యెహోషువ 1:8-11
యెహోషువ 1:8-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు నీ పెదాల మీద ఉండాలి; పగలు రాత్రి దానిని ధ్యానించాలి, తద్వార నీవు దానిలో వ్రాయబడి ఉన్న ప్రతిదీ శ్రద్ధగా చేయగలవు. అప్పుడు నీవు విజయవంతంగా వర్ధిల్లుతావు. బలంగా ధైర్యంగా ఉండమని నేను నీకు ఆజ్ఞాపించలేదా? భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు; ఎందుకంటే నీవు ఎక్కడికి వెళ్లినా నీ దేవుడైన యెహోవా నీతో ఉంటారు.” కాబట్టి యెహోషువ ప్రజల అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు శిబిరం గుండా వెళ్తూ ప్రజలతో, ‘మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మీరు మూడు రోజుల్లో యొర్దాను నదిని దాటాలి కాబట్టి భోజన ఏర్పాట్లు చేసుకోండి’ అని చెప్పండి.”
యెహోషువ 1:8-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.” అప్పుడు యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు “మీరు శిబిరంలోకి వెళ్లి ప్రజలతో ఈ మాట చెప్పండి, ‘మీరు స్వంతం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మూడు రోజుల్లోపు ఈ యొర్దాను నది దాటాలి. కాబట్టి ఆహారం సిద్ధపరచుకోండి.’”
యెహోషువ 1:8-11 పవిత్ర బైబిల్ (TERV)
ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయాలను పాటించగలుగుతావు. నీవు ఇలా చేస్తే, నీవు చేసే ప్రతీదీ తెలివిగా, విజయవంతంగా చేయగలుగుతావు. నీవు బలంగా ధైర్యంగా ఉండాలని నేను ఆజ్ఞాపించినట్టు జ్ఞాపకం ఉంచుకో. అందుచేత భయపడవద్దు. ఎందుచేతనంటే, నీవు వెళ్లే ప్రతిచోటా నీ యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక.” కనుక యెహోషువ ప్రజానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అతడు చెప్పాడు: “గుడారాల్లోనికి వెళ్లి ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పండి. ప్రజలతో ఇలా చెప్పండి, ‘భోజనం తయారు చేసుకోండి. మూడు రోజుల్లో మనం యొర్దాను నది దాటాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మనం వెళ్లి తీసుకొందాము.’”
యెహోషువ 1:8-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను–మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి –మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడుదినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి.