యెహోషువ 4:1-24

యెహోషువ 4:1-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు, “ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున ప్రజల్లో నుండి పన్నెండుమందిని ఎన్నుకుని, యొర్దాను మధ్య నుండి, అంటే యాజకులు నిలబడి ఉన్న చోటుకు కుడివైపు నుండి పన్నెండు రాళ్లను తీసుకుని, వాటిని మీతో పాటు మోసుకువెళ్లి, ఈ రాత్రి మీరు బసచేసే స్థలంలో వాటిని ఉంచమని వారికి చెప్పు” అని ఆజ్ఞాపించారు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల నుండి తాను నియమించిన పన్నెండుమందిని ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున పిలిచి, వారితో, “మీ దేవుడైన యెహోవా మందసానికి ముందుగా యొర్దాను మధ్యలోనికి వెళ్లండి. ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున మీలో ప్రతి ఒక్కరూ తన భుజంపై ఒక రాయిని మోయాలి, అది మీ మధ్య ఒక సూచనగా ఉంటుంది. భవిష్యత్తులో, ‘ఈ రాళ్లకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, యెహోవా నిబంధన మందసం యొర్దాను దాటుతున్నప్పుడు యొర్దాను నీళ్లు ఆగిపోయాయి. కాబట్టి ఈ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు నిత్యం జ్ఞాపకార్థంగా ఉంటాయి అని వారికి చెప్పండి.” కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోషువ ఆజ్ఞాపించినట్లు చేశారు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం వారు యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసుకొని తమతో పాటు తమ శిబిరానికి తెచ్చి వారు ఉన్నచోట పెట్టారు. యెహోషువ ఆ పన్నెండు రాళ్లను యొర్దాను మధ్యలో, నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు నిలబడిన స్థలంలో నిలబెట్టించాడు. నేటి వరకు అవి అక్కడే ఉన్నాయి. మోషే యెహోషువకు నిర్దేశించినట్లుగా యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన ప్రతిదీ ప్రజలు చేసే వరకు మందసాన్ని మోసిన యాజకులు యొర్దాను మధ్యలో నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరత్వరగా దాటి వెళ్లారు, వారంతా దాటిన వెంటనే ప్రజలు చూస్తుండగానే యెహోవా మందసాన్ని మోస్తూ యాజకులు అవతలి వైపుకు దాటి వచ్చారు. ఇశ్రాయేలీయులకు ముందుగా రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు మోషే వారికి నిర్దేశించినట్టుగా యుద్ధానికి సిద్ధపడి దాటారు. యుద్ధానికి సిద్ధపడిన దాదాపు నలభై వేలమంది ఆయుధాలు ధరించి యెహోవా ఎదుట దాటి యుద్ధానికి యెరికో మైదానాలకు చేరుకున్నారు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేశారు; వారు మోషేను గౌరవించినట్టు యెహోషువ జీవించినంత కాలం అతన్ని గౌరవించారు. తర్వాత యెహోవా యెహోషువతో, “నిబంధన మందసాన్ని మోసే యాజకులను యొర్దానులో నుండి ఇవతలికి రమ్మని ఆజ్ఞాపించు” అని చెప్పారు. కాబట్టి యెహోషువ, “యొర్దానులో నుండి పైకి వచ్చేయండి” అని యాజకులను ఆజ్ఞాపించాడు. యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి పైకి వచ్చారు. వారి అరికాళ్ల ఆరిన నేలను తాకగానే యొర్దాను నీరు ఎప్పటిలాగే పొంగుతూ ప్రవహించాయి. మొదటి నెల పదవ రోజున ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు సరిహద్దులోని గిల్గాలులో బస చేశారు. వారు యొర్దాను నుండి తీసిన పన్నెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించాడు. అతడు ఇశ్రాయేలీయులతో, “భవిష్యత్తులో మీ సంతతివారు తమ తల్లిదండ్రులను, ‘ఈ రాళ్లకు అర్థం ఏంటి?’ అని అడిగినప్పుడు, మీరు వారితో, ‘ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దాను నదిని దాటారు’ అని చెప్పాలి. ఎందుకంటే మీరు యొర్దానును దాటే వరకు మీ దేవుడైన యెహోవా మీ ఎదుట యొర్దానును ఆరిపోయేలా చేశారు. మేము ఎర్ర సముద్రాన్ని దాటే వరకు మా ఎదుట దాన్ని ఆరేలా చేసినట్టు మీ దేవుడైన యెహోవా ఇప్పుడు యొర్దానును చేశారు. యెహోవా హస్తం శక్తివంతమైనదని భూమిపై ఉన్న ప్రజలందరూ తెలుసుకునేలా, మీరు మీ దేవుడైన యెహోవాకు ఎల్లప్పుడూ భయపడేలా ఆయన ఇలా చేశారు.”

