యోహాను 11:1-7

యోహాను 11:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

బేతనియ గ్రామానికి చెందిన మరియ, మార్తల సహోదరుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్న లాజరు సహోదరియైన మరియ ఈమెనే ప్రభువు పాదాల మీద పరిమళద్రవ్యాన్ని పోసి తన తలవెంట్రుకలతో తుడిచింది. కాబట్టి అతని సహోదరీలు, “ప్రభువా, నీవు ప్రేమించినవాడు అనారోగ్యంగా ఉన్నాడు” అని కబురు పంపించారు. యేసు అది విని, “ఈ అనారోగ్యం చావు కోసం వచ్చింది కాదు. దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించారు. లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విని కూడా తాను ఉన్న చోటే మరో రెండు రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “యూదయ ప్రాంతానికి వెళ్దాం రండి” అని అన్నారు.

యోహాను 11:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, మార్త అతని సోదరీలు. ఈ మరియే ప్రభువు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియ. అప్పుడు ఆ అక్క చెల్లెళ్ళు, “ప్రభూ, నువ్వు ప్రేమించే వాడికి జబ్బు చేసింది” అని యేసుకు కబురు పంపించారు. యేసు అది విని, “ఈ జబ్బు చావు కోసం రాలేదు. దీని ద్వారా దేవుని కుమారుడికి మహిమ కలిగేలా దేవుని మహిమ కోసమే వచ్చింది” అన్నాడు. మార్తను, ఆమె సోదరిని లాజరును యేసు ప్రేమించాడు. లాజరు జబ్బు పడ్డాడని యేసు విని కూడా తాను ఉన్న చోటనే ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు. దాని తరువాత ఆయన తన శిష్యులతో, “మనం మళ్ళీ యూదయకు వెళ్దాం పదండి” అన్నాడు.

యోహాను 11:1-7 పవిత్ర బైబిల్ (TERV)

బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు. ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు. ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు. యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కలుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు. యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది. లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి, ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.

యోహాను 11:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి . గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కచెల్లెండ్రు – ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని–యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను. అటుపిమ్మట ఆయన–మనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా