యెహోషువ 13:1-32
యెహోషువ 13:1-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోషువ ముసలివాడయ్యాక, యెహోవా అతనితో, “నీవు ముసలివాడవయ్యావు, ఇంకా చాలా ప్రాంతాలు స్వాధీనం చేసుకోవలసి ఉంది. “ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలు: “ఫిలిష్తీయుల, గెషూరీయుల అన్ని ప్రాంతాలు, కనానీయులవని పిలువబడిన ఈజిప్టు తూర్పున ఉన్న షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను భూభాగం వరకు, అయిదుగురు ఫిలిష్తీయ పాలకులకు సంబంధించిన గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను; ఆవీయుల భూభాగం, దక్షిణాన; సీదోనీయుల ఆరా నుండి ఆఫెకు, అమోరీయుల సరిహద్దుల వరకు ఉన్న కనానీయుల దేశమంతా; గెబాలీయుల ప్రాంతం; హెర్మోను పర్వతం క్రింద బయల్-గాదు నుండి లెబో హమాతు వరకు తూర్పున ఉన్న లెబానోను ప్రాంతమంతా. “లెబానోను నుండి మిస్రెఫోత్-మయీము వరకు ఉన్న పర్వత ప్రాంతాల నివాసులందరిని అంటే, సీదోనీయులందరినీ ఇశ్రాయేలీయుల ముందు నుండి నేనే వారిని వెళ్లగొడతాను. నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా ఈ భూమిని ఇశ్రాయేలుకు వారసత్వంగా ఇవ్వాలి, దానిని తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థగోత్రానికి వారసత్వంగా పంచి ఇవ్వాలి” అని చెప్పారు. మనష్షే గోత్రంలో మిగిలిన సగభాగం, రూబేనీయులు, గాదీయులు యొర్దాను తూర్పున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన విధంగా యొర్దాను తూర్పున వారసత్వంగా పొందారు. ఇది అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి, కొండగట్టు మధ్యలో ఉన్న పట్టణం నుండి, మెదెబా మొత్తం పీఠభూమితో సహా దీబోను వరకు విస్తరించి ఉంది, హెష్బోనులో అమ్మోనీయుల సరిహద్దు వరకు పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను పట్టణాలన్ని ఉన్నాయి. అందులో గిలాదు, గెషూరు, మయకా ప్రజల భూభాగం, హెర్మోను పర్వతం మొత్తం, సలేకా వరకు ఉన్న బాషాను కూడా ఉన్నాయి, అంటే, అష్తారోతు ఎద్రెయీలో పాలించిన బాషానులోని ఓగు రాజ్యం మొత్తము. (అతడు రెఫాయీయులలో చివరివాడు.) మోషే వారిని ఓడించి వారి భూమిని స్వాధీనం చేసుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు గెషూరు, మయకా ప్రజలను బయటకు వెళ్లగొట్టలేదు, కాబట్టి వారు ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యనే నివసిస్తున్నారు. కానీ లేవీ గోత్రానికి అతడు ఎలాంటి వారసత్వాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన వారికి వాగ్దానం చేసినట్లు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు అర్పించబడిన హోమబలులే వారి వారసత్వము. రూబేను గోత్రం వారికి వారి వంశాల ప్రకారం మోషే వారికిచ్చింది: అర్నోను నది లోయ ప్రక్కన ఉన్న అరోయేరు లోయ మొదలుకొని ఆ లోయలో ఉన్న పట్టణం నుండి మెదెబా దగ్గరి పూర్తి మైదానం, ఇదీగాక హెష్బోను దాని మైదానంలోని పట్టణాలన్ని, దీబోను, బామోత్ బయలు బేత్-బయల్-మెయోను, యహజు, కెదేమోతు, మెఫాతు, కిర్యతాయిము, షిబ్మా లోయలో ఉన్న కొండ మీది శెరెత్ షహరు, బేత్-పెయోరు, పిస్గా కొండచరియలు, బేత్-యెషిమోతు, మైదానంలోని పట్టణాలన్ని, హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను రాజ్యం మొత్తం వారసత్వంగా ఇచ్చాడు. మోషే అతన్ని, ఆ దేశంలో నివసించిన సీహోనుతో జతకట్టిన మిద్యానీయుల ప్రధానులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే వారిని ఓడించాడు. ఇశ్రాయేలీయులు యుద్ధంలో చంపినవారితో పాటు, బెయోరు కుమారుడైన భవిష్యవాణి చెప్పే బిలామును కత్తితో చంపారు. రూబేనీయుల సరిహద్దు యొర్దాను నది తీరము. