యోహాను 1:43-50
యోహాను 1:43-50 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మరుసటిరోజు యేసు గలిలయకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఫిలిప్పును చూసి, “నన్ను వెంబడించు” అని చెప్పారు. ఫిలిప్పు కూడా పేతురు, అంద్రెయల పట్టణమైన బేత్సయిదాకు చెందిన వాడు. ఫిలిప్పు నతనయేలును చూసి అతనితో, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను మేము కనుగొన్నాము. ఆయనే యోసేపు కుమారుడైన, నజరేయుడైన యేసు” అని చెప్పాడు. “నజరేతా! ఆ ఊరి నుండి మంచిది ఏదైనా రాగలదా?” అని నతనయేలు అడిగాడు. అందుకు ఫిలిప్పు, “వచ్చి చూడు” అన్నాడు. నతనయేలు తన దగ్గరకు రావడం చూసిన యేసు, “ఇతడు ఏ కపటం లేని నిజమైన ఇశ్రాయేలీయుడు” అన్నారు. అందుకు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అని అడిగాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువకముందే నీవు ఆ అంజూర చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అని చెప్పారు. అప్పుడు నతనయేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలుకు రాజువు” అని సమాధానం ఇచ్చాడు. అందుకు యేసు, “నీవు ఆ అంజూర చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూసానని చెప్పినందుకు నీవు నమ్మావు. దీని కంటే గొప్ప కార్యాలను నీవు చూస్తావు” అని అతనితో చెప్పారు.
యోహాను 1:43-50 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు. ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు. దానికి నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?” అన్నాడు. ఫిలిప్పు, “నువ్వే వచ్చి చూడు” అన్నాడు. నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు. అప్పుడు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అన్నాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు. దానికి నతనయేలు, “బోధకా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే” అని ఆయనకు బదులిచ్చాడు. అందుకు యేసు, “ఆ అంజూరు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలు చూస్తావు” అన్నాడు.
యోహాను 1:43-50 పవిత్ర బైబిల్ (TERV)
మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు. ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు. నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు. “వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు. నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు. “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు. యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు. నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు. యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు.
యోహాను 1:43-50 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని – ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు – నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా–వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి–ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను. –నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు–ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు–బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు –ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను.