యెహోషువ 23:4-16
యెహోషువ 23:4-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను జయించిన దేశాలతో పాటు పశ్చిమాన యొర్దాను మధ్యధరా సముద్రం మధ్య మిగిలి ఉన్న దేశాల భూమిని మీ గోత్రాలకు వారసత్వంగా ఎలా కేటాయించానో గుర్తుచేసుకోండి. మీ కోసం మీ దేవుడైన యెహోవా వారిని బయటకు వెళ్లగొడతారు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్టు ఆయన మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టినప్పుడు మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకుంటారు. “దృఢంగా ఉండండి; మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా జాగ్రత్తగా పాటించండి. మీ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దు; వారి దేవతల పేర్లు ఎత్తవద్దు; వాటిపై ప్రమాణం చేయవద్దు. మీరు వాటిని సేవించవద్దు లేదా వాటికి నమస్కరించవద్దు. అయితే మీరు ఇప్పటివరకు ఉన్నట్లే మీ దేవుడైన యెహోవాను గట్టిగా పట్టుకుని ఉండాలి. “యెహోవా మీ ఎదుట నుండి శక్తివంతమైన దేశాలను వెళ్లగొట్టారు; ఈ రోజు వరకు ఎవరూ మీ ముందు నిలబడలేకపోతున్నారు. మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లుగా మీ కోసం పోరాడుతున్నారు కాబట్టి మీలో ఒకడు వెయ్యిమందిని ఓడించాడు. కాబట్టి మీ దేవుడైన యెహోవాను ప్రేమించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి. “అయితే మీరు వెనక్కి తిరిగి, మీ మధ్య మిగిలి ఉన్న ఈ దేశాల్లో జీవించి ఉన్నవారితో పొత్తు పెట్టుకుని, మీరు వారిని పెళ్ళి చేసుకుని, వారితో సహవాసం చేస్తే, మీ దేవుడైన యెహోవా ఇకపై ఈ దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టడని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికి బదులుగా, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగా, ఉచ్చులుగా, మీ వీపుపై కొరడాలుగా, మీ కళ్లల్లో ముళ్ళుగా మారుతారు. “ఇప్పుడు మనుష్యులందరు వెళ్లే మార్గంలోనే నేను వెళ్లబోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి వాగ్దానాలలో ఒక్కటి కూడా విఫలం కాలేదని మీ హృదయాలకు మనస్సులకు తెలుసు. ప్రతి వాగ్దానం నెరవేరింది; ఒక్కటి కూడా విఫలం కాలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్ని మీకు నెరవేరినట్లే, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన చెప్పిన కీడునంతా మీ మీదికి రప్పిస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన నిబంధనను పాటించకుండా, ఇతర దేవుళ్ళను సేవించి వాటికి నమస్కరిస్తే, యెహోవా కోపం మీపై రగులుకుంటుంది. ఆయన మీకు ఇచ్చిన మంచి దేశంలో నుండి మీరు త్వరగా నశించిపోతారు.”
యెహోషువ 23:4-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చూడండి, యొర్దాను నుండి పడమరగా మహాసముద్రం వరకూ నేను నాశనం చేసిన అన్ని రాజ్యాలతో పాటు, మీ గోత్రాల స్వాస్థ్యం మధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాన్ని మీకు చీట్లు వేసి పంచిపెట్టాను. మీ దేవుడైన యెహోవాయే వారిని వెళ్ళగొడతాడు. ఆయనే వాళ్ళను పారదోలతాడు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీరు వారి దేశాన్ని స్వాధీన పరచుకుంటారు. కాబట్టి మీరు నిలకడగా ఉండి మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసినదాన్నంతా పాటిస్తూ దాని ప్రకారం ప్రవర్తించండి. మనస్సు దృఢం చేసుకుని, దానినుండి ఎడమకు గాని కుడికి గాని తొలగిపోవద్దు. మీ దగ్గర మిగిలి ఉన్న ఈ రాజ్యాలతో కలిసిపోవద్దు. వారి దేవుళ్ళ పేరులు ఎత్తవద్దు, వాటి తోడని ప్రమాణం చేయవద్దు, వాటిని పూజించవద్దు. వాటికి నమస్కరించవద్దు. దానికి బదులు, మీరు యిప్పటి వరకూ ఉన్నట్టు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండండి. బలీయమైన గొప్ప రాజ్యాలను యెహోవా మీ ముందు పారదోలాడు. ఇప్పటివరకూ మీముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటప్రకారం తానే మీ తరఫున యుద్ధం చేసేవాడు కాబట్టి మీలో ఒక్కడు వెయ్యిమందిని తరుముతాడు. కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ ఉండడానికి శ్రద్ధ వహించండి. అయితే మీరు వెనక్కి తగ్గి మీమధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాల ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో వియ్యమందుకుని, పరస్పర సంబంధాలు కలిగించుకుంటే మీ దేవుడైన యెహోవా మీ దగ్గరనుండి ఈ రాజ్యాలను వెళ్ళగొట్టడం మానుకుంటాడని మీరు తెలుసుకోవాలి. దానికి బదులు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకూ వారు మీకు ఉరిగా బోనుగా మీపక్కలో కొరడాలాగా మీ కళ్ళలో ముళ్లులాగా ఉంటారు. ఇప్పుడు మనుషులందరిలాగే నేనూ పోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటికూడా తప్పిపోలేదని మీ అందరి హృదయాలకూ మనసులకూ తెలుసు. అవన్నీ మీకు జరిగాయి. వాటిలో ఒక్కటికూడా తప్పిపోలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి, ఇతర దేవుళ్ళను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండాా మీరు త్వరగా నాశనమవుతారు.”