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు రూబేనీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి. గాదు గోత్రానికి దాని వంశాల ప్రకారం మోషే ఇచ్చింది ఇదే: యాజెరు ప్రాంతం, గిలాదు పట్టణాలన్ని, అమ్మోనీయుల దేశంలో సగం అంటే రబ్బాకు సమీపంలో ఉన్న అరోయేరు వరకు; హెష్బోను నుండి రామాత్ మిస్పే, బెతోనీము వరకు, మహనయీము నుండి దెబీరు ప్రాంతం వరకు; లోయలో, బేత్-హారాము, బేత్-నిమ్రా, సుక్కోతు, సాఫోను, హెష్బోను రాజైన సీహోను యొక్క ప్రాంతం (యొర్దాను తూర్పు వైపు, కిన్నెరెతు సముద్రం చివరి వరకు ఉన్న ప్రాంతం). ఈ పట్టణాలు, వాటి గ్రామాలు గాదీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి. మోషే మనష్షే యొక్క అర్థగోత్రానికి, అంటే మనష్షే వంశస్థుల సగం కుటుంబానికి, దాని వంశాల ప్రకారం ఇచ్చింది ఇదే: వారి సరిహద్దు మహనయీము నుండి బాషాను రాజైన ఓగు రాజ్యం మొత్తం, అంటే బాషానులోని యాయీరు స్థిరనివాసాలైన అరవై పట్టణాలు, గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయీ (బాషానులోని ఓగు యొక్క రాజ పట్టణాలు). ఇవి మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు వారి వంశాల ప్రకారం మాకీరు కుమారులలో సగం మందికి ఇవ్వబడ్డాయి. యెరికోకు తూర్పున యొర్దాను అవతల మోయాబు సమతల మైదానంలో ఉన్నప్పుడు మోషే ఇచ్చిన వారసత్వం ఇదే.
యెహోషువ 13:1-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోషువ వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు బాగా వృద్ధుడివయ్యావు. స్వాధీనం చేసుకోడానికి ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉంది. ఆ ప్రాంతాలేవంటే, ఫిలిష్తీయుల ప్రదేశాలన్నీ గెషూరీయుల దేశమంతా ఐగుప్తుకు తూర్పున ఉన్న షీహోరు నుండి కనానీయులవైన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకూ, ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారులకు సంబంధించిన గాజీయుల, అష్డోదీయుల, అష్కెలోనీయుల, గాతీయుల, ఎక్రోనీయుల దేశాలూ దక్షిణ దిక్కున ఆవీయుల దేశమూ కనానీయుల దేశమంతా సీదోనీయుల మేరా నుండి ఆఫెకు వరకూ ఉన్న అమోరీయుల సరిహద్దు వరకూ గిబ్లీయుల దేశమూ హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు నుండి హమాతుకు పోయే మార్గం వరకూ లెబానోను ప్రదేశమంతా లెబానోను నుండి మిశ్రేపొత్మాయిము వరకూ దేశం ఇంకా మిగిలి ఉంది. సీదోను ప్రజలతో సహా పర్వత ప్రాంతం ప్రజలందరినీ నేను ఇశ్రాయేలీయుల ముందు నుండి వెళ్లగొడతాను. కాబట్టి నేను ఆజ్ఞాపించిన విధంగా నీవు ఇశ్రాయేలీయులకు దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాలి. తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థ గోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు.” యెహోవా సేవకుడు మోషే వారికిచ్చిన విధంగా రూబేనీయులూ గాదీయులూ తూర్పుదిక్కున, అంటే యొర్దాను అవతల స్వాస్థ్యం పొందారు. అదేమంటే, అర్నోను ఏటిలోయ దగ్గర ఉన్న అరోయేరు మొదలు ఆ లోయమధ్య ఉన్న పట్టణం నుండి దీబోను వరకూ మేదెబా మైదానమంతా, అమ్మోనీయుల సరిహద్దు వరకూ హెష్బోనులో పాలిస్తున్న అమోరీయుల రాజైన సీహోనుకు చెందిన సమస్త