యోబు 20:1-29
యోబు 20:1-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు: “నేను చాలా ఆందోళన చెందగా, జవాబివ్వాలని నా ఆలోచనలు నన్ను తొందర చేస్తున్నాయి. నాకు అవమానం కలిగించే నిందను నేను విన్నాను, కాబట్టి నా వివేకం జవాబు చెప్పేలా నన్ను ప్రేరేపిస్తుంది. “అనాది కాలం నుండి ఎలా ఉందో నీకు తెలుసు, భూమి మీద నరుడు ఉంచబడినప్పటి నుండి ఏమి జరుగుతున్నది నీకు తెలుసు. దుర్మార్గుల ఉల్లాసం కొద్దిసేపే అని, భక్తిహీనుల సంతోషం ఒక క్షణమే ఉంటుందని నీకు తెలుసు. భక్తిహీనుల గర్వం ఆకాశాలను అంటినా వారి తల మేఘాలను తాకినా, వారి మలంలా వారు కూడా ఎప్పటికి కనబడకుండా నశిస్తారు; వారిని చూసినవారు, ‘వారెక్కడ ఉన్నారు?’ అని అడుగుతారు. కలలా వారు చెదిరిపోయి కనుమరుగవుతారు, రాత్రి స్వప్నంలా వారు చెదిరిపోతారు. వారిని చూసిన కన్ను మరలా వారిని చూడదు; వారి స్థలం వారిని మరలా చూడదు. వారి పిల్లలు పేదవారి సహాయం అడుగుతారు; వారి చేతులు తమ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాయి. వారి ఎముకల్లో నిండి ఉన్న యవ్వన బలం వారితో పాటు మట్టిపాలవుతుంది. “చెడుతనం వారి నోటికి తీయగా ఉన్నా, నాలుక క్రింద వారు దాన్ని దాచినా, భరించలేకపోయినా దాన్ని విడిచిపెట్టలేదు తమ నోటిలో భద్రం చేసుకున్నారు, వారి ఆహారం వారి కడుపులో పులిసిపోతుంది; అది వారిలో నాగుపాముల విషంలా మారుతుంది. వారు మ్రింగిన ఐశ్వర్యాన్ని కక్కివేస్తారు; దేవుడు వారి కడుపు లోనిది కక్కిస్తారు. వారు నాగుపాముల విషాన్ని పీల్చుకుంటారు; పాము కోరలు వారిని చంపుతాయి. నదిలా ప్రవహించే తేనె మీగడలు చూసి, వారు ఆనందించలేరు. వారు కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించకుండానే తిరిగి ఇచ్చేస్తారు; తమ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని వారు ఆస్వాదించరు. ఎందుకంటే వారు పేదలను వేధించి వారిని దిక్కులేనివారిగా చేశారు; తాను కట్టని ఇళ్ళను వారు ఆక్రమించారు. “వారి అత్యాశకు అంతం ఉండదు; వారికున్న సంపదలతో తమను తాము రక్షించుకోలేడు. వారు మ్రింగివేయడానికి వారికి ఏమి మిగల్లేదు; వారి అభివృద్ధి నిలబడదు. వారికి సమృద్ధి కలిగినప్పుడు ఇబ్బందిపడతారు; కష్టాల భారం వారి మీద పడుతుంది. వారు తమ కడుపు నింపుకునేప్పుడు, దేవుడు తన కోపాగ్నిని వారి మీద కురిపిస్తారు, వారి మీద కష్టాలను కురిపిస్తారు. ఇనుప ఆయుధం నుండి వారు తప్పించుకున్నా ఇత్తడి విల్లు నుండి బాణం వారి గుండా దూసుకుపోతుంది. దానిని వెనుక నుండి బయటకు తీయగా మెరుస్తున్న ఆ బాణం అంచు వారి కాలేయాన్ని ముక్కలు చేస్తుంది. మరణభయం వారిని కమ్ముకుంటుంది; వారి సంపదలు చీకటిమయం అవుతాయి, ఎవరూ ఊదకుండానే మంటలు రాజుకొని వారిని దహించి వేసి, వారి గుడారాల్లో మిగిలినదంతా నాశనం చేస్తుంది. ఆకాశాలు వారి అపరాధాన్ని బయటపెడతాయి; భూమి వారి మీదికి లేస్తుంది. దేవుని కోపదినాన ప్రవహించే నీటిలో, వారి ఇళ్ళు కొట్టుకుపోతాయి. దుష్టులకు దేవుడు నియమించిన, వారసత్వం ఇదే.”
యోబు 20:1-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు చెప్పాడు, నువ్వు అలా చెప్పినందువల్ల నాలో కలిగిన ఆత్రుత నీకు తగిన జవాబు చెప్పాలని తొందర చేస్తున్నది. నన్ను అవమానపరిచే నింద నీ నుండి వినవలసి వచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురిగొల్పుతున్నది. ఆదిలో మనుషులు భూమి మీద నివసించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా? దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వితం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది. వాళ్ళ గొప్పదనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి, మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకుని తిరగవచ్చు. అయితే వాళ్ళ మలం లాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు “వాళ్ళంతా ఏమయ్యారు?” అని అడుగుతారు. కల లాగా వాళ్ళు కరిగి పోయి మళ్ళీ కనబడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదరిపోతారు. వాళ్ళను చూసిన కళ్ళు ఇకపై వాళ్ళను చూడవు. అతని నివాసం అతన్నిక చూడదు. వాళ్ళ సంతతి వాళ్ళు కనికరించమని దరిద్రులను వేడుకుంటారు. వారి చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చివేస్తారు. వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్ళతో కలసి మట్టిలో నిద్రిస్తుంది. చెడుతనం వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. వాళ్ళ నాలుకల కింద దాన్ని దాచి ఉంచారు. దాన్ని జాగ్రత్త చేసుకుని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు. అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది. వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడే వాళ్ళ కడుపులోనుండి కక్కివేసేలా చేస్తాడు. వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కోరలు వాళ్ళను చంపివేస్తాయి. తేనెధారలు, వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు. వాళ్ళు సంపాదించిన ఆస్తి మేరకు కష్టాలు పెరుగుతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా అనుభవించకుండానే తిరిగి అప్పగిస్తారు. వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు. వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒక దానితోనైనా తమను తాము కాపాడుకోలేరు. వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అందువల్ల వాళ్ళ క్షేమ స్థితి నిలబడదు. వాళ్ళు మితిలేని సంపాదన కలిగి ఉన్న రోజుల్లో ఇబ్బందులకు గురౌతారు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళందరూ వాళ్ళపై దాడి చేస్తారు. వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది. ఇనప ఆయుధం నుండి తప్పించుకొనేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహాల్లోకి దూసుకుపోతుంది. ఆ బాణం వాళ్ళ దేహాలను చీల్చివేసి శరీరం నుండి బయటకు వస్తుంది. దాన్ని బయటకు తీసినప్పుడు కాలేయం తుత్తునియలు అవుతుంది. మరణభయం వాళ్ళ మీదికి వస్తుంది. వాళ్ళ ధన సంపదలు చీకటిమయం అవుతాయి. ఎవ్వరూ రాజేయకుండానే అగ్ని లేచి వాళ్ళను మింగివేస్తుంది. వాళ్ళ గుడారాల్లో మిగిలినదాన్ని అది కాల్చివేస్తుంది. వాళ్ళ దోషాలకు ఆకాశం సాక్షిగా నిలబడుతుంది. భూమి వారిపై తిరగబడుతుంది. వాళ్ళ ఇళ్ళకు చేరిన సంపాదన కనబడకుండా పోతుంది. దేవుని ఉగ్రత దినాన అదంతా నాశనమౌతుంది. దేవుని దగ్గర నుంచి దుష్టులైన మనుషులకు ప్రాప్తించేది ఇదే. దేవుడు వాళ్ళకు నియమించే వారసత్వం ఇదే.
యోబు 20:1-29 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు: “యోబూ! నా తలంపులు నాకు జవాబిస్తాయి. నేను అనుకొంటున్నది ఏమిటో నేను త్వరపడి నీకు చెప్పాలి. మేము చెప్పిన దానికి నీవు ఇచ్చిన జవాబులు మాకు అవమానకరంగా ఉన్నాయి. కానీ నేను జ్ఞానం గలవాడను, నీకు ఎలా జవాబు ఇవ్వాలో నాకు తెలుసు. “మొట్ట మొదటిసారిగా ఆదాము భూమి మీద చేయ బడినప్పటి నుండి ఒక దుర్మార్గుని సంతోషం ఎక్కువ సేపు ఉండదు అనే విషయం చాలా కాలంగా నీకు తెలిసిందే. దేవుని లక్ష్యపెట్టని వాని ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఒకవేళ దుర్మార్గుని గర్వం ఆకాశాన్ని అంటవచ్చు. అతని తల మేఘాలను తాకవచ్చు. కానీ అతని స్వంత మలం పోయినట్లే అతడు శాశ్వతంగా పోతాడు. అతన్ని ఎరిగిన ప్రజలు, ‘అతడు ఎక్కడ?’ అని అంటారు. ఒక కల వేగంగా ఎగిరిపోయినట్టు అతడు ఎగిరి పోతాడు. ఏ మనిషీ మరల అతణ్ణి చూడడు. అతడు పోయి ఉంటాడు. రాత్రి పూట పీడకలలా అతడు వదిలించబడతాడు. అతనిని చూచిన మనుష్యులు అతన్ని మరల చూడరు అతని కుటుంబం అతన్ని మరల ఎన్నడూ చూడదు. దుర్మార్గుని పిల్లలు, పేదవారి దగ్గర అతడు తీసుకొన్న వాటిని తిరిగి ఇచ్చివేస్తారు. దుర్మార్గుని స్వహస్తాలే తన ఐశ్వర్యాన్ని తిరిగి ఇచ్చివేయాలి. అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం బలంగా ఉంటుంది. కాని త్వరలోనే అది మట్టి అవుతుంది. “దుర్మార్గుని నోటిలో దుర్మార్గం తియ్యగా ఉంటుంది. అతడు దానిని తన నాలుక కింద దాచిపెడతాడు. చెడ్డ మనిషి తన దుర్మార్గాన్ని అలాగే పెట్టుకొని ఉంటాడు. దానిని పోనియ్యటం అతనికి అసహ్యం. కనుక అతడు దానిని తియ్యని పదార్థంవలె తన నోటిలో ఉంచుకొంటాడు. కానీ అతని భోజనం అతని కడుపులో విషం అవుతుంది. అది అతని లోపల చేదు విషంలా, పాము విషంలా అవుతుంది. దుష్టుడు ఐశ్వర్యం దిగమింగాడు. కానీ అతడు వాటిని కక్కివేస్తాడు. అవును, దుష్టుని కడుపు వాటిని కక్కివేసేట్టుగా దేవుడు చేస్తాడు. దుష్టుడు పాముల విషం పీల్చుతాడు. పాము కోరలు వానిని చంపివేస్తాయి. అప్పుడు నదులు తేనెతో, వెన్నతో ప్రవహించటం చూచి దుష్టుడు ఆనందించ లేడు. దుష్టుడు తన లాభాలను ఇచ్చివేసేలా బలాత్కారం చేయబడతాడు. అతని కష్టార్జితం అనుభవించటానికి అతనికి అనుమతి ఇవ్వబడదు. దుష్టుడు పేద ప్రజలను సక్రమంగా చూడలేదు గనుక, అతడు వారి విషయమై పట్టించుకోలేదు, మరియు అతడు వారి వస్తువులను తీసుకొన్నాడు. ఇంకెవరో కట్టిన ఇండ్లు అతడు తీసివేసుకొన్నాడు. దుష్టునికి ఎన్నటికీ తృప్తిలేదు. వాని ఐశ్వర్యం వానిని రక్షించలేదు. అతడు భోజనం చేసినప్పుడు ఏమీ మిగలదు. అతని విజయం కొనసాగదు: దుర్మార్గునికి సమృద్ధిగా ఉన్నప్పటికీ అతడు కష్టంతో కృంగిపోతాడు. అతని సమస్యలు అతని మీదకు దిగి వస్తాయి. దుర్మార్గుడు తనకు కావలసినదంతా తినివేసిన తర్వాత దేవుడు తన కోపాన్ని ఆ మనిషి మీదకి మళ్లిస్తాడు. దుర్మార్గుని మీద దేవుడు శిక్షా వర్షం కురిపిస్తాడు. ఒకవేళ దుర్మార్గుడు ఇనుప ఖడ్గం నుండి పారిపోతాడేమో కానీ ఒక ఇత్తడి బాణం వానిని కూల గొడుతుంది. ఆ ఇత్తడి బాణం అతని శరీరం అంతటిలో గుచ్చుకొని పోయి అతని వీపులో నుండి బయటకు వస్తుంది. ఆ బాణం యొక్క మెరుపు కొన అతని కాలేయంలో గుచ్చుకు పోతుంది. అతడు భయంతో అదిరిపోతాడు. అతని ఐశ్వర్యాలన్నీ నాశనం చేయబడుతాయి. ఏ మనిషీ ఆరంభించని ఒక అగ్ని అతణ్ణి నాశనం చేస్తుంది. అతని ఇంటిలో మిగిలివున్నదాన్ని అగ్ని నాశనం చేస్తుంది. దుర్మార్గుడు దోషి అని ఆకాశం రుజువు చేస్తుంది. భూమి అతనికి విరోధంగా సాక్ష్యం ఇస్తుంది. అతని ఇంట్లో ఉన్న సమస్తం దేవుని కోప ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. దుర్మార్గునికి దేవుడు చేయాలని తలపెడుతోంది అదే. దేవుడు వారికి ఇవ్వాలని తలస్తోంది అదే.”
యోబు 20:1-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను– ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి యున్నది. దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారు–వారేమైరని యడుగుదురు. కల యెగసిపోవునట్లువారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లువారు తరిమి వేయ బడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమునవారు మరి ఎప్పుడును కనబడరు వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరువారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి యెముకలలో యౌవనబలము నిండియుండునుగాని అదియు వారితోకూడ మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి. దాని పోనియ్యక భద్రముచేసికొనిరి, నోట దాని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మ్రింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు. వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు. దేనికొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరువారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారువారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించు కొనినను దానిని కట్టి పూర్తిచేయరు. వారు ఎడతెగక ఆశించినవారు తమ యిష్టవస్తువులలో ఒకదానిచేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మ్రింగివేయనిది ఒకటియు లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమునవారు ఇబ్బందిపడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికి వచ్చును. వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించునువారు తినుచుండగా దాని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారి పోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మ్రింగివేయును వారి గుడారములో మిగిలినదానిని అది కాల్చి వేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును. వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.