యెహోషువ 4:1-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ప్రజలందరూ యొర్దానును నది దాటిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. “ప్రతి గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు మందిని ఏర్పరచి యాజకుల కాళ్లు నిలిచిన స్థలం లో యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని బయటికి తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేసే చోట వాటిని నిలబెట్టమని వారి కాజ్ఞాపించు.” కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల్లో సిద్ధపరచిన పన్నెండు మందిని, అంటే ప్రతి గోత్రానికి ఒక్కొక్కరిని పిలిపించి, వారితో ఇలా అన్నాడు. “యొర్దాను మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట నుండి, ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున ప్రతివాడూ ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవాలి. ఇక మీదట మీ సంతానం ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు, ‘యెహోవా మందసం ముందు యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆగిపోయాయి. యొర్దానును దాటుతుండగా యొర్దాను నీళ్లు ఆగిపోయాయి కాబట్టి ఈ రాళ్లు చిరకాలం ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్ధంగా ఉంటాయి’ అని వారితో చెప్పాలి.” యెహోషువ ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు. యెహోవా యెహోషువతో చెప్పినట్టు వారు ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టారు. అప్పుడు యెహోషువ నిబంధన మందసాన్ని మోసే యాజకుల కాళ్లు యొర్దాను మధ్య నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిలబెట్టించాడు. నేటి వరకూ అవి అక్కడ ఉన్నాయి. ప్రజలతో చెప్పాలని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతా, అంటే మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతా నెరవేరే వరకూ యాజకులు మందసాన్ని మోస్తూ యొర్దాను మధ్య నిలబడగా ప్రజలు త్వరపడి దాటారు. ప్రజలందరూ దాటిన తరువాత వారు చూస్తుండగా యెహోవా మందసం మోసే యాజకులు దాటారు. ఇశ్రాయేలీయులు చూస్తుండగా రూబేనీయులూ గాదీయులూ మనష్షే అర్థగోత్రపు వారూ మోషే వారితో చెప్పినట్టు యుద్ధసన్నద్ధులై దాటారు. సేనలో ఇంచుమించు నలభై వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధం చేయడానికి యెహోవా సమక్షంలో దాటి యెరికో మైదానాలకు వచ్చారు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేసినందువల్ల వారు మోషేను గౌరవించినట్టు యెహోషువా జీవించినంత కాలం అతన్ని గౌరవించారు. యెహోవా “సాక్ష్యపు మందసాన్ని మోసే యాజకులను యొర్దానులో నుండి ఇవతలికి రమ్మని ఆజ్ఞాపించు” అని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ “యొర్దానులో నుండి ఎక్కి రండి” అని యాజకులకు ఆజ్ఞాపించాడు. యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్లు పొడి నేల మీద నిలబడగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటిలాగే తమ చోటికి మళ్ళి దాని గట్లన్నిటి మీదా పొర్లి ప్రవహించాయి. మొదటి నెల పదో తేదీన ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు ప్రాంతంలోని గిల్గాలులో దిగగానే యొర్దానులో నుండి వారు తెచ్చిన పన్నెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు “రాబోయే కాలంలో మీ సంతానం ‘ఈ రాళ్ళు ఎందుకు’ అని వారి తండ్రులను అడిగితే, అప్పుడు మీరు, ‘ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దాను నదిని దాటారు’ అని చెప్పాలి. యెహోవా బాహువు బలమైనదని భూప్రజలందరూ తెలుసుకోడానికీ మీరు ఎప్పుడూ మీ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడానికీ, మేము దాటేవరకూ మీ దేవుడు యెహోవా తానే మన ముందు ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే ఎండి పోయేలా చేశాడో అలాగే మీరు దాటే వరకూ యొర్దాను నీళ్ళను కూడా ఎండి పోయేలా చేశాడని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచాలి.”

యెహోషువ 4:1-24 పవిత్ర బైబిల్ (TERV)

