యెహోషువ 22:1-9
యెహోషువ 22:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రం వారిని పిలిపించి, వారితో, “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు, నేనిచ్చిన ప్రతి ఆజ్ఞకు లోబడ్డారు. చాలా కాలం క్రితం నుండి నేటి వరకు మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లు వారికి విశ్రాంతిని ఇచ్చారు కాబట్టి, యొర్దాను అవతలి వైపున యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన దేశంలోని మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి. అయితే మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనను గట్టిగా అంటిపెట్టుకుని ఆయనను సేవించమని యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని పాటించేలా జాగ్రత్త వహించాలి” అని చెప్పాడు. అప్పుడు యెహోషువ వారిని ఆశీర్వదించి పంపివేశాడు. వారు తమ ఇళ్ళకు వెళ్లిపోయారు. (మోషే మనష్షే అర్థగోత్రానికి బాషానులో భూమిని ఇచ్చాడు, యెహోషువ మిగిలిన అర్థగోత్రానికి వారి తోటి ఇశ్రాయేలీయులతో పాటు యొర్దానుకు పశ్చిమాన భూమిని ఇచ్చాడు.) యెహోషువ వారిని ఇంటికి పంపినప్పుడు, అతడు వారిని ఆశీర్వదిస్తూ, వారితో, “మీ గొప్ప సంపదతో, పెద్ద పశువుల మందలతో, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, విస్తారమైన దుస్తులతో మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి. మీ శత్రువుల నుండి దోచుకున్న సొమ్మును మీ తోటి ఇశ్రాయేలీయులతో పంచుకోండి” అని చెప్పాడు. కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలీయులను కనానులోని షిలోహులో విడిచిపెట్టి, మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తమ సొంత దేశమైన గిలాదుకు తిరిగి వచ్చారు.
యెహోషువ 22:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇలా అన్నాడు, “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు. నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విన్నారు. ఇన్నిరోజులనుండి ఇప్పటి వరకూ మీరు మీ సోదరులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సోదరులకు వాగ్దానం చేసిన ప్రకారం వారికి నెమ్మది కలగజేశాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడు మోషే, యొర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతంలోని మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి. అయితే మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గాలన్నిటిలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనను హత్తుకుని సేవిస్తూ, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి.” అతడిలా చెప్పి వారిని దీవించి పంపివేశాడు. తరువాత వారు తమ నివాసాలకు వెళ్ళిపోయారు. మోషే బాషానులో మనష్షే అర్థగోత్రానికీ యెహోషువ పడమరగా యొర్దాను ఇవతల వారి సోదరుల్లో మిగిలిన అర్థగోత్రానికీ స్వాస్థ్యం ఇచ్చారు. యెహోషువ వారి నివాసాలకు వారిని పంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు, “మీరు చాలా ధనంతో అతి విస్తారమైన పశువులూ వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, అతి విస్తారమైన వస్త్రాలతో మీ నివాసాలకు తిరిగి వెళ్తున్నారు. మీ శత్రువుల దగ్గర దోచుకున్న సొమ్మును మీరు, మీ సోదరులు కలిసి పంచుకోండి.” కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారు యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తాము స్వాధీనపరచుకున్న స్వాస్థ్యభూమి అయిన గిలాదుకు వెళ్లడానికి కనాను ప్రాంతంలోని షిలోహులోని ఇశ్రాయేలీయుల దగ్గర నుండి బయలుదేరారు. కనాను ప్రాంతంలో ఉన్న యొర్దాను ప్రదేశానికి వచ్చినప్పుడు
యెహోషువ 22:1-9 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగం మంది, అందరినీ ఒక సమావేశానికి పిలిచాడు యెహోషువ. యెహోషువ వారితో ఇలా అన్నాడు: “మీరు చేయాలని మోషే చెప్పిన వాటన్నింటికీ మీరు విధేయులయ్యారు. మోషే యెహోవా సేవకుడు. మరియు, మీరు నా ఆజ్ఞలన్నింటికి కూడా విధేయులయ్యారు. ఇంకను ఇన్నాళ్లూ ఇశ్రాయేలు ఇతర ప్రజలందరినీ మీరు బలపర్చారు. మీ యెహోవా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటికీ మీరు జాగ్రత్తగా విధేయులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలకు శాంతి ఇస్తానని మీ యెహోవా దేవుడు వాగ్దానం చేసాడు. కనుక ఇప్పుడు యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకొన్నాడు. ఇప్పటికి మీరు తిరిగి మీ ఇండ్లకు వెళ్లవచ్చును. మీకు ఇవ్వబడ్డ దేశానికి మీరు తిరిగి వెళ్లవచ్చును. ఇది యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశం. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం ఇది. అయితే మోషే మీకు ఇచ్చిన చట్టానికి లోబడుతూనే ఉండాలని జ్ఞాపకం ఉంచుకోండి. మీ యెహోవా దేవుడ్ని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడటమే ఆ చట్టం. మీరు ఆయనను వెంబడిస్తూనే ఉండాలి, మీకు చేతనైనంత బాగుగా అయనను సేవిస్తూనే ఉండాలి.” తర్వాత యెహోషువ వారికి వీడ్కోలు చెప్పగా, వారు వెళ్లిపోయారు. వారు వారి ఇండ్లకు వెళ్లిపోయారు. బాషాను దేశాన్ని మనష్షే అర్ధ వంశం వారికి మోషే ఇచ్చాడు. మిగిలిన అర్ధ వంశంవారికి యొర్దాను నది పడమటి వైపు దేశాన్ని యెహోషువ ఇచ్చాడు. అక్కడికి వారి ఇండ్లకు యోహోషువ వారిని పంపివేసాడు. యెహోషువ వారిని ఆశీర్వదించాడు. “మీ ఇండ్లకు మీ ఐశ్వర్యాలకు తిరిగి వెళ్లండి. మీకు చాల పశువులు, చాల విలువైన నగలు, వెండి, బంగారం ఉన్నాయి. మీకు చాల అందమైన బట్టలు ఉన్నాయి. మరియు మీ శత్రువుల దగ్గర చాల వస్తువులు మీరు తీసుకొన్నారు. వీటన్నింటినీ మీలో మీరు పంచుకోవాలి.” అని అతడు చెప్పాడు. కనుక రూబేను, గాదు, మనష్షే వంశాలవారు మిగిలిన ఇశ్రాయేలు ప్రజలను విడిచి వెళ్లారు. వారు కనానులోని షిలోహులో ఉన్నారు. ఆ స్థలం విడిచి వారు తిరిగి గిలాదు వెళ్లారు. ఇది వారి స్వంత దేశం. ఈ దేశాన్ని మోషే వారికి ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించినందువల్ల అతడు దానిని వారికి ఇచ్చాడు.
యెహోషువ 22:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపువారిని పిలిపించి వారితో ఇట్లనెను –యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు. బహుదినములనుండి నేటివరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచియున్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి యున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్లుడి. అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయనమార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటిదిక్కున యొర్దాను ఇవతల వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యము లిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను –మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతివిస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు వెళ్లుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులును కలిసి పంచు కొనుడి. కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాటచొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్యభూమి యైన గిలాదులోనికి వెళ్లుటకు కనాను దేశమందలి షిలో హులోనున్న ఇశ్రాయేలీయుల యొద్దనుండి బయలుదేరిరి. కనానుదేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చి నప్పుడు