యోహాను 18:19-23

యోహాను 18:19-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇంతలో ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన చేసిన బోధల గురించి ప్రశ్నించాడు. అందుకు యేసు, “నేను ప్రజలందరితో బహిరంగంగానే మాట్లాడాను. ఎప్పుడు యూదులందరు కూడుకొనే సమాజమందిరాల్లో దేవాలయాల్లోనే నేను బోధించాను. నేను రహస్యంగా ఏమి మాట్లాడలేదు. నన్నెందుకు ప్రశ్నించడం? నా మాటలు విన్నవారిని అడగండి. నేనేం చెప్పానో వారికి తెలుసు” అని అతనితో అన్నారు. యేసు ఇలా చెప్పినప్పుడు, అక్కడ నిలబడి ఉన్న అధికారులలో ఒకడు తన అరచేతితో యేసు చెంపమీద కొట్టి, “ఇదేనా ప్రధాన యాజకునికి సమాధానం చెప్పే పద్ధతి?” అని అడిగాడు. అందుకు యేసు, “నేను తప్పు మాట్లాడితే ఆ తప్పు ఏమిటో రుజువుచేయి. కాని నేను సత్యమే మాట్లాడాను, నీవు నన్ను ఎందుకు కొట్టావు?” అన్నారు.

యోహాను 18:19-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించీ, ఆయన ఉపదేశం గురించీ యేసును అడిగాడు. యేసు జవాబిస్తూ, “నేను బహిరంగంగానే ఈ లోకంతో మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులు సమావేశమయ్యే సమాజ మందిరాల్లో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా ఏమీ మాట్లాడలేదు. నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం మాట్లాడానో, నా మాటలు విన్న వారిని అడుగు. నేను మాట్లాడిన సంగతులు ఈ ప్రజలకు తెలుసు” అన్నాడు. యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, “ప్రధాన యాజకుడికి నువ్వు జవాబిచ్చే విధానం ఇదేనా?” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, ఆ తప్పు ఏమిటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?” అన్నాడు.

యోహాను 18:19-23 పవిత్ర బైబిల్ (TERV)

ప్రధానయాజకుడు యేసును ఆయన శిష్యుల్ని గురించి, ఆయన బోధిస్తున్న విషయాల్ని గురించి ప్రశ్నించాడు. యేసు, “నేను సమాజమందిరాలలోను, యూదులు సమావేశమయ్యే దేవాలయంలోను బహిరంగంగా ఈ ప్రపంచానికి బోధించేవాణ్ణి. నేను రహస్యంగా ఏదీ బోధించలేదు. అలాంటప్పుడు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పిన వాటిని గురించి, నా బోధనలను విన్న వాళ్ళను అడగండి. నేను చెప్పినవి వాళ్ళకు తెలుసు” అని అన్నాడు. యేసు ఈ విధంగా మాట్లాడటం వలన ఆయన ప్రక్కన నిలుచున్న ఒక రక్షక భటుడు ఆయన చెంప మీద కొడుతూ, “ప్రధానయాజకునితో అలాగేనా మాట్లాడటం?” అని అన్నాడు. యేసు, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు కొట్టావు?” అని అడిగాడు.

యోహాను 18:19-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధనుగూర్చియు యేసును అడుగగా యేసు–నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు. నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు – ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు–నేను కాని మాట ఆడినయెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడినయెడల నన్నేల కొట్టుచున్నావనెను.