యెహోషువ 10:12-14
యెహోషువ 10:12-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించిన రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల సమక్షంలో యెహోవాతో ఇలా అన్నాడు: “సూర్యుడా, గిబియోనుపై నిలిచిపో, చంద్రుడా, అయ్యాలోను లోయ పైగా ఆగిపో.” ప్రజలు తమ శత్రువులపై పూర్తి విజయం సాధించే వరకు, సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, అని యాషారు వ్రాసిన వీరుల గ్రంథంలో వ్రాయబడినట్లుగా జరిగింది. సూర్యుడు ఆకాశం మధ్యలో ఆగి, దాదాపు ఒక రోజు ఆలస్యమయ్యాడు. యెహోవా ఒక మానవుడి మాట విన్న ఆ రోజులాంటిది ఇంకొకటి అంతకుముందుగానీ ఆ తర్వాత గాని లేదు. నిజంగా యెహోవా ఇశ్రాయేలీయుల కోసం యుద్ధం చేశారు!
యెహోషువ 10:12-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, “సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.” “ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు” అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు. యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.
యెహోషువ 10:12-14 పవిత్ర బైబిల్ (TERV)
ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు: “ఓ సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకాశంలో నిలిచి ఉండు, ఓ చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలిచి ఉండు.” కనుక సూర్యుడు కదలలేదు. ప్రజలు తమ శత్రువులను ఓడించేంతవరకు చంద్రుడు కూడ నిలిచిపోయాడు. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆకాశం మధ్యలో సూర్యుడు స్తంభించిపోయాడు. ఒక రోజంతా అది కదల్లేదు. ఆ రోజుకు ముందు ఎన్నడూ అలా జరుగలేదు. ఆ తర్వాత కూడ ఎన్నడూ మళ్లీ అలా జరుగలేదు. ఆ రోజు మనిషి మాట యెహోవా విన్నరోజు. నిజంగా ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా యుద్ధం చేసాడు!
యెహోషువ 10:12-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను– సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి యున్నది గదా. –సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచియించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.