యెహోషువ 3:7-13
యెహోషువ 3:7-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా యెహోషువతో, “నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉన్నానని ఇశ్రాయేలీయులందరు తెలుసుకునేలా ఈ రోజు వారి కళ్ళెదుట నిన్ను గొప్పవానిగా చేయడం ప్రారంభిస్తాను. నిబంధన మందసాన్ని మోసే యాజకులతో: ‘మీరు యొర్దాను నది నీటి అంచులకు చేరినప్పుడు, వెళ్లి నదిలో నిలబడాలి’ అని నిబంధన మందసాన్ని మోసే యాజకులతో చెప్పు.” యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, “ఇక్కడకు వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి. ఈ విధంగా సజీవుడైన దేవుడు మీ మధ్య ఉన్నారని, ఆయన కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ముందు నుండి వెళ్లగొడతారని మీరు తెలుసుకుంటారు. చూడండి, సర్వలోక ప్రభువు యొక్క నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానులోకి వెళ్తుంది. ఇప్పుడు, ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రతి గోత్రం నుండి ఒక పురుషుని చొప్పున పన్నెండుమందిని ఎన్నుకోండి. లోకమంతటికి ప్రభువైన యెహోవా మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యొర్దానులో అడుగు పెట్టగానే, దిగువకు ప్రవహిస్తున్న ప్రవాహం తెగిపోయి ఒకవైపు రాశిగా నిలబడతాయి.”
యెహోషువ 3:7-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. “నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకూ తోడై ఉంటానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనేలా ఈ రోజు వారి కళ్ళ ముందు నిన్ను గొప్ప వాడిగా చేస్తాను. మీరు యొర్దాను నది దగ్గరికి వచ్చి యొర్దాను నీళ్ళలో నిలబడండని నిబంధన మందసాన్ని మోసే యాజకులకు ఆజ్ఞాపించు.” కాబట్టి యెహోషువ “మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి” అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి, వారితో ఇలా చెప్పాడు. “సర్వలోక నాధుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానుని దాటబోతుంది కాబట్టి జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనీ, ఆయన కచ్చితంగా మీ దగ్గరనుండి కనానీయులనూ హిత్తీయులనూ హివ్వీయులనూ పెరిజ్జీయులనూ గిర్గాషీయులనూ అమోరీయులనూ యెబూసీయులనూ వెళ్ళగొడతాడని దీని వల్ల మీరు తెలుసుకుంటారు. కాబట్టి గోత్రానికి ఒక మనిషి చొప్పున ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి పన్నెండుమంది మనుషులను ఏర్పరచుకోండి. సర్వలోకనాధుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను తాకగానే యొర్దాను నీళ్లు, అంటే పై నుండి పారే నీళ్లు ఆగి ఏకరాశిగా నిలిచిపోతాయి.”
యెహోషువ 3:7-13 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసుకొంటారు. యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, ‘యొర్దాను నదీ తీరానికి నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు ఆగండి.’” అంతట ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు: “రండి, మీ యెహోవా దేవుని మాటలు వినండి. జీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు అనేందుకు ఇదే ఋజువు. నిజంగా ఆయన మీ శత్రువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే ఋజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ ప్రజలు అందరినీ ఆయన ఈ దేశంనుండి వెళ్ల గొట్టేస్తాడు. ఇదే ఋజువు. మీరు యొర్దాను దాటేటప్పుడు, సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది. ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో ఒక్కోదాని నుండి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసుకొనండి. సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టెను మీకు ముందు యొర్దాను నదిలోనికి మోసుకొని వెళ్తారు. వారు నీళ్లలో ప్రవేశించగానే యొర్దాను నదీ ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి, ఆ స్థలానికి వెనుక ఆనకట్ట వేసినట్టు నిలిచిపోతాయి.”
యెహోషువ 3:7-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను– నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను. మీరు యొర్దాను నీళ్లదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధనమందసమును మోయు యాజకులకు ఆజ్ఞా పించుము. కాబట్టి యెహోషువ–మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెను–సర్వలోక నాధుని నిబంధనమందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గిర్గాషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసికొందురు. కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి. సర్వలోక నాధుడగు యెహోవా నిబంధనమందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.