యెహోషువ 23:4-16 పవిత్ర బైబిల్ (TERV)
పశ్చిమాన మహా సముద్రానికి, యొర్దానుకు మధ్యగల దేశమంతా మీ ప్రజలు తీసుకోవచ్చని నేను మీతో చెప్పినది జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీకు ఇస్తానని చెప్పిన దేశం అది. కానీ మీరు ఇంకా దానిని స్వాధీనం చేసుకోలేదు. అక్కడ నివసిస్తున్న ప్రజలను మీ యెహోవా దేవుడు బలవంతంగా వెళ్లగొట్టేస్తాడు. మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు, అక్కడ నివసిస్తున్న ప్రజలను యెహోవా వెళ్లగొట్టేస్తాడు. మీ దేవుడైన యెహోవా చేసిన వాగ్దానం ఇది. “యెహోవా మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటికీ విధేయులుగా ఉండేందుకు మీరు జాగ్రత్తపడాలి. మోషే ధర్మశాస్రంలో వ్రాయబడిన వాటన్నింటికీ విధేయులుగా ఉండండి. ఆ ధర్మశాస్త్రానికి విముఖులు కావద్దు. ఇశ్రాయేలు ప్రజలు కానివాళ్లు ఇంకా కొంతమంది మన మధ్య నివసిస్తున్నారు. ఆ ప్రజలు వారి స్వంత దేవుళ్లను ఆరాధిస్తున్నారు. ఆ ప్రజలతో స్నేహం చేయవద్దు. వారి దేవుళ్లను సేవించవద్దు, ఆరాధించవద్దు. మీ దేవుడైన యెహోవాను వెంబడించటం మీరు కొనసాగించాలి. గతంలో మీరు ఇలా చేసారు. ఇలాగే మీరు చేస్తూ ఉండాలి. “మహా బలంగల అనేక రాజ్యాలను ఓడించేందుకు యెహోవా మీకు సహాయం చేసాడు. ఆ ప్రజలను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. ఏ రాజ్యం కూడా మిమ్మల్ని ఓడించలేకపోయింది. యెహోవా సహాయంతో ఇశ్రాయేలీయులలో ఒక్కడు వేయిమంది శత్రువులను ఓడించగలిగాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడటంవల్లనే ఇది జరిగింది. ఇలా చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. అందుచేత మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూనే ఉండాలి. మీరు సంపూర్ణులుగా అయనను ప్రేమించాలి. “యెహోవా మార్గంనుండి తొలగిపోవద్దు. ఇశ్రాయేలీయులకు చెందని ఏ ఇతరులతో స్నేహం చేయవద్దు. వారి మనుష్యులను ఎవరినీ పెళ్లాడకండి. అయితే మీరే గనుక ఈ మనుష్యులతో స్నేహం చేస్తే మీ శత్రువులను జయించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు సహాయం చేయడు. కనుక ఈ ప్రజలు మీకు ఒక ఉచ్చుగా ఉంటారు. వారు మీ కళ్లలో పొగలా, ధూళిలా మీకు బాధ కలిగిస్తారు. మరియు ఈ మంచిదేశం నుండి మీరు వెళ్లగొట్టబడుతారు. ఇది మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశం, కానీ మీరు ఈ ఆజ్ఞకు విధేయులు కాకపోతే, దీనిని పోగొట్టుకొంటారు. “ఇది దాదాపు నేను చనిపోవాల్సిన సమయం యెహోవా మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసాడని మీకు తెలుసు, మీరు వాస్తవంగా నమ్ముతున్నారు. ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ ఆయన తప్పలేదని మీకు తెలుసు. మనకు ఇచ్చిన ప్రతి వాగ్దానమూ యెహోవా నెరవేర్చాడు. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ప్రతి మంచి వాగ్దానం నిజంగా నెరవేరింది. అయితే అదే విధంగా యెహోవా తన ఇతర వాగ్దానాలను కూడ నెరవేరుస్తాడు. మీరు తప్పు చేస్తే మీకు కీడు కలుగుతుందని ఆయన వాగ్దానం చేసాడు. ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి బలవంతంగా మిమ్మల్ని వెళ్లగొట్టేస్తానని ఆయన వాగ్దానం చేసాడు. మీ దేవుడైన యెహోవాతో మీరు చేసిన ఒడంబడికను నిలబెట్టుకొనేందుకు మీరు నిరాకరిస్తే ఇలా జరుగుతుంది. మీరు వెళ్లి ఇతర దేవుళ్లను పూజిస్తే మీరు ఈ దేశాన్ని పోగొట్టుకొంటారు. ఆ ఇతర దేవుళ్లను మీరు పూజించకూడదు. మీరు గనుక అలా చేస్తే మీ మీద యెహోవాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి మీరు వెంటనే వెళ్లగొట్టబడతారు.”
యెహోషువ 23:4-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
చూడుడి, యొర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రమువరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ యెదుట నిలువకుండ వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీన పరచుకొందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, యెడమకుగాని కుడికిగాని దానినుండి తొలగిపోక మీయొద్ద మిగిలియున్న యీ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను. యెహోవా బలముగల గొప్ప జనములను మీ యెదుటనుండి కొట్టివేసియున్నాడు, మీ యెదుట నేటివరకును ఏ మనుష్యుడును నిలిచియుండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటచొప్పున తానే మీకొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వేయిమందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీయొద్ద మిగిలియున్న యీ జనములను హత్తుకొని వారితో వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసినయెడల మీ దేవుడైన యెహోవా మీ యెదుటనుండి యీ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ మీరు నశించువరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కలమీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్లుగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్లుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచిమాటలన్ని టిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ ఆయన మిమ్ము నశింపజేయువరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరించినయెడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన యీ మంచి దేశములో నుండకుండ మీరు శీఘ్రముగా నశించి పోవుదురు.