యిర్మీయా 8:4-7 - Compare All Versions

యిర్మీయా 8:4-7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘మనుష్యులు పడిపోయినప్పుడు, వారు లేవరా? ఎవరైనా ప్రక్కకు తొలగిపోతే, వారు వెనుకకు తిరిగి రారా? అలాంటప్పుడు ఈ ప్రజలు ఎందుకు దారి తప్పారు? యెరూషలేము ఎప్పుడూ ఎందుకు వెనుదిరుగుతుంది? వారు మోసానికి అంటిపెట్టుకుని ఉంటారు; వారు తిరిగి రావడానికి నిరాకరిస్తారు. నేను జాగ్రత్తగా విన్నాను, కానీ వారు సరియైనది చెప్పరు. “నేనేం చేశాను?” అని అంటూ, వారిలో ఎవ్వరూ తమ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపపడరు. యుద్ధంలోకి గుర్రం దూసుకెళ్లినట్లుగా, ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గాన్ని వెంటే వెళ్తారు. ఆకాశంలోని కొంగకు కూడా తన నిర్ణీత కాలాలు తెలుసు, అలాగే పావురం, వేగంగా ఎగిరే పక్షి, ఓదె అనే పక్షులు తమ వలస సమయాన్ని గమనిస్తాయి. అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధులు తెలియవు.

షేర్ చేయి
యిర్మీయా 8 TSA

యిర్మీయా 8:4-7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా ఇలా చెబుతున్నాడని వారితో చెప్పు. “కిందపడిన మనుషులు లేవకుండా ఉంటారా? దారి తప్పిపోయిన వారు తిరిగి రావడానికి ప్రయత్నించకుండా ఉంటారా?” మరి ఈ ప్రజలు, యెరూషలేము ఎందుకు దారి తప్పి శాశ్వతంగా తిరిగి రాకుండా ఉన్నారు? వారు ఎందుకు మోసంలో నిలిచి ఉండి పశ్చాత్తాప పడడానికి ఒప్పుకోవడం లేదు? నేను వారి మాటలు జాగ్రత్తగా ఆలకించాను. కానీ వారు ఒక్కటి కూడా మంచి మాట పలకలేదు. “నేనిలా చేశానేమిటి?” అని తన తన చెడ్డ పని గురించి పశ్చాత్తాపపడే వాడు ఒక్కడూ లేడు. యుద్ధంలోకి చొరబడే గుర్రం లాగా ప్రతివాడూ తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు. ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు దాని కాలాలు తెలుసు. తెల్ల గువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకులకు అవి తిరిగి రావలసిన సమయాలు తెలుసు. అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధి తెలియదు.

షేర్ చేయి
యిర్మీయా 8 IRVTEL

యిర్మీయా 8:4-7 TERV (పవిత్ర బైబిల్)

“యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు తెలియజేయుము: ‘యెహోవా ఈ విషయాలు చెప్పినాడు: “‘ఒక వ్యక్తి క్రింద పడితే తిరిగి లేస్తాడని మీకు తెలుసు. ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్లితే అతడు మరల తిరిగి వెనుకకు వస్తాడు. యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు. కాని యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు పెడమార్గాన వెళ్లుచున్నారు? వారి అబద్ధాలను వారే నమ్ముతారు. వారు వెనుదిరిగి రావటానికి నిరాకరిస్తారు. వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను. కాని వారు ఏది సరైనదో తెలియజెప్పరు. ప్రజలు వారి పాపాలకు విచారించుట లేదు. ప్రజలు వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు. ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు. వారు యుధ్ధానికి పరుగెత్తే గుర్రాల్లా ఉన్నారు. ఆకాశంలో ఎగిరే పక్షులకు సైతం తమ పనులకు ఒక నిర్ణీత కాలం తెలుసు. కొంగలు, గువ్వలు, వాన కోవిలలు, ఓదెకరువులు (ఒక జాతి కొంగ) వీటన్నిటికీ ఇతర ప్రాంతాలకు వలసపోయే కాలము క్రమము తప్పక తెలుసు. కాని నా ప్రజలకు మాత్రం వారి యెహోవా వారిని ఏమి చేయమని కోరుతున్నాడో తెలియదు.

షేర్ చేయి
యిర్మీయా 8 TERV

యిర్మీయా 8:4-7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము–మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్ర యము చేసికొని తిరిగి రామని యేల చెప్పుచున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు–నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేక పోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశమున ఎగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.

షేర్ చేయి
యిర్మీయా 8 TELUBSI