యోహాను 4:21-30
యోహాను 4:21-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా, నన్ను నమ్ము. ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు. సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది. అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే అలాంటి ఆరాధికుల కోసమే తండ్రి చూస్తున్నారు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి” అని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు వస్తాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలను మాకు వివరిస్తాడు” అని అన్నది. అప్పుడు యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అని చెప్పారు. ఇంతలో ఆయన శిష్యులు అక్కడికి వచ్చి యేసు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, “నీకు ఏమి కావాలి? అని గాని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గాని ఎవరు అడగలేదు. అప్పుడు ఆ స్త్రీ తన నీటి కుండను అక్కడే వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో, “రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన ఆయనను చూడండి, ఈయనే క్రీస్తు కాడా?” అని చెప్పింది. వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.
యోహాను 4:21-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.” అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలిచే మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అంతా వివరిస్తాడు” అంది. అది విని యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అని చెప్పాడు. ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి ‘ఎందుకు మాట్లాడుతున్నాడా’ అని ఆశ్చర్యపడ్డారు. కానీ ‘నీకేం కావాలని’ గానీ ‘ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు’ అని గానీ ఎవరూ అడగలేదు. ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. ఆ ఊరి వారితో, “మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాడా?” అంది. వారంతా ఊరి నుండి బయలు దేరి ఆయన దగ్గరికి వచ్చారు.
యోహాను 4:21-30 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు. దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు. ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది. యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు. అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆయనొక స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. కాని, “మీకేమి కావాలి?” అని కాని, లేక, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు” అని కాని వాళ్ళు అడగలేదు. ఆ స్త్రీ తన కడవనక్కడ వదిలి గ్రామంలోకి తిరిగి వెళ్ళిపోయింది. ప్రజలతో, “రండి! నేను చేసిన వాటన్నిటీని చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయనే క్రీస్తు అవును గదా” అని అన్నది. వాళ్ళందరూ గ్రామంనుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.
యోహాను 4:21-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. ఆ స్త్రీ ఆయనతో–క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు–నీతో మాటలాడుచున్ననేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్ర్తీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమికావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని యైనను ఎవడును అడుగలేదు. ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి –మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.