ప్రజలంతా యొర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు: “ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటుచేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి. నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెళ్లాలి. ఈ రాత్రి మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను ఉంచండి.” కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు. యెహోషువ వాళ్లతో ఇలా చెప్పాడు: “మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్కరాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద మోయండి. ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తులో మీ పిల్లలు ‘ఈ రాళ్ల భావం ఏమిటి?’ అని మిమ్మల్ని అడుగుతారు. యొర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడుతాయి.” కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధేయులయ్యారు. యొర్దాను నది మధ్యలోనుండి పన్నెండు రాళ్లు వాళ్లు మోసుకొని వెళ్లారు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కోరాయిఉంది. యెహోషువకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఇలా చేసారు. ఆ మనుష్యులు ఆ రాళ్లు మోసుకొనిపోయి వారు నివాసము చేసిన చోట వాటిని ఉంచారు. (యెహోవా యొక్క పవిత్ర పెట్టెను మోస్తున్నప్పుడు యొర్దాను నది మధ్యలో యాజకులు నిలిచిన చోటకూడ యెహోషువ పన్నెండు రాళ్లు ఉంచాడు. నేటికీ ఆ రాళ్లు అక్కడ ఉన్నాయి.) ప్రజలు చేయాల్సింది ఏమిటో చెప్పమని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ చేయాలని మోషే చెప్పిన సంగతులే అవి. కనుక ఆ విషయాలన్నీ జరిగించేంతవరకు పవిత్ర పెట్టెను మోస్తున్న యాజకులు నది మధ్యలోనే నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరపడి నది దాటారు. ప్రజలు నదిని దాటిపోవడం అయిపోగానే యాజకులు యెహోవా పెట్టెను ప్రజల ఎదుటికి మోసుకొని వెళ్లారు. రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలోని సగంమంది మగవాళ్లు మోషే వారికి చెప్పిన వాటికి విధేయులయ్యారు. మిగతా మనుష్యుల ముందు వీరు నదిని దాటారు. వీళ్లు యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు, మిగిలిన ప్రజలకు సహాయం చేయటానికి వీరు వెళ్తున్నారు. యుద్ధానికి సిద్ధపడిన వారు సుమారు నలభై వేలమంది సైనికులు యెహోవా ఎదుట సాగిపోయారు. యెరికో మైదానాల దిశగా వారు సాగిపోయారు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ యెహోషువను ఒక మహామనిషిగా యెహోవా చేసాడు. అప్పట్నుంచి ప్రజలు యెహోషువను గౌరవించారు. మోషేను వారు గౌరవించినట్టే యెహోషువను కూడ వారు జీవితకాలమంతా గౌరవించారు. ఆ పెట్టెను మోస్తున్న యాజకులు ఇంకా నదిలో నిలబడి ఉండగానే, “యాజకులను నదిలోనుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించు” అంటూ యెహోవా, యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ యాజకులకు, “యొర్దాను నదిలోనుండి బయటకు రండి” అని ఆజ్ఞాపించాడు. యాజకులు యెహోషువకు విధేయులయ్యారు. వారు ఆ పెట్టెను మోసుకొని, నదిలో నుండి బయటకు వచ్చారు. యాజకుల పాదాలు, నది ఆవలి ఒడ్డున నేలను తాకగానే, నదిలో నీరు మరల ప్రవహించటం మొదలయింది. ప్రజలు నదిని దాటి వెళ్లక ముందులాగే నీరు గట్ల మీద పొర్లి పారుతున్నాయి. మొదటి నెల పదో రోజున ప్రజలు యొర్దాను నది దాటారు. యెరికోకు తూర్పున గిల్గాలులో ప్రజలు గుడారాలు వేసారు యొర్దాను నదిలోనుంచి తీసుకొన్న పన్నెండు రాళ్లను ప్రజలు వారితో మోసుకొని వెళ్లారు. ఆ రాళ్లను గిల్గాలులో యెహోషువ నిలువ బెట్టాడు. అప్పుడు యెహోషువ ప్రజలతో చెప్పాడు: “‘ఈ రాళ్లు ఏమిటి?’ అని భవిష్యత్తులో మీ పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతారు ‘ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని ఆరిన నేలమీద దాటి వెళ్లారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్లు తోడ్పడుతాయి’ అని పిల్లలతో మీరు చెప్పాలి. మీ యెహోవా దేవుడు ఆ నదిలో నీటి ప్రవాహాన్ని నిలిపివేసాడు. ప్రజలు దానిని దాటిపోయేంతవరకు నది ఎండిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర ప్రజలకు యెహోవా ఏమి చేసాడో, యొర్దాను నది దగ్గరకూడ ఆయన అలానే చేసాడు. ప్రజలు దాటి వెళ్లగలిగేందుకు ఎర్ర సముద్రంలో నీళ్లను యెహోవా నిలిపివేశాడని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవాకు మహాశక్తి ఉందని ఈ దేశ ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన దీనిని చేసాడు. అప్పుడు ఆ ప్రజలు మీ యెహోవా దేవునికి ఎల్లప్పుడూ భయపడి ఉంటారు.”

యెహోషువ 4:1-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను –ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్ని ద్దరు మనుష్యులను ఏర్పరచి యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికాజ్ఞాపించుము కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన పన్నిద్దరు మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి వారితో ఇట్లనెను– యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము నెదుట దాటిపోయి, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక రాతిని తన భుజముమీద పెట్టుకొని తేవలెను. ఇకమీదట మీ కుమారులు–ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు– యెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దానునీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలమువరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగానుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును, అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లువారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధనమందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి. ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, నెరవేరువరకు యాజకులు మందసమును మోయుచు యొర్దానునడుమ నిలుచుండగా జనులు త్వర పడి దాటిరి. జనులందరు దాటిన తరువాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి యెదుట యెహోషువను గొప్పచేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రదుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. యెహోవా–సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యొర్దానులోనుండి యివతలికి రండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవియ్యగా యెహోషువ యొర్దానులోనుండి యెక్కి రండని ఆయాజకుల కాజ్ఞా పించెను. యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులు యొర్దాను నడుమనుండి యెక్కి వచ్చినప్పుడు ఆయాజకుల అరకాళ్లు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటిచోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యొర్దానులోనుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను–రాబోవు కాలమున మీ సంతతివారు – ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా; అప్పుడు మీరు–ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరు తెలిసికొనుటకును, మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్లను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.