యోహాను 2:1-25 - Compare All Versions

యోహాను 2:1-25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మూడవ రోజున గలిలయ ప్రాంతంలోని కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. యేసు, ఆయన శిష్యులు ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, యేసు తల్లి ఆయనతో, “ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. అందుకు యేసు, “అమ్మా, దాంతో మనకేంటి? నా సమయం ఇంకా రాలేదు” అన్నారు. ఆయన తల్లి పరిచారకులతో, “ఆయన మీతో చెప్పేది చేయండి” అని చెప్పింది. అక్కడ ఆరు రాతి నీటి బానలు ఉన్నాయి, యూదులు శుద్ధీకరణ ఆచారం కోసం వాటిని వాడుతారు. ఒక్కొక్క దానిలో వంద లీటర్ల నీళ్లు పడతాయి. యేసు, “ఆ బానలను నీటితో నింపండి” అని చెప్పారు; కాబట్టి ఆ పనివారు వాటిని అంచుల వరకు నింపారు. ఆయన వారితో, “ఇప్పుడు అందులో నుండి ముంచి తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి” అని చెప్పారు. వారు ఆ విధంగా చేసినప్పుడు, ఆ విందు ప్రధాని ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని రుచి చూశాడు. ఆ నీటిని తెచ్చిన పనివారికి తప్ప అది ఎక్కడ నుండి వచ్చిందో అతనికి తెలియలేదు. కాబట్టి అతడు పెండ్లికుమారుని ప్రక్కకు పిలిచి, “అందరు మొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి, అతిథులు త్రాగలేని స్థితిలో ఉన్నప్పుడు చౌక ద్రాక్షరసాన్ని పోస్తారు, కాని నీవైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసాన్నే ఉంచావు” అన్నాడు. గలిలయ ప్రాంతపు కానాలో యేసు ఈ మొదటి అద్భుతం చేసి తన మహిమను తెలియజేశారు. దీని వలన ఆయన శిష్యులు ఆయనను నమ్మారు. దీని తర్వాత యేసు తన తల్లి, తన సహోదరులు, తన శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్లారు. వారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. యూదుల పస్కా పండుగ దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్లారు. దేవాలయ ఆవరణంలో కొందరు ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మడం, మరికొందరు పరదేశి డబ్బులు మార్చే బల్లల దగ్గర కూర్చుని ఉండడం ఆయన చూశారు. ఆయన త్రాళ్లతో ఒక కొరడాను చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయ ఆవరణంలో నుండి బయటకు తోలివేసి, డబ్బు మార్చే వారి నాణాలను చెల్లాచెదురు చేసి వారి బల్లలను పడవేశారు. పావురాలను అమ్మేవారితో, “వీటిని ఇక్కడినుండి తీసివేయండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చడం మానేయండి!” అన్నారు. “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది” అని వ్రాయబడి ఉన్నదని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు యూదులు, “ఇదంతా చేయడానికి నీకు అధికారం ఉన్నదని నిరూపించడానికి మాకు ఏ సూచనను చూపిస్తావు?” అని ఆయనను అడిగారు. యేసు, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు రోజుల్లో దానిని తిరిగి లేపుతాను” అని వారికి జవాబిచ్చారు. దానికి వారు, “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు మూడు దినాల్లో దానిని తిరిగి లేపుతావా?” అని అడిగారు. అయితే ఆయన తన శరీరమనే దేవాలయం గురించి చెప్పారు. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత, ఆయన శిష్యులు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. వారు లేఖనాలను, యేసు చెప్పిన మాటలను నమ్మారు. పస్కా పండుగ సమయంలో ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను చూసిన చాలామంది ఆయన పేరును నమ్మారు. అయితే యేసుకు ప్రజలందరి గురించి తెలుసు కాబట్టి, ఆయన తనను తాను వారికి అప్పగించుకోలేదు. ప్రతి ఒక్కరి అంతరంగం ఏమిటో ఆయనకు తెలుసు, కాబట్టి మానవుల గురించి ఎవరూ ఆయనకు సాక్ష్యమిచ్చే అవసరం లేదు.

షేర్ చేయి
యోహాను 2 TSA

యోహాను 2:1-25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. ఆ పెళ్ళికి యేసునూ ఆయన శిష్యులనూ కూడా పిలిచారు. విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, “వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. యేసు ఆమెతో, “అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది. యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి. యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. అప్పుడు ఆయన, “ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో, “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు. యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు. ఇదయ్యాక ఆయన తన తల్లీ, సోదరులూ, శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్ళాడు. అక్కడ వారు కొన్ని రోజులు ఉన్నారు. యూదుల పండగ పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు. అక్కడ దేవాలయంలో ఎద్దులనూ, గొర్రెలనూ, పావురాలనూ అమ్ముతున్న వారిని చూశాడు. అక్కడే కూర్చుని డబ్బు మారకం చేసే వారిని కూడా చూశాడు. ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వారందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులనూ కూడా అక్కడి నుంచి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వారి బల్లలను పడదోశాడు. వారి డబ్బును చెల్లాచెదరు చేశాడు. పావురాలు అమ్మేవారితో ఆయన, “వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి” అన్నాడు. ఆయన శిష్యులు, “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది” అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు ఈ పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి ఏ సూచన చూపుతావు?” అన్నారు. దానికి యేసు, “ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీన్ని లేపుతాను” అన్నాడు. అప్పుడు యూదు అధికారులు, “ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీన్ని మూడు రోజుల్లోనే లేపుతావా?” అన్నారు. అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి. ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు. ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు. అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు. ఆయనకు మనుషుల అంతరంగం బాగా తెలుసు. ఎవరూ మనుషుల గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు.

షేర్ చేయి
యోహాను 2 IRVTEL

యోహాను 2:1-25 TERV (పవిత్ర బైబిల్)

మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది. యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు. ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది. ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి. యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు. ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో, “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు. యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది. ఇది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్దిరోజులు బస చేసారు. యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు. ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని, పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు. త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు. పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు?” అని అన్నాడు. ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు: “నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది.” యూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికారమున్నదని నమ్ముతాము” అని అన్నారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.” యూదులు, “ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు. కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి. ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు. పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాల్ని ప్రజలు చూసారు. వాళ్ళకు ఆయన పట్ల విశ్వాసము కలిగింది. కాని ఆయనకు మానవ స్వభావము తెలుసు. కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు. మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల్ని గురించి ఆయనకు ఎవడును సాక్ష్యం చెప్పనవసరం లేదు.

షేర్ చేయి
యోహాను 2 TERV

యోహాను 2:1-25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మూడవదినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి –ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి పావురములు అమ్మువారితో–వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు– నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి. కాబట్టి యూదులు –నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు –ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడుదినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు–ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడుదినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను. ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.

షేర్ చేయి
యోహాను 2 TELUBSI