పట్టణాలు, గిలాదూ గెషూరీయుల, మాయకాతీయుల దేశమూ హెర్మోను మన్యమంతా సల్కావరకూ బాషాను దేశమంతా రెఫాయీయుల్లో మిగిలి ఉన్నవారిలో అష్తారోతులో ఎద్రెయీలో పరిపాలిస్తున్న ఓగు రాజ్యమంతా మిగిలి ఉంది. మోషే ఆ రాజులను జయించి వారి దేశాన్ని పట్టుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశాన్ని గానీ మాయకాతీయుల దేశాన్ని గానీ పట్టుకోలేదు కాబట్టి గెషూరీయులు మాయకాతీయులు ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తున్నారు. లేవి గోత్రానికే అతడు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మోషేతో చెప్పినట్టు “ప్రజలు ఆయనకు అర్పించే దహన బలులే” వారికి స్వాస్థ్యం. వారి వంశాలను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చాడు. వారి సరిహద్దు ఏదంటే, అర్నోను నది లోయ పక్కన ఉన్న అరోయేరు మొదలు ఆ లోయలోని పట్టణం నుండి మేదెబా దగ్గర మైదానమంతా. ఇది గాక రూబేను గోత్రికులు హెష్బోను, దాని మైదానంలోని పట్టణాలన్నీ, దీబోను, బామోత్బయలు, బేత్బయల్మెయోను, యాహసు, కెదేమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిబ్మాలోయ లోని కొండ మీది శెరెత్షహరు ప్రాంతాలు దక్కించుకున్నారు. అంతేకాక, బేత్పయోరు, పిస్గా కొండచరియలు, బెత్యేషీమోతు, మైదానంలోని పట్టణాలు అన్నీ, ఇంకా ఎవీరేకెము, సూరు, హోరు, రేబ, అనే మిద్యాను రాజుల దేశాన్నీ అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతటినీ వారికి మోషే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇవి హెష్బోనులో పరిపాలించే సీహోను అధికారం కింద ఉన్న ప్రాంతాలు. ఇతన్నిమోషే ఓడించాడు. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు, సోదెగాడు అయిన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపారు. యొర్దాను ప్రదేశమంతా రూబేనీయులకు సరిహద్దు. అదీ, దానిలోని పట్టణాలూ, గ్రామాలూ రూబేనీయుల వంశాల ప్రకారం వారికి కలిగిన స్వాస్థ్యం. మోషే గాదు గోత్రానికి, అంటే గాదీయులకు వారి వంశాల ప్రకారం స్వాస్థ్యమిచ్చాడు. వారి సరిహద్దు యాజెరు, గిలాదు పట్టణాలన్నీ, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకూ అమ్మోనీయుల దేశంలో సగభాగం. హెష్బోను మొదలు రామత్మిజ్బెతు బెతోనిము వరకూ, మహనయీము మొదలు దెబీరు సరిహద్దు వరకూ. లోయలో బేతారాము బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను, అంటే హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషం, తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నెరెతు సముద్రతీరం వరకూ ఉన్న యొర్దాను ప్రదేశం. ఇవీ, వారి వంశాల ప్రకారం గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణాలు, గ్రామాలు. మోషే మనష్షే అర్థగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. అది వారి వంశాల ప్రకారం మనష్షీయుల అర్థగోత్రానికి స్వాస్థ్యం. వారి సరిహద్దు మహనయీము మొదలు బాషాను అంతా, బాషాను రాజైన ఓగు రాజ్యమంతా, బాషానులోని యాయీరు పురాలు అయిన అరవై పట్టణాలు, గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయి అనే బాషానులోని ఓగు రాజ్య పట్టణాలు. ఇవన్నీ మనష్షే కుమారుడు మాకీరు, అనగా మాకీరీయుల్లో సగం మందికి వారి వంశాల ప్రకారం కలిగాయి. ఇవీ, యెరికో దగ్గర తూర్పు దిక్కున యొర్దాను అవతల ఉన్న మోయాబు మైదానంలో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యాలు.
యెహోషువ 13:1-32 పవిత్ర బైబిల్ (TERV)
యెహోషువ చాల ముసలివాడైనప్పుడు యెహోవా అతనితో చెప్పాడు: “యెహోషువా, నీవు ముసలివాడవై పోయావు. కానీ నీవు స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఇంకా చాలా ఉంది. ఫిలిష్తీయుల దేశాన్ని, గెషూరు దేశాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఈజిప్టు దగ్గర షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అది కనానీ ప్రజలకు చెందినది. గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోనుల ఐదుగురు ఫిలిష్తీ నాయకులను ఇంకా నీవు జయించాలి. నీవు అవ్వీతీ ప్రజలను, కనాను దేశానికి దక్షిణాన ఉన్న వారిని కూడ నీవు ఓడించాలి. గెబాలీ ప్రజల ప్రాంతాన్ని నీవు ఇంకా ఓడించలేదు. హెర్మోను కొండ దిగువన బయెల్‌గాదుకు తూర్పున లిబోహ-మాత్ వరకు గల లెబానోను ప్రాంతం కూడ ఉంది. “లెబానోనునుండి మిశ్రేఫోత్మాయిము వరకు గల కొండ దేశంలో సీదోను ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల కోసం ఈ ప్రజలందరినీ నేను బయటకు వెళ్లగొట్టేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు నీవు భూమిని పంచి పెట్టేటప్పుడు ఈ భూమిని తప్పక జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు చెప్పినట్టు ఇలానే చేయి. ఇప్పుడు తొమ్మిది వంశాలు, మనష్షే సగం వంశం వారికి ఈ భూమిని విభజించు.” మనష్షే వంశంలో మిగిలిన సగం మందికి ఇదివరకే నేను భూమి ఇచ్చాను. రూబేను వంశం వారికి, గాదు వంశం వారికి నేను ఇదివరకే భూమిని ఇచ్చాను. యొర్దాను నది తూర్పున యెహోవా సేవకుడు మోషే వారికి భూమిని ఇచ్చాడు. యొర్దాను నది తూర్పున మోషే వారికి ఇచ్చిన భూమి ఇదే: దీబోను వరకు గల మేదెబా మైదాన ప్రాంతం అంతా ఇందులో ఉంది. అర్నోను లోయదగ్గర అరోయేరు వద్ద ఈ భూమి మొదలవుతుంది, ఆ లోయ మధ్యలోగల పట్టణం వరకు ఆ భూమి విస్తరించి ఉంది. అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన పట్టణాలన్నీ ఆ దేశంలో ఉన్నాయి. రాజు హెష్బోను పట్టణంలో ఉండి పాలించాడు. అమోరీ ప్రజలు నివసించిన ప్రాంతం వరకు ఈ దేశం విస్తరించింది. గిలాదు పట్టణం కూడ ఆ దేశంలో ఉంది. గెషూరు, మాయకా ప్రజలు నివసించిన ప్రాంతంకూడ ఆ దేశంలో ఉంది. హెర్మోను పర్వతం అంతా, సల్కావరకు బాషాను అంతా ఆ దేశంలో ఉంది. ఓగు రాజు రాజ్యమంతా ఆ దేశంలో ఉంది. ఓగు రాజు బాషానులో పాలించాడు. గతంలో అతడు అష్టారోతు, ఎద్రేయీలో పాలించాడు. ఓగు రెఫాయిము ప్రజలనుండి వచ్చినవాడు. గతంలో మోషే ఆ ప్రజలను ఓడించి, వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. గెషూరు, మయకా ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు బలవంతంగా బయటకు వెళ్లగొట్టలేదు. నేటికీ ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నారు. లేవీ వంశం ఒక్కటే భూమి ఏమీ లభించని కుటుంబం. దానికి బదులుగా, ఇశ్రాయేలీయుల యెహోవా దేవునికి దహన బలులుగా అర్పించబడిన జంతువులన్నీ లేవీ కుటుంబంవారు తీసుకుంటారు. అదే యెహోవా వారికి వాగ్దానం చేసింది. రూబేను వంశంలో ప్రతి వంశంవారికీ మోషే కొంత భూమి ఇచ్చాడు. వారికి దొరికిన భూమి ఇది: అర్నోను లోయదగ్గర అరోయేరునుండి మేదెబా పట్టణంవరకు గల భూమి. ఆ లోయ మధ్యలో ఉన్న పట్టణం, మైదానం మొత్తం ఇందులో ఉంది. హెష్బోను వరకు ఉంది ఈ భూమి. మైదానంలోని పట్టణాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఆ పట్టణాలు దీబోను, బామోత్బయలు, బేత్‌బయల్మెయోను, యహజ్, కెదెమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది యెరెత్ షహిరు, బెత్పెయోరు, పిస్గాకొండలు, బెత్ యెషిమోత్. కనుక మైదానంలోని అన్ని పట్టణాలు, అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. ఆ రాజు హెష్బోను పట్టణం దగ్గర పాలించాడు. అయితే అతణ్ణి, మిద్యాను ప్రజానాయకులను మోషే ఓడించాడు. ఆ నాయకులు ఎవి, రెకెము, సూర్, హోరు, రెబా. (ఈ నాయకులంతా సీహోనుతో చేయి కలిపి పోరాడారు) ఈ నాయకులంతా ఆ దేశంలోనే నివసించారు. బెయోరువాడైన బిలామును ఇశ్రాయేలు ప్రజలు చంపారు. (బిలాము భవిష్యత్తును గూర్చి చెప్పేందుకు మంత్రాలు వేసేవాడు) ఆ పోరాటంలో ఇశ్రాయేలు ప్రజలు చాలమందిని చంపేసారు. రూబేనుకు ఇచ్చిన భూమికి యొర్దాను నదీ తీరం సరిహద్దు. కనుక రూబేను వంశం వారికి ఇవ్వబడిన భూమిలో ఈ పట్టణాలు, పొలాలు అన్నీ చేర్చబడ్డాయి. గాదు వంశం వారికి మోషే ఇచ్చిన భూమి ఇది. ప్రతి ఒక్క వంశానికీ ఈ భూమిని మోషే ఇచ్చాడు. యాజెరు భూమి, గిలాదు పట్టణాలు అన్నీ రబ్బాతు దగ్గర అరోయేరు వరకూ గల అమ్మోనీ ప్రజల భూమిలో సగం మోషే వారికి ఇచ్చాడు. హెష్బోను నుండి రామత్ మిస్పా, బెటోనీము వరకూ గల భూమి ఇందులో ఉంది. మహనయిము నుండి దెబీరువరకు గల ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. బేతారాము, బెత్‌నిమ్రా, సుక్కోతు, సఫోనులోయ ఈ భూమిలో ఉన్నవే. హెష్బోను రాజు సీహోను పాలించిన మిగిలిన భూమి అంతా ఇందులో ఉంది. ఇది యొర్దాను నదికి తూర్పున ఉన్న భూమి. కిన్నెరతు సముద్రం చివరివరకు ఈ భూమి విస్తరించి ఉంది. ఈ భూమి అంతా గాదు వంశానికి మోషే ఇచ్చినది. ఈ జాబితాలో చేర్చబడిన పట్టణాలు అన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఒక్కోవంశానికి ఆ భూమిని మోషే ఇచ్చాడు. మనష్షే వంశంలో సగం మందికి మోషే ఇచ్చిన భూమి ఇదే. మనష్షే వంశంలోని సగం వంశాలు ఈ భూమిని తీసుకున్నాయి. ఆ భూమి మహనయిము దగ్గర మొదలవుతుంది. బాషాను అంతా, బాషాను రాజు ఓగు పాలించిన దేశం అంతా, బాషానులోని యాయీరు పట్టణాలన్నీ ఆ భూమిలో ఉన్నాయి. (అవి మొత్తం 60 పట్టణాలు) గిలాదులో సగం, అష్టారోతు, ఎద్రేయి కూడ ఆ భూమిలో ఉన్నాయి. (గిలాదు, అష్టారోతు, ఎద్రేయి ఓగు రాజు నివసించిన పట్టణాలు) ఈ భూమి అంతా మనష్షే కుమారుడు మాకీరు కుటుంబానికి ఇవ్వబడింది. ఆ కుమారులు అందరిలో సగం మందికి ఈ భూమి దొరికింది. మోయాబు మైదానాల్లో ఈ వంశాలకు ఈ భూమి అంతటినీ మోషే ఇచ్చాడు. ఇది యెరికోకు తూర్పున యొర్దాను నది అవతల ఉంది.
యెహోషువ 13:1-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడుకాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను–నీవు బహు దినములు గడచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతివిస్తారమైన దేశము ఇంక మిగిలియున్నది. మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీయుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయులయొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయులయొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును దక్షిణదిక్కున ఆవీయుల దేశమును కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దువరకును గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిమువరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివాసుల నందరిని సీదోనీయులనందరిని నేను ఇశ్రాయేలీయుల యెదుటనుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీ కాజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను. తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోనువరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దువరకు హెష్బోనులో ఏలికయు అమోరీయుల రాజునైన సీహోనుయొక్క సమస్తపురములును గిలాదును, గెషూరీయులయొక్కయు మాయాకాతీయులయొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కావరకు బాషాను దేశమంతయు రెఫాయీయుల శేషములో అష్తారోతులోను ఎద్రెయీలోను ఏలికయైన ఓగురాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులును మాయాకా తీయులును నేటివరకు ఇశ్రాయేలీయులమధ్యను నివసించుచున్నారు. లేవిగోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవావారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములనుబట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్య మిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను యాహసు కెదేమోతు మేఫాతు కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు బెత్యేషిమోతు అను పట్టణములును మైదానములోని పట్టణములన్నియు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించినవాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యానురాజుల దేశమును అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కినవారితో పాటు ఖడ్గముతో చంపిరి. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు; అదియు దానిలోని పట్టణములును గ్రామములును రూబేనీయుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదుగోత్రమునకు, అనగా గాదీయులకు వారి వంశములచొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోనురాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును. వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములును గ్రామములును ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషానురాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును. గిలాదులో సగమును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పుదిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి.