యోహాను 9:1-5
యోహాను 9:1-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు దారిలో వెళ్తూ పుట్టుకతో గ్రుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తిని చూశారు. ఆయన శిష్యులు ఆయనను, “రబ్బీ, అతడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? అతడా లేదా అతని తల్లిదండ్రులా?” అని అడిగారు. యేసు, “అతడు కానీ అతని తల్లిదండ్రులు కాని పాపం చేయలేదు. దేవుని కార్యాలు అతనిలో వెల్లడి కావడానికి ఇలా జరిగింది. పగలున్నంత వరకు నన్ను పంపినవాని పనులను మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది అప్పుడు ఎవరూ పని చేయలేరు. ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ లోకానికి వెలుగు” అని చెప్పారు.
యోహాను 9:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన శిష్యులు, “బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు. ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని” అని చెప్పాడు.
యోహాను 9:1-5 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన వెళ్తూ ఒక పుట్టు గ్రుడ్డి వాణ్ణి చూశాడు. ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ! యితడు గ్రుడ్డివానిగా పుట్టాడే! ఎవరు పాపం చేసారంటారు? ఇతడా లేక యితని తల్లిదండ్రులా?” అని అడిగారు. యేసు, “ఇతడు కాని, యితని తల్లిదండ్రులు కాని పాపం చెయ్యలేదు! దేవుని శక్తి యితని జీవితం ద్వారా ప్రదర్శింపబడాలని గ్రుడ్డివానిగా పుట్టాడు. సూర్యాస్తమయం అయ్యేలోగా మనం నన్ను పంపిన వాని కార్యం చేయాలి. రాత్రి రాబోతోంది. అప్పుడు ఎవ్వరూ పని చెయ్యలేరు. ఈ ప్రపంచంలో నేను ఉన్నంత కాలం నేను దానికి వెలుగును” అని అన్నాడు.
యోహాను 9:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు – బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు–వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనముచేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.