యోబు 9:1-20
యోబు 9:1-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: “అవును, ఇదంతా నిజమని నాకు తెలుసు. అయితే నశించే మానవులు దేవుని ఎదుట తమ నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలరు? వారు ఆయనతో వాదించాలనుకుంటే, వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనా వారు ఆయనకు జవాబు చెప్పలేరు. ఆయన అత్యంత జ్ఞానవంతుడు మహాబలవంతుడు. ఆయనతో పోరాడి సురక్షితంగా వచ్చినవారు ఎవరు? ఆయన పర్వతాలను వాటికి తెలియకుండానే కదిలిస్తారు, కోపంతో వాటిని తలక్రిందులు చేస్తారు. ఆయన భూమిని దాని స్థలంలో నుండి కదిలించి దాని స్తంభాలు అదిరేలా చేస్తారు. ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు. ఆయనే ఆకాశాన్ని విశాలపరుస్తారు సముద్రపు అలలను అణచివేస్తారు. స్వాతి, మృగశీర్ష, కృతిక అనే నక్షత్రాలను దక్షిణ నక్షత్రరాసులను ఆయన సృజించారు. ఆయన ఎవరు గ్రహించలేని మహాకార్యాలను లెక్కలేనన్ని అద్భుతాలను చేస్తారు. ఆయన నా ప్రక్కన నుండే వెళ్తారు కాని నేను ఆయనను చూడలేను, ఆయన వెళ్తున్నప్పుడు ఆయనను గమనించలేను. ఆయన లాక్కుంటే ఎవరు ఆయనను ఆపగలరు? ‘మీరు ఏమి చేస్తున్నారు?’ అని ఆయనను ఎవరు అడగగలరు? దేవుడు తన కోపాన్ని అణచుకోరు; రాహాబు సహాయకులు ఆయన పాదాల దగ్గర లొంగిపోయారు. “కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను? ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను? నేను నిర్దోషినైనప్పటికి ఆయనకు బదులు చెప్పలేను. కరుణించమని మాత్రమే నా న్యాయమూర్తిని వేడుకుంటాను. నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా, ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను. తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు, ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు. ఆయన నన్ను ఊపిరి తీసుకోనివ్వరు కాని చేదైన వాటిని నాకు తినిపిస్తారు. బలం విషయానికొస్తే, ఆయన మహాబలవంతుడు! న్యాయం విషయానికొస్తే, ఆయనకు ప్రతివాదిగా ఎవరు ఉండగలరు? నేను నిర్దోషినైనా కూడా నా నోరే నన్ను నిందిస్తుంది; నేను నిర్దోషినైనా అదే నన్ను దోషిగా ప్రకటిస్తుంది.
యోబు 9:1-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు. నిజమే, ఆ విషయం అలాగే ఉంటుందని నాకు తెలుసు. మనిషి దేవుని దృష్టిలో లోపం లేనివాడుగా ఎలా ఉండగలడు? మనిషి ఆయనతో వివాదం పెట్టుకుంటే ఆయన అడిగే వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికైనా జవాబు చెప్పలేడు. ఆయన అత్యంత వివేకం, బల ప్రభావాలు గలవాడు. ఆయనతో పోరాడాలని తెగించిన వాళ్ళు తప్పక కీడు పాలవుతారు. పర్వతాలను వాటికి తెలియకుండానే ఆయన తొలగిస్తాడు. కోపంతో వాటిని బోర్లాపడేలా చేస్తాడు. భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించివేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు. ఆయన సూర్యుడికి ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు. ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు. స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు. ఎవరికీ అంతు చిక్కని మహిమ గల కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపంలో ఉంటున్నాడు, కానీ నేను ఆయనను గుర్తించలేదు. నా పక్కనుండి నడుస్తూ వెళ్తున్నాడు కానీ ఆయన నాకు కనబడడు. ఆయన తీసుకువెళ్తుంటే ఆయనను అడ్డగించేవాడెవడు? “నువ్వేం చేస్తున్నావు?” అని ఆయనను అడగగలిగే వాళ్ళు ఎవరు? దేవుని కోపం చల్లారదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు. కాబట్టి ఆయనకు జవాబివ్వడానికి నేనేపాటి వాణ్ణి? సూటియైన మాటలు పలుకుతూ ఆయనతో వాదించడానికి నేనెంతటి వాణ్ణి? నేను న్యాయవంతుణ్ణి అయినా ఆయనకు జవాబు చెప్పలేను. నా న్యాయాధిపతిని కరుణించమని వేడుకోవడం మాత్రమే చేయగలను. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు జవాబిచ్చినా ఆయన నా మాట వింటాడని నాకు నమ్మకం లేదు. ఆయన నా మొర వినకుండా నన్ను తుఫాను చేత నలగగొడుతున్నాడు. కారణం లేకుండా నా గాయాలను రేగగొడుతున్నాడు. ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు. బలవంతుల శక్తిని గూర్చి ప్రశ్న వస్తే “నేనే ఉన్నాను” అని ఆయన అంటాడు. న్యాయ నిర్ణయం గూర్చి వివాదం రేగినప్పుడు “నాకు విరోధంగా వాదించేది ఎవరు?” అని ఆయన అడుగుతాడు. నేను చేసే వాదన న్యాయంగా ఉన్నప్పటికీ నా మాటలే నా మీద నేరం మోపుతాయి. నేను న్యాయవంతుడినైప్పటికీ దోషినని నా మాటలు రుజువు చేస్తాయి.
యోబు 9:1-20 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: “అవును, నీవు చెప్పేది సత్యమే అని నాకు తెలుసు. అయితే మానవుడు దేవుని దృష్టిలో ఎలా నిర్దోషిగా ఉండగలడు? ఒక మనిషి దేవునితో వాదించలేడు. దేవుడు వెయ్యి ప్రశ్నలు అడుగవచ్చు. కానీ ఒక్కదానికి కూడా ఏ మనిషీ జవాబు యివ్వలేడు. దేవుని జ్ఞానం లోతైనది, ఆయన శక్తి గొప్పది. దేవునితో పోరాడిన ఏ మనిషీ బాధపడకుండా తప్పించుకోలేడు. దేవుడు పర్వతాలను కదిలిస్తాడు. కాని వాటికి తెలియదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు పర్వతాలను తలక్రిందులు చేస్తాడు. భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపాలను పంపిస్తాడు. భూమి పునాదులను దేవుడు కంపింపజేస్తాడు. దేవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయించకుండా చేయగలడు. ప్రకాశించకుండా, నక్షత్రాలకు ఆయన తాళం వేసి పెట్టగలడు. దేవుడే ఆకాశాలను చేశాడు. మహాసముద్ర తరంగాల మీద ఆయన నడుస్తాడు. “స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనేవాటిని చేసినవాడు ఆయనే. దక్షిణ ఆకాశాన్ని దాటిపోయే గ్రహాలను ఆయన చేశాడు. మనుష్యులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను దేవుడు చేస్తాడు. దేవుని మహా అద్భుతాలకు అంతం లేదు. దేవుడు నన్ను దాటి వేళ్లేటప్పుడు నేను ఆయనను చూడలేను. దేవుడు పక్కగా వెళ్లేటప్పుడు ఆయన గొప్పతనాన్ని నేను గ్రహించలేను. దేవుడు దేనినై నా తీసివేస్తే, ఏ ఒక్కరూ ఆయన్ని వారించలేరు. ‘ఏమిటి నీవు చేస్తున్నది?’ అని ఎవ్వరూ ఆయనతో అనలేరు. దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు. రాహాబు సహాయకులకు కూడా దేవుడంటే భయం.” యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను. ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు. యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను. నా న్యాయమూర్తిని (దేవుని) ప్రాధేయపడడం మాత్రమే నేను చేయగలిగింది అంతా. ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన జవాబిచ్చినా, దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నమ్మను. నన్ను అణచివేయటానికి దేవుడు తుఫానులు పంపిస్తాడు. ఏ కారణం లేకుండానే ఆయన నాకు ఇంకా ఎక్కువ గాయాలు కలిగిస్తాడు. దేవుడు నన్ను మళ్లీ శ్వాస పీల్చనీయడు. ఆయన నన్ను ఇంకా ఎక్కువ కష్టపెడతాడు. నేను దేవుణ్ణి ఓడించలేను. దేవుడు శక్తిమంతుడు. దేవుని న్యాయస్థానానికి వెళ్లి నాకు న్యాయం చేకూర్చేటట్టు నేను చేయలేను. దేవుణ్ణి న్యాయస్థానానికి రమ్మని ఆయనను ఎవరు బలవంతం చేస్తారు? యోబు అనే నేను నిర్దోషిని, కాని నేను చెప్పే మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి. కనుక, నేను నిర్దోషిని, కాని నా నోరు నేను దోషిని అని ప్రకటిస్తుంది.
యోబు 9:1-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను –వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవునిదృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడల వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు? వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే భూమిని దాని స్థలములోనుండి కదలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచు వాడు సముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు. ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయనచేయు చున్నాడు. ఇదిగో ఆయన నా సమీపముగ గడచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవా డెవడు? –నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవా డెవడు? దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకు టకు నేనేపాటివాడను? నేను నిర్దోషినైయుండినను ఆయనకు ప్రత్యుత్త రము చెప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును. నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయు చున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా–నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా–ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును? నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.