యోహాను 19:28-37

యోహాను 19:28-37 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆ తర్వాత, యేసు అంతా ముగిసినదని గ్రహించి లేఖనాలు నెరవేరేలా, “దాహంగా ఉంది” అన్నారు. అక్కడే ఉన్న ఒక పులిసిన ద్రాక్షరసం పాత్రలో వారు ఒక స్పంజీని చిరకలో ముంచి, హిస్సోపు చెట్టు కొమ్మకు చుట్టి, యేసు పెదవులకు దానిని అందించారు. ఆయన పులిసిన ద్రాక్షరసం పుచ్చుకుని, “సమాప్తమైనది” అని చెప్పి యేసు తన తలను వంచి తన ప్రాణం విడిచారు. అది సిద్ధపాటు రోజు, మరుసటి దినం ప్రత్యేకమైన సబ్బాతు దినము. సబ్బాతు దినాన సిలువపై వారి దేహాలు ఉండకూడదని యూదా నాయకులు భావించి సిలువవేయబడిన వారి కాళ్లను విరగ్గొట్టి, వారి దేహాలను క్రిందికి దింపివేయాలని వారు పిలాతును అడిగారు. కాబట్టి సైనికులు వచ్చి యేసుతో పాటు సిలువ వేసిన మొదటివాడి కాళ్లను తర్వాత రెండవవాడి కాళ్లను విరుగగొట్టారు. కాని వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయారని గ్రహించి ఆయన కాళ్లను విరుగగొట్టలేదు. కాని సైనికుల్లో ఒకడు బల్లెంతో యేసుని ప్రక్కలో పొడిచాడు. వెంటనే రక్తం నీరు కారాయి. అది చూసినవాడు సాక్ష్యం ఇచ్చాడు, అతని సాక్ష్యం నిజము. అతడు నిజం చెప్తున్నాడని అతనికి తెలుసు. మీరు కూడా నమ్మడానికి అతడు సాక్ష్యమిస్తున్నాడు. లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరువబడలేదు” అని నెరవేరేలా ఇది జరిగింది. ఇతర లేఖనాల్లో, “వారు తాము పొడిచిన వానివైపు చూస్తారు” అని వ్రాయబడి ఉంది.

యోహాను 19:28-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, “నాకు దాహంగా ఉంది,” అన్నాడు. అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు. యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు. అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు. కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు. వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే. “అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి. “వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది.

యోహాను 19:28-37 పవిత్ర బైబిల్ (TERV)

ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన, “నాకు దాహం వేస్తోంది” అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజంకావటానికి ఇలా జరిగింది. పులిసిన ద్రాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజి ఆ కడవలో ముంచి, హిస్సోపు చెట్టుకొమ్మపై ఆ స్పాంజి పెట్టి, దాన్ని యేసు పెదాలకు అందించారు. ఆయన దాన్ని రుచిచూచి, “అంతా ముగిసింది” అని అన్నాడు. ఆ మాట అన్నాక, తలవాల్చి ఆత్మను అప్పగించాడు. అది పండుగకు సిద్దమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు కనుక ఆ రోజు వాళ్ళను సిలువపై వదిలి వేయటం యూదులకు యిష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగ్గొట్టి వారిని క్రిందికి దింపి వెయించుమని పిలాతును అడిగారు. భటులు వచ్చి యేసుతో సిలువకు వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగ్గొట్టారు. వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి ఆయన అప్పటికే చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్ళు ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. దానికి మారుగా భటుల్లో ఒకడు యేసు డొక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు కారాయి. మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూసిన వాడు దీన్ని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకుతున్నట్లు అతనికి తెలుసు. లేఖనాల్లో వ్రాయబడిన విషయాలు నిజం కావటానికి యిలా జరిగింది. ఒకచోట ఇలా వ్రాయబడి ఉంది: “ఆయనలో ఒక్క ఎముక కూడ విరువబడదు.” మరొక చోట, ఇలా వ్రాయబడివుంది: “తాము పొడిచిన వాని వైపు వాళ్ళు చూస్తారు.”

యోహాను 19:28-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను. చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడి చెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును. –అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు –తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.