యోనా 3:1-6
యోనా 3:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తర్వాత యెహోవా వాక్కు రెండవసారి యోనాకు వచ్చింది: “నీవు మహా పట్టణమైన నీనెవెకు వెళ్లి నేను నీకు ఇచ్చే సందేశాన్ని ప్రకటించు.” యోనా యెహోవా మాటకు లోబడి నీనెవెకు వెళ్లాడు; నీనెవె చాలా పెద్ద పట్టణం కాబట్టి దానిగుండా వెళ్లడానికి మూడు రోజుల పట్టింది. యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, “ఇంకా నలభై రోజులకు నీనెవె నాశనమవుతుంది” అని అంటూ ప్రకటించాడు. నీనెవె ప్రజలు దేవున్ని నమ్మి ఉపవాసం ప్రకటించారు. గొప్పవారి నుండి సామాన్యుల వరకు అందరు గోనెపట్ట కట్టుకున్నారు. యోనా హెచ్చరిక నీనెవె రాజుకు చేరినప్పుడు, అతడు తన సింహాసనం దిగి, తన రాజ వస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు.
యోనా 3:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా వాక్కు రెండో సారి యోనాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే “నువ్వు లేచి, నీనెవె మహాపట్టణానికి వెళ్లి నేను నీకు ఆజ్ఞాపించిన సందేశాన్ని దానికి చాటించు.” కాబట్టి యోనా లేచి యెహోవా మాటకు లోబడి నీనెవె పట్టణానికి నడచుకుంటూ వెళ్ళాడు. నీనెవె నగరం చాలా పెద్దది. అది మూడు రోజుల ప్రయాణమంత పెద్దది. యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు. నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు.
యోనా 3:1-6 పవిత్ర బైబిల్ (TERV)
పిదప యోనాతో యెహోవా మళ్ళీ మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీవు ఆ నీనెవె మహానగరానికి వెళ్లు. నేను నీకు చెప్పే విషయాలు వారికి బోధించు.” యెహోవా ఆజ్ఞను శిరాసావహించి యోనా నీనెవె నగరానికి వెళ్లాడు. నీనెవె ఒక మహా నగరం. ఎవరైనా నగరంగుండా వెళ్లాలంటే మూడు రోజులు నడవాలి. యోనా నగరం మధ్యకు వెళ్లి, ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు. “నలభై రోజుల తరువాత నీనెవె నాశనమవుతుంది” అని యోనా ప్రకటించాడు. నీనెవె నగరవాసులు దేవుని వర్తమానాన్ని విశ్వసించారు. ప్రజలు తమ పాపాలను గురించి ఆలోచించటానికి, కొంతకాలంపాటు ఉపవాసం చేయటానికి నిర్ణయించుకొన్నారు. తమ విచారాన్ని వ్యక్తం చేయటానికి ప్రజలు ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అతి ముఖ్యలు, అతి సామాన్యులతో సహా నగరవాసులంతా ఇది ఆచరించారు. ఈ విషయాలను గురించి నీనెవె రాజు విన్నాడు. రాజుకూడా తాను చేసిన చెడుపనులకు విచారించాడు. అందుచే రాజు తన సింహాసనాన్ని వదిలివేశాడు. రాజు తన రాజదుస్తులు తీసివేసి, తన విచారాన్ని వ్యక్తం చేసే ప్రత్యేక దుస్తులు ధరించాడు. పిమ్మట రాజు బూడిదలో కూర్చున్నాడు.
యోనా 3:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవునిదృష్టికి గొప్పదై మూడుదినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంతదూరము సంచరించుచు–ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.