యెహోషువ 2:4-6
యెహోషువ 2:4-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే ఆమె ఆ ఇద్దరిని తీసుకెళ్లి దాచిపెట్టి, వారి కోసం వచ్చిన వారితో, “అవును, నా దగ్గరకు మనుష్యులు వచ్చారు, కానీ వారెక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. చీకటి పడుతుండగా పట్టణ ద్వారం మూసివేసే సమయంలో వారు వెళ్లిపోయారు. వారు ఏ మార్గాన వెళ్లారో నాకు తెలియదు. మీరు త్వరగా వెళ్తే వారిని పట్టుకోవచ్చు” అని చెప్పింది. (కాని నిజానికి ఆమె వారిని మిద్దె మీదికి తీసుకెళ్లి అక్కడ వరుసగా పేర్చి ఉన్న జనపకట్టెల్లో దాచిపెట్టింది.)
యెహోషువ 2:4-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి దాచిపెట్టి, ఆ వచ్చిన వారితో “మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే, వాళ్ళెక్కడ నుండి వచ్చారో నాకు తెలీదు, చీకటి పడేటప్పుడు కోట తలుపులు మూసే వేళ వాళ్ళు బయటికి వెళ్లిపోయారు, వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, మీరు వాళ్ళను తొందరగా తరిమితే పట్టుకుంటారు” అని చెప్పింది. అంతకుముందు ఆమె ఆ ఇద్దరినీ తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి ఉన్న జనపకట్టల్లో వాళ్ళని దాచి పెట్టింది.
యెహోషువ 2:4-6 పవిత్ర బైబిల్ (TERV)
ఆ స్త్రీ వాళ్లిద్దర్నీ దాచిపెట్టేసింది. అయితే ఆమె అంది: “ఆ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన మాట నిజమే. అయితే వాళ్లు ఎక్కడ్నుండి వచ్చిందీ నాకు తెలియదు. సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను పట్టుకోవచ్చేమో.” అయితే నిజానికి వాళ్లను అటక మీద జనుపకట్టెలో దాచిపెట్టింది.
యెహోషువ 2:4-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి –మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.