యోహాను 1:6-13
యోహాను 1:6-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యోహాను అనే పేరుగల ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి పంపబడ్డాడు. ప్రజలందరు తన ద్వారా ఆ వెలుగును నమ్మాలని ఆ వెలుగుకు సాక్షిగా అతడు వచ్చాడు. అయితే అతడు ఆ వెలుగు కాదు కాని, ఆ వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి మాత్రమే వచ్చాడు. ప్రతి వ్యక్తికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వస్తూ ఉండేది. ఆయన వలననే లోకం కలిగింది కాని, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చారు, కాని వారు ఆయనను అంగీకరించలేదు. అయినా ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన పేరును నమ్మిన వారికందరికి దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చారు. ఈ పిల్లలు శరీర కోరికల వలన, మానవుల నిర్ణయాల వలన, భర్త కోరిక వలన పుట్టలేదు కాని దేవుని మూలంగా పుట్టారు.
యోహాను 1:6-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను. అందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు. ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది. లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు. కానీ వారు ఆయనను స్వీకరించలేదు. తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు. వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు.
యోహాను 1:6-13 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు. అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ వుండెను. ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు. ఆయన తన స్వంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు. అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు. కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరక వాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.
యోహాను 1:6-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతిమనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.