమ్మల్ని అడుగుతారు. యొర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడుతాయి.”

యెహోషువ 4:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను –ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్ని ద్దరు మనుష్యులను ఏర్పరచి యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికాజ్ఞాపించుము కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన పన్నిద్దరు మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి వారితో ఇట్లనెను– యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము నెదుట దాటిపోయి, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక రాతిని తన భుజముమీద పెట్టుకొని తేవలెను. ఇకమీదట మీ కుమారులు–ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు– యెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దానునీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలమువరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగానుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును