యోహాను 19:13-16
యోహాను 19:13-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పిలాతు ఈ మాటలను విని, యేసును బయటకు తీసుకువచ్చి, రాతి బాటగా ప్రసిద్ధి చెందిన స్థలంలో అతడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి గబ్బతా అని పేరు. అది పస్కాను సిద్ధపరచే రోజు, అప్పుడు ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది. పిలాతు, “ఇదిగో మీ రాజు” అని యూదులతో చెప్పాడు. కాని వారు, “అతన్ని తీసుకెళ్లండి! అతన్ని తీసుకెళ్లండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. “మీ రాజును నేను సిలువ వేయనా?” అని పిలాతు అడిగాడు. అప్పుడు ముఖ్య యాజకులు, “మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు. చివరికి పిలాతు సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు.
యోహాను 19:13-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’ లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు. అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు. వారు కేకలు పెడుతూ, “చంపండి, చంపండి, సిలువ వేయండి!” అని అరిచారు. పిలాతు వారితో, “మీ రాజును సిలువ వేయమంటారా?” అన్నాడు. ముఖ్య యాజకులు “మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు. అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు.
యోహాను 19:13-16 పవిత్ర బైబిల్ (TERV)
ఇది విని పిలాతు యేసును వెలుపలికి పిలుచుకొని వచ్చాడు. “రాళ్ళు పరచిన స్థలంలో” ఉన్న న్యాయపీఠంపై కూర్చున్నాడు. దీన్ని హీబ్రూ భాషలో “గబ్బతా” అని అంటారు. అది పస్కా పండుగకు సిద్ధపడబొయ్యేరోజు. అప్పుడు ఉదయం సుమారు ఆరు గంటల సమయం. పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు” అని అన్నాడు. కాని వాళ్ళు, “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. సిలువకు వేయండి!” అని కేకలు వేసారు. పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” అని అన్నాడు. ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు” అని సమాధానం చెప్పారు. తదుపరి, పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు అప్పగించాడు.
యోహాను 19:13-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు–ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు–ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు–మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు–కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.