యెహోషువ 2:8-10 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 2:8-10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను. –యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరు గుదును. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.
యెహోషువ 2:8-10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ గూఢచారులు పడుకొనే ముందు, ఆమె వాళ్ళున్న మిద్దె ఎక్కి వాళ్ళతో ఇలా అంది, “యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడనీ, మీవల్ల మాకు భయం కల్గుతుందనీ నాకు తెలుసు. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ హడలి పోతారు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రజలం ఎలా ఆరిపోయేలా చేశాడో, యొర్దాను తీరాన ఉన్న సీహోను, ఓగు అనే ఇద్దరు అమోరీయ రాజులకు మీరేమి చేశారో, అంటే మీరు వాళ్ళని ఎలా నిర్మూలం చేశారో ఆ సంగతులన్నీ మేము విన్నాం.
యెహోషువ 2:8-10 TERV (పవిత్ర బైబిల్)
ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పైకి వెళ్లి వాళ్లతో మాట్లాడింది. రాహాబు ఇలా అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే. యెహోవా మీకు సహాయం చేసిన విధానాల్ని గూర్చి విన్నాము గనుక మాకు భయం. మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేసాడని మేము విన్నాము. అమోరీ రాజులైన సీహోను, ఓగులకు మీరు చేసినదాన్ని గూర్చి కూడ మేము విన్నాము. యొర్దాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు నాశనం చేసిన సంగతి మేము విన్నాము.
యెహోషువ 2:8-10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ వేగులవారు రాత్రి పడుకునే ముందు రాహాబు వారున్న మిద్దె మీదికి వెళ్లి, వారితో, “యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు చాలా భయం, ఈ దేశంలో నివసించే వారందరూ మీరంటే భయంతో క్రుంగిపోతున్నారు. మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము.