యోహాను 4:27-38

యోహాను 4:27-38 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇంతలో ఆయన శిష్యులు అక్కడికి వచ్చి యేసు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, “నీకు ఏమి కావాలి? అని గాని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గాని ఎవరు అడగలేదు. అప్పుడు ఆ స్త్రీ తన నీటి కుండను అక్కడే వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో, “రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన ఆయనను చూడండి, ఈయనే క్రీస్తు కాడా?” అని చెప్పింది. వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు. ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ, కొంచెం తినండి” అని ఆయనను వేడుకున్నారు. అయితే ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది” అని వారితో చెప్పారు. అందుకు శిష్యులు ఒకరితో ఒకరు, “ఎవరైనా ఈయనకు ఆహారం తెచ్చారేమో?” అని చెప్పుకున్నారు. యేసు వారితో, “నన్ను పంపినవాని చిత్తప్రకారం చేసి ఆయన పనిని ముగించడమే నా ఆహారము. ‘కోతకు రావడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది’ అని మీరు చెప్పుతారు కదా! నేను మీతో చెప్పేది ఏంటంటే, కళ్లు తెరిచి పొలాలను చూడండి! పంట పండి కోతకు సిద్ధంగా ఉంది. విత్తినవాడు కోసేవాడు ఇద్దరూ సంతోషించేలా, పంటను కోసేవాడు తన జీతం తీసుకుని పంట అంతా కోసి నిత్యజీవం కోసం కూర్చుకుంటాడు. ఈ విషయంలో ‘విత్తువాడు ఒకడు, కోసేవాడు మరొకడు’ అనే సామెత నిజమే. మీరు పని చేయని పొలంలో పంటను కోయడానికి నేను మిమ్మల్ని పంపించాను. అక్కడ ఇతరులు కష్టపడి పని చేశారు. వారి కష్ట ఫలాన్ని మీరు కోసుకొని అనుభవిస్తున్నారు” అన్నారు.

యోహాను 4:27-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి ‘ఎందుకు మాట్లాడుతున్నాడా’ అని ఆశ్చర్యపడ్డారు. కానీ ‘నీకేం కావాలని’ గానీ ‘ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు’ అని గానీ ఎవరూ అడగలేదు. ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. ఆ ఊరి వారితో, “మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాడా?” అంది. వారంతా ఊరి నుండి బయలు దేరి ఆయన దగ్గరికి వచ్చారు. ఆలోగా శిష్యులు, “బోధకా, భోజనం చెయ్యి” అని ఆయనను బతిమాలారు. దానికి ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది” అని వారితో చెప్పాడు. “ఆయన తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి?” అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసు వారిని చూసి, “నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పని చేసి ముగించడమే నా ఆహారం. పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెబుతున్నాను. విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేలా కోసేవాడు జీతం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఈ విషయంలో “విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు, అనే మాట నిజమే. మీరు దేని కోసం ప్రయాస పడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు. వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు” అన్నాడు.

యోహాను 4:27-38 పవిత్ర బైబిల్ (TERV)

అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆయనొక స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. కాని, “మీకేమి కావాలి?” అని కాని, లేక, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు” అని కాని వాళ్ళు అడగలేదు. ఆ స్త్రీ తన కడవనక్కడ వదిలి గ్రామంలోకి తిరిగి వెళ్ళిపోయింది. ప్రజలతో, “రండి! నేను చేసిన వాటన్నిటీని చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయనే క్రీస్తు అవును గదా” అని అన్నది. వాళ్ళందరూ గ్రామంనుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు. ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ! భోజనం చెయ్యండి” అని వేడుకున్నారు. కాని ఆయన వాళ్ళతో, “నా దగ్గర తినటానికి ఆహారం ఉంది. కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ తెలియదు” అని అన్నాడు. ఆయన శిష్యులు, “ఆయన కోసం ఎవరో భోజనం తెచ్చివుంటారు!” అని పరస్పరం మాట్లాడుకున్నారు. యేసు, “నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, ఆయన కార్యాన్ని పూర్తి చేయటమే, నా భోజనం. ‘విత్తిన తర్వాత నాలుగు నెలల్లో పంట వస్తుంది!’ అని మీరంటున్నారు. కాని నేను చెప్పేదేమిటంటే కళ్ళు తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి సిద్ధంగా ఉంది. దాన్ని విత్తినవాడు, కోసేవాడు ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం, అతడు ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటినవాడు, పంట కోసే వాడు, యిద్దరూ ఆనందిస్తారు. ‘విత్తనం ఒకడు నాటితె ఫలం ఇంకొకడు పొందుతాడు’ అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది. మీరు కష్టపడి పని చెయ్యని పంట కోయటానికి మిమ్మల్ని పంపాను, దాని కోసం యితర్లు చాలా కష్టించి పని చేసారు. వాళ్ళ కష్టానికి మీరు ఫలం పొందుతున్నారు” అని చెప్పాడు.

యోహాను 4:27-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్ర్తీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమికావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని యైనను ఎవడును అడుగలేదు. ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి –మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి. ఆ లోగా శిష్యులు–బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన–భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు–ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. యేసు వారిని చూచి–నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది. ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలమువచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పు చున్నాను. విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే. మీరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.