యోబు 14:1-17

యోబు 14:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“స్త్రీకి పుట్టిన మనుష్యులు, ఉండేది కొంతకాలమే అయినా ఎన్నో శ్రమలు పొందుతారు. వారు పువ్వులా వికసించి వాడిపోతారు; నిలకడలేని నీడలా వారు స్థిరంగా ఉండరు. అలాంటివారి మీద మీ దృష్టిని నిలిపారా? తీర్పు తీర్చడానికి వారిని మీ ఎదుటికి తీసుకువస్తారా? అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు? ఎవరు తీసుకురాలేరు! మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి; వారు ఎన్ని నెలలు బ్రతుకుతారో మీరు శాసించారు వారు దాటలేని పరిధిని మీరు నియమించారు. కూలివారిలా వారు తమ పని ముగించే వరకు మీరు వారివైపు చూడకండి, వారిని అలా వదిలేయండి. “కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది: దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది, దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి. దాని వేర్లు భూమిలో ఎండిపోయినా దాని మోడు మట్టిలో చనిపోయినా, నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది. లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది. కాని నరులు చనిపోయి కదలకుండ పడి ఉంటారు; చివరి శ్వాస విడిచిన తర్వాత వారు ఇక ఉండరు. సముద్రంలోని నీరు ఆవిరైపోయినట్లుగా, నదీ తీరం హరించి ఎండిపోయినట్లుగా, మానవులు నిద్రిస్తారు, తిరిగి లేవరు; ఆకాశం గతించేవరకు వారు మేలుకోరు వారి నిద్ర నుండి తిరిగి లేవరు. “మీరు నన్ను సమాధిలో దాచిపెడితే, మీ కోపాగ్ని చల్లారే వరకు నన్ను దాచి ఉంచితే ఎంత బాగుండేది! మీరు నాకు కొంతకాలం నియమించి ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండేది! ఎవరైనా చనిపోతే వారు మరలా బ్రతుకుతారా? అలా అయితే నేను కష్టపడి పనిచేసే రోజులన్నీ నా విడుదల కోసం నేను ఎదురుచూస్తాను. అప్పుడు మీరు పిలుస్తారు నేను జవాబిస్తాను; మీ చేతులు చేసిన వాటిని మీరు ఇష్టపడతారు. అప్పుడు ఖచ్చితంగా మీరు నా అడుగులను లెక్కిస్తారు కాని నా పాపాలను గుర్తించరు. నా అతిక్రమాలు సంచిలో మూసివేయబడతాయి; మీరు నా పాపాన్ని కప్పివేస్తారు.

షేర్ చేయి
చదువండి యోబు 14

యోబు 14:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజులపాటు జీవిస్తాడు. అతడు తన జీవిత కాలమంతా కష్టాలు అనుభవిస్తాడు. అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు. అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా? అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైనవాడు పుట్టగలిగితే ఎంత మేలు? కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు. మనిషి ఎంతకాలం బ్రతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు. అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలిపని వాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు. చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందనీ, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయనీ ఆశాభావం ఉంటుంది. నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్లిపోయి, దాని మొదలు మట్టిలో చీకిపోతూ ఉంటుంది. అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది, లేత మొక్కలాగా కొత్తగా కొమ్మలు కాస్తుంది. అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు? సముద్రంలో నీళ్ళు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్ళు ఎలా ఆవిరైపోతాయో అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు. ఆకాశం అంతరించి పోయేదాకా వాళ్ళు మేల్కోరు. ఎవరూ వారిని నిద్ర లేపలేరు. నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు! నా మీద నీ కోపం చల్లారే దాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది! నాకు కొంతకాలం గడువుపెట్టి ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? ఆలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగేదాకా నేను ఎదురుచూస్తూ ఉంటాను. అప్పుడు నువ్వు పిలుస్తావు. నేను నీతో మాట్లాడతాను. నీ చేతిపనిని చూసి నువ్వు ఇష్టపడతావు. అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి. నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు.

షేర్ చేయి
చదువండి యోబు 14

యోబు 14:1-17 పవిత్ర బైబిల్ (TERV)

యోబు ఈ విధంగా చెప్పాడు: “మనమందరం కష్టంతో నిండిన కొద్దిపాటి జీవితం కోసమేపుట్టాం. మనిషి జీవితం పువ్వులాంటిది. అతడు త్వరగా పెరిగి, త్వరగా చస్తాడు. కొంచెం సేపు ఉండి, ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం. దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా? నీతో తీర్పు పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము. “మురికి దానిలో నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు. నరుని జీవితం పరిమితం. దేవా, నరుని మాసాల సంఖ్య నీవు నిర్ణయం చేశావు. నరుడు మార్చజాలని హద్దులు నీవు ఉంచావు. కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు. అతని కాలం తీరేవరకు అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు. “అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది. దాన్ని నరికివేస్తే, అది మరల పెరుగుతుంది. అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది. భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును. దాని మొద్దు మట్టిలో చీకిపోవచ్చును. కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది. మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది. అయితే మనిషి మరణిస్తాడు. అతని శరీరం పాతి పెట్టబడుతుంది. మనిషి చనిపోయినప్పుడు, అతుడు వెళ్లిపోయాడు. సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు, ఒక నది నీరు ఎండిపోయినట్టు సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతడు పండుకొని, మళ్లీ లేవలేడు. మరణించే మనుష్యులు, ఆకాశాలు ఉండకుండా పోయేంత వరకు మేల్కొనరు, నిద్రించటం మానుకోరు. “నీవు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ. నీ కోపం పోయేవరకు, నీవు నన్ను అక్కడ దాచిపెడితే బాగుండుననిపిస్తుంది నాకు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు నీవు ఒక సమయాన్ని ఏర్పరచుకోవచ్చు ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బ్రతుకుతాడా? నేను వేచి ఉంటాను, నేను విడుదల అయ్యేంత వరకు కష్టపడి పోరాడుతాను. దేవా, నీవు నన్ను పిలుస్తావు, నేను (యోబు) నీకు జవాబు ఇస్తాను. నన్ను నీవు చేశావు, నన్ను నీవు కోరుతావు అప్పుడు నేను వేసే ప్రతి అడుగూ నీవు గమనిస్తావు. కానీ, నేను చేసిన పాపాలు నీవు జ్ఞాపకం చేసుకోవు. నీవు నా పాపాలు ఒక సంచిలో కట్టివేసి, దూరంగా పారవేయి.

షేర్ చేయి
చదువండి యోబు 14

యోబు 14:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించి యున్నావు. పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించియున్నావు కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకువారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడక యుండుము. వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతో మేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచిన యెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు చున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.

షేర్ చేయి
చదువండి యోబు 14