యెహోషువ 15:13-19
యెహోషువ 15:13-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబుకు యూదాలో ఒక భాగాన్ని అనగా కిర్యత్-అర్బాను, అంటే హెబ్రోనును ఇచ్చాడు. (అర్బా అనాకు యొక్క పూర్వికుడు.) కాలేబు హెబ్రోను నుండి అనాకు కుమారులైన షేషయి, అహీమాను, తల్మయి అనే ముగ్గురు అనాకీయులను వెళ్లగొట్టాడు. అక్కడినుండి గతంలో కిర్యత్-సెఫెరు అని పిలువబడిన దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేశాడు. కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు. కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు. ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు. అందుకామె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువన, దిగువన ఉన్న నీటి మడుగులను ఇచ్చాడు.
యెహోషువ 15:13-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను. షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు. అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు. కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు. ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు. “నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి” అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.
యెహోషువ 15:13-19 పవిత్ర బైబిల్ (TERV)
యెపున్నె కుమారుడైన కాలేబుకు యూదా దేశంలో భాగం ఇవ్వాల్సిందిగా యెహోషువను యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక దేవుడు ఆజ్ఞాపించిన భూమిని కాలేబుకు యెహోషువ ఇచ్చాడు. హెబ్రోను అనికూడ పిలువబడిన కిర్యత్ అర్బ పట్టణాన్ని యెహోషువ అతనికి ఇచ్చాడు (అనాకు తండ్రి అర్బ) హెబ్రోనులో నివాసం ఉన్న అనాకీ వంశాలు మూడింటిని కాలేబు వెళ్లగొట్టేసాడు. అవి శాషాయి, అహీమాను, తల్మయి వంశాలు. వారు అనాకు కుటుంబంవారు. తర్వాత దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద కాలేబు యుద్ధం చేసాడు. (గతంలో దెబీరును కిర్యత్ సెఫెర్ అనికూడ పిలిచేవాళ్లు) “కిర్యత్ సెఫెర్ మీద దాడి చేసి, ఆ పట్టణాన్ని ఓడించే మగవాడెవడో అతడు నా కుమార్తె అక్సాను పెళ్లాడవచ్చు. అతనికి నా కూతుర్ని బహుమానంగా ఇస్తాను” అన్నాడు కాలేబు. కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు ఒత్నియేలు ఆ పట్టణాన్ని ఓడించాడు. కనుక కాలేబు తన కుమార్తె అక్సాను ఒత్నియేలుకు భార్యగా ఇచ్చాడు. తన తండ్రి కాలేబు దగ్గర మరికొంత భూమి అడగాలని ఒత్నియేలు అక్సాను కోరాడు. (అక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది.) ఆమె తన గాడిద మీద నుండి దిగగానే “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు. “నాకు ఒక ఆశీర్వాదం కావాలి (నీరుగల భూమి నాకు కావాలి). నీవు నాకు నెగెవులో ఇచ్చిన భూమి ఎడారి భూమి. కనుక నీటి ఊటలు గల భూమి నాకు ఇవ్వాలి” అని అక్సా జవాబిచ్చింది. కనుక మెరకలోను పల్లంలోని నీటి ఊటలు గల భూమిని కాలేబు ఆమెకు ఇచ్చాడు.
యెహోషువ 15:13-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థులమధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్తయైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను. అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారులైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు. కాలేబు–కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను. మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి–నీకేమి కావలెనని ఆమె నడిగెను. అందుకామె–